వివేక్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్ వార్’..! ‘ది కశ్మీర్ ఫైల్స్’ను మించిపోతుందా..?

0
686

‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఈ సినిమా పేరు గుర్తుంది కదా..! కశ్మీర్ పండిట్ల నరకయాతనను కళ్లకు కట్టిన ఆ సినిమాను ఎలా మర్చిపోతాం. ఇస్లామిక్ రాక్షసుల రక్తదాహానికి అద్దం పట్టిన ఆ విషాద దృశ్యాలు ఇంకా మన మస్తిష్కంలో మెదులుతూనేవున్నాయి. అత్యంత తక్కువ బడ్జెట్‎తో తెరకెక్కిన ఆ వాస్తవ చరిత్ర.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అనేకదా మీ అనుమానం. అక్కడికే వస్తున్నా. కశ్మీర్ పండిట్ల విషాద గాథను.. అత్యంత హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. ఇప్పుడు మరో వాస్తవ గాథకు తెరరూపం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమా పేరే ‘ది వ్యాక్సిన్ వార్’..! ఎప్పుడూ విభిన్న కథాంశాలతో చిత్రాలను నిర్మించే వివేక్.. ఈసారి భారతీయ వ్యాక్సిన్లపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా ‘ది వ్యాక్సిన్ వార్’ పోస్టర్‎ను కూడా తన ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాను ఏకంగా 11 భాషల్లో విడుదల చేస్తున్నామని.. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ట్విట్టర్‎ వేదికగా మరోసారి కోవిడ్ వ్యాక్సిన్లపై తీవ్ర చర్చ జరుగుతోంది.

కరోనా బారి నుంచి మన దేశంతో పాటు.. 100కు పైగా దేశాలను రక్షించడంలో భారతీయ వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. భారత్ వ్యాక్సిన్ మైత్రితో పాటు.. కొవిడ్ సమయంలో భారత్ ఎదుర్కొన్న సవాళ్ళను కథాంశంగా తీసుకుని వివేక్ సినిమా నిర్మిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు వివేక్ అగ్నిహోత్రి కూడా మీడియాతో మాట్లాడుతూ.. తన సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. తన కొత్త సినిమాలో భారత వ్యాక్సిన్ గురించిన సంచలన విషయాలను చూపబోతున్నామని తెలిపారు. దేశమంతా కోవిడ్ లాక్ డౌన్ విధించినప్పుడు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా వాయిదా పడిందన్నారు. అప్పుడే తమకు వ్యాక్సిన్లపై సినిమా తీయాలనే కుతూహలం కలిగిందని చెప్పుకొచ్చారు. ఈ ఉత్సాహంతోనే తాము భారత్ లో వ్యాక్సిన్ లను తయారు చేసిన ICMR, NIV శాస్త్రవేత్తలను కలిశామని తెలిపారు. భారత్ లో వ్యాక్సిన్ తయారీ లో శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేశారని అన్నారు. వారు తమ సంతోషాలను త్యాగం చేసి,.. కుటుంబానికి దూరంగా రాత్రింబవళ్ళూ కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. శాస్త్రవేత్తలు ఈ విధంగా శ్రమించడం వల్లే వ్యాక్సిన్ పోరాటంలో భారత్ గొప్ప విజయం సాధించిందనీ,.. ప్రపంచదేశాలతో పాటు పోటీపడి తక్కువ ధరకే సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేశారనీ అన్నారు.

దీన్ని బట్టి చూస్తే భారత శాస్ట్రవేత్తల గొప్పదనాన్ని గురించి ఈ సినిమాలో చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే కొవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు భారత్ వ్యాక్సిన్ పరంగా ఎటువంటి కష్టకాలం వచ్చిందో తొంగి చూడాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ మెల్ల మెల్లగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అగ్రదేశాల నుంచి చిన్నా చితకా దేశాలన్నిటినీ కుదిపేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఆయా దేశాల్లోని ప్రజలంతా ఈ మహమ్మారికి పిట్టల్లా రాలిపోయారు. దీంతో, కొవిడ్ వ్యాధికి సరైన చికిత్స లేకపోవడంతో వ్యాక్సిన్లు వచ్చే వరకు మరింత విజృంభించకుండా కట్టడి చేయాలనే ఉద్దేశంతో అన్ని దేశాలూ లాక్ డౌన్ లను విధించాయి. కానీ,.. ఈ మహమ్మారి లాక్ డౌన్లతోనూ కట్టడి కాలేదు. నెమ్మది నెమ్మదిగా ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ సమయంలోనే ప్రపంచ దేశాలన్నీ త్వరితగతిన వ్యాక్సిన్లను కనిపెట్టడానికి చర్యలు తీసుకున్నాయి. అగ్రదేశాల వద్ద కావాల్సినన్ని నిధులు, మౌలిక సదుపాయాలు ఉండటంతో.. పరిశోధనలు జోరుగా సాగాయి. అదే సమయంలో భారత్‎లో కూడా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు.

