ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలోని ఒక హార్డ్‌వేర్ దుకాణంలో దొంగతనానికి సంబంధించిన CCTV ఫుటేజీ బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఒక విచిత్రమైన కారణం ఉంది. హార్డ్‌వేర్ దుకాణాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో అందులోకి ప్రవేశించిన ఓ దొంగ అందులో ఉండగానే డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ‘డ్యాన్స్ దొంగ’ కోసం వెతుకుతున్నారు.
ఈ ఘటన చోటు చేసుకున్న హార్డ్‌వేర్ స్టోర్ చందౌలీ మార్కెట్‌లో ఉంది. అన్షు సింగ్ అనే వ్యక్తికి చెందిన షాప్ ఇది. ఈ సంఘటన ఏప్రిల్ 16 తెల్లవారుజామున జరిగింది. పెద్దగా కష్టపడకుండానే షాప్‌లోకి ప్రవేశించిన దొంగ ముందుగా క్యాష్ కౌంటర్‌లో దొరికిన వాటిని ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాను గమనించాడు. అయితే దాన్ని చూసి అతడు భయపడలేదు. కెమెరాను చూసి డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. వైరల్ వీడియోలో, దొంగ ముఖం స్పష్టంగా కనిపించదు.. ముఖాన్ని గుడ్డతో జాగ్రత్తగా కప్పి ఉంచుకున్నాడు. అతను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వడంతోనే అతడు ఎంతో హ్యాపీగా ఉన్నాడని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
మరుసటి రోజు ఉదయం, యజమాని అన్షు సింగ్ దుకాణానికి చేరుకోగా.. అప్పటికే షట్టర్ పగలగొట్టి ఉండడాన్ని గమనించాడు. షాపులోకి వెళ్లి చూడగా డ్రాయర్‌లో నగదు కూడా కనిపించలేదు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ వింత డాన్స్ కనిపించింది. దీంతో చందౌలీ పోలీసులకు సమాచారం అందించారు.