పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే ఎన్నో విదేశీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. తాజా ప్రయోగం ద్వారా తొలిసారి బ్రెజిల్ ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపింది. ఆ దేశానికి చెందిన అమేజోనియా-1 తో పాటు మరో 18 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చింది ఇస్రో. వీటిలో 14 విదేశీ ఉపగ్రహాలతో పాటు.. 4 స్వదేశీ ఉపగ్రహాలు వున్నాయి. ప్రయివేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీష్ ధావన్, యూనీశాట్ వంటి ఉపగ్రహాలు కూడా వున్నాయి. ఎన్నో ప్రత్యేకతలు కూడిన ఈ ప్రయోగంలో ఉపగ్రహాలపై మొత్తం 20 వేల మంది పేర్లను రాశారు. ఇందులో 900 మంది విదేశీయుల పేర్లు, చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లు ఉన్నాయి. అలాగే, అంతరిక్షంలోకి తొలిసారి భగవద్గీతను, మోదీ ఫోటోలను పంపారు. కానీ, ఇదే ప్రయోగంలో ఓ శక్తిమంతమైన అస్త్రాన్ని కూడా ప్రయోగించిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే ‘సింధు నేత్ర’ ఉపగ్రహం. అసలేంటీ సింధు నేత్ర..? దీని ప్రత్యేకతలేంటి..?
డీఆర్డీవో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సింధు నేత్ర శత్రువుల పాలిట బ్రహ్మాస్త్రం. భూతలంపైనే కాదు, సముద్ర జలాలను సైతం జల్లెడ పట్టే నిఘానేత్రం. ముఖ్యంగా వాస్తవాధీన రేఖతో పాటు.. హిందూ మహాసముద్ర జలాల్లో చైనా నక్కజిత్తులకు చెక్ పెట్టే శాటిలైట్ వెపన్. 4 వేల కిలోమీటర్ల మేర విస్తరించి వున్న చైనా సరిహద్దులను కాపు కాయాలంటే.. సరిహద్దుల్లో చైనా కుట్రలను తిప్పికొట్టాలంటే.. కనీసం ఆరు నిఘా ఉపగ్రహాలు కావాలని భద్రతా బలగాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. అంతేకాదు, హిందూ మహాసముద్రంపై నిఘా ఉంచాలని భారత్ ఎప్పటి నుంచో భావిస్తుంది. ఎందుకంటే హిందూ మహాసముద్ర జలాల్లో చైనా తరుచూ ఉద్రిక్తతలను పెంచిపోషిస్తోంది. దీంతో చైనా కుట్రలను ముందే పసిగట్టి పటాపంచలు చేయడానికి.. సింధు నేత్ర వంటి నిఘా ఉపగ్రహాలు ఎంతో ఉపయోగపడతాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఇటీవలికాలంలో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.. త్రివిధ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రక్షణ అవసరాలను గుర్తించి.. సాంకేతికసాయం అందించడంలో ముందుంటోంది. ఇందులో భాగంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా పది ఎర్త్ అబ్సర్వేషన్ శాటిలైట్లను నింగిలోకి పంపించింది ఇస్రో. వీటిలో మూడు కమ్యూనికేషన్ శాటిలైట్లతో పాటు.. రెండు నావిగేషన్ శాటిలైట్లు కూడా వున్నాయి. 2019లో ఇస్రో పంపించిన రీశాట్ – 2బీఆర్1 ఉపగ్రహం.. ఇప్పటికే సరిహద్దుల్లో నిఘా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 26/11 ముంబయి పేలుళ్ల తర్వాత అంతరిక్ష నిఘా అవసరాన్ని గుర్తించిన భారత్.. రీశాట్ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. అంతేకాదు, ఇస్రో అందించిన కార్టోశాట్ వంటి ఆప్టికల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లు సరిహద్దులను నిరంతరం పహారా కాస్తున్నాయి.