మరోవైపు దేశమంతా లాక్ డౌన్ విధించడంతో భారత్ ఆర్థికంగా కుంగిపోతూ వచ్చింది. ప్రజలకు సరైన ఉపాధిలేక కష్టాలను అనుభవించారు. చిరు వ్యాపారులైతే మరీ ఇబ్బందులు ఎదుర్కొని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దీంతో వీరందరినీ మహమ్మారి నుంచి కాపాడాల్సిన బాధ్యత భారత శాస్త్రవేత్తలపై పడింది. దీంతో పాటు భారత్ ను అగ్రదేశాల ఫార్మా కోరల నుంచి కూడా తప్పించాల్సిన అవసరమూ ఏర్పడింది. ఒకవేళ భారత్ కనుక వ్యాక్సిన్ లను తయారు చేయలేకపోతే అమెరికా, రష్యా లాంటి దేశాలు తాము చెప్పిన ధరకే భారత్ తో వ్యాక్సిన్లను కొనిపించేవి. భారత నిస్సహాయ స్థితిని చూసుకుని ఆయా దేశాలు రెట్టింపు ధరకు అమ్మినా తమ ప్రజల కోసం విధిలేక కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడేది. ఇదే జరిగితే భారత్ పై మరింత ఆర్థిక భారం పడేది. ఈ కారణాలతో అగ్రదేశాల ఫార్మా లాబీల నుంచి కూడా భారత్ ను కాపాడాల్సిన బాధ్యత శాస్త్రవేత్తల భుజాలపై పడింది. దీంతో శాస్త్రవేత్తలంతా ఎలాగైనా భారత్ కు వ్యాక్సిన్ ను అందించాలనే ధృఢ సంకల్పంతో పరిశోధనలు జరిపారు. ప్రధాని మోదీ సైతం శాస్త్రవేత్తలకు అడుగడుగునా అండగా నిలిచారు. ఆగమేఘాల మీద నిధులు మంజూరు చేశారు.

ఇక భారత శాస్త్రవేత్తలు ఈ బాధ్యతనంతా తమ భుజస్కంధాలపై మోసుకుని తమ మేధస్సుతో ఎట్టకేలకు వ్యాక్సిన్లను విజయవంతగా కనిపెట్టారు. అగ్రరాజ్యాలకు దీటుగా ఏకంగా రెండు వ్యాక్సిన్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి భారత్ సత్తా చాటారు. అది కూడా పూర్తి నాణ్యతతో అన్ని వేరియంట్లను తట్టుకుని నిలబడేలా ఈ వ్యాక్సిన్ లను తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. దీంతో భారత్ సత్తాను చూసి అగ్రదేశాలు సైతం నివ్వెరబోయాయి. భారత్ ప్రపంచదేశాల ముందు తలెత్తుకుని నిలబడగలిగింది. వ్యాక్సిన్ లను తయారు చేసిన తర్వాత అగ్రరాజ్యాల వ్యాక్సిన్ల కంటే.. భారత వ్యాక్సిన్లే ఎక్కువ ప్రభావం చూపినట్టు ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇంతటి గొప్ప విజయం సాధించడంలో భారత శాస్త్రవేత్తల కృషి మరువలేనిది. అయితే శాస్త్రవేత్తల కృషిని పొగడాల్సిన మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు వీరి కష్టాన్ని అవహేళన చేశాయి. ఇవి బీజేపీ వ్యాక్సిన్లని కొందరు, ఈ వ్యాక్సిన్లు నీళ్ళతో సమానమని మరికొందరు.. శాస్త్రవేత్తలను అవమానించే ప్రయత్నం చేశారు. ఇక విదేశీ కాసుల కక్కుర్తికి అలవాటుపడిన లెఫ్ట్ లిబరల్ కుహనా మీడియా సంస్థలదీ అదే వైఖరి. కొవిడ్ మృతులపై కెమరాలు ఫోకస్ చేసి.. శ్మశాన జర్నలిజాన్ని ప్రదర్శించాయి. స్వదేశీ వ్యాక్సిన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డిబేట్లు నడిపాయి. ఏదేమైనా, అగ్రరాజ్యాలు విషం చిమ్మినా.. విదేశీ తొత్తులుగా మారిన కుహనా మీడియా విష ప్రచారం చేసినా.. మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో కొవిడ్ మహమ్మారిని భారత్ విజయవంతంగా ఎదుర్కొంది. మనదేశంలో వ్యాక్సిన్ అవసరాలను తీరుస్తూనే.. నాడు వందకు పైగా దేశాలకు వ్యాక్సిన్లు అందించి.. ప్రపంచ దేశాలను ముక్కున వేలేసుకునేలా చేసింది భారత్.

అలాంటి మహత్తరమైన సంజీవనని అందించిన శాస్త్రవేత్తలకు మాత్రం రావాల్సినంత గుర్తింపు రాలేదు. అందుకే, వారి కష్టాలను సినిమా రూపంలో దేశ ప్రజలకు చూపించాలని సంకల్పించారు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. దీంతో ఈ సినిమాపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. సినిమా పేరు ప్రకటించిన నాటి నుంచి సోషల్ మీడియాలో సినిమాపై తీవ్ర చర్చ జరుగుతోంది. వివేక్ అగ్రిహోత్రికి కూడా ఇటువంటి సినిమాలు తీయడంలో మంచి పట్టు ఉండటంతో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈయన తీసిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ లాంటి సినిమాలకు భారీ స్పందన లభించింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కు అయితే దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిసింది. కశ్మీరీ పండిట్ల దీన గాథను చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. కశ్మీర్ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సంఘటన కూడా చరిత్ర