అమెరికా ప్రపంచానికి ప్రమాదకరంగా మారనుందా..? రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు పెనుముప్పు కానుందా..? పేరుకే అగ్రరాజ్యమైనా అక్కడంతా తుపాకులే రాజ్యమేలుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికాలో తుపాకుల సంస్కృతి దాదాపు ఆ దేశ పుట్టుకతోనే మొదలైంది.
బ్రిటిష్ పాలనలో ఉండగా అమెరికాలో పోలీసు వ్యవస్థ గానీ, చెప్పుకోదగ్గ భద్రతా వ్యవస్థ గానీ లేకపోవడంతో స్వీయరక్షణ కోసం పౌరులు తుపాకులు చేపట్టడం మొదలుపెట్టారు. తుపాకుల వ్యాపారంలో బ్రిటిష్ కంపెనీలు విపరీతంగా ఆర్జించాయి. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే రెండో రాజ్యాంగ సవరణ పౌరులకు తుపాకులు ధరించే స్వేచ్ఛ కల్పించింది. ఇన్నేళ్లలో తుపాకీ సంస్కృతికి దేశంలో లక్షలాది మంది బలైనా తుపాకుల చట్టానికి చిన్నాచితకా మార్పులతో సరిపెడుతూ వచ్చారు. ఇందుకు ప్రధాన కారణం అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్.
అమెరికా అంతర్యుద్ధంలో పాలుపంచుకున్న ఇద్దరు సైనికులు తుపాకుల సంస్కృతిని ప్రచారం చేసేందుకు 1871లో ఎన్‌ఆర్‌ఏను స్థాపించారు. ప్రభుత్వం ఎప్పుడు తుపాకుల నియంత్రణకు ప్రయత్నించినా ఈ సంస్థ లాబీయింగ్‌తో దాన్ని విజయవంతంగా అడ్డుకుంటూ వస్తోంది. సెనేటర్లను ప్రలోభపెట్టేందుకు, ప్రభావితం చేసేందుకు తన దగ్గరున్న అపార వనరులను ఏటా భారీగా వెదజల్లుతోంది. పైగా మాజీ అధ్యక్షులు, నేతలు, సినీ స్టార్ల వంటి ప్రముఖులెందరో ఈ సంస్థలో సభ్యులు. ఇటీవల పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. తుపాకుల నియంత్రణ కోసం కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్‌ఆర్‌ఏకు దీటుగా నిధులు సేకరించి తుపాకీ సంస్కృతి వ్యతిరేక ప్రచారానికి వెచ్చిస్తున్నాయి. ఈ సంస్థలు 2018లో తొలిసారి ఎన్‌ఆర్‌ఏ కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు అంచనా.
తుపాకుల వాడకం, నియంత్రణ విషయంలో అమెరికా పౌరులు కూడా రెండుగా చీలిపోయారు. తుపాకుల వాడకంపై గట్టి నియంత్రణ ఉండాలని కేవలం 52 శాతం మందే కోరుతున్నట్టు గాలప్ అనే సంస్థ 2020లో చేసిన సర్వేలో తేలింది. తుపాకుల వాడకానికి ఉన్న స్వేచ్ఛ ఇలాగే కొనసాగాలని 32 శాతం చెప్పారు. 11 శాతం మందైతే ప్రస్తుతమున్న కొద్దిపాటి నియంత్రణను కూడా ఎత్తేయాలంటున్నారు! చట్టసభ్యుల విషయానికొస్తే డెమొక్రాట్లలో 91 శాతం, రిపబ్లికన్లలో 24 శాతం తుపాకులపై నియంత్రణ డిమాండ్‌కు మద్దతిస్తున్నారు.
మన దగ్గర కూరగాయల దుకాణాల్లాగే అమెరికాలో అడుగడుగునా తుపాకుల దుకాణాలున్నాయి. తుపాకీ సంపాదించడం అమెరికా పౌరులకు చాలా సులువైన వ్యవహారం. 21 ఏళ్లు దాటి, నేరచరిత్ర, మానసిక సమస్యలు లేకుంటే చాలు. తుపాకీ లైసెన్సు దొరికేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు ఏకంగా 120 తుపాకులున్నాయి..! ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న యెమన్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరి వద్ద మాత్రమే తుపాకీ ఉంది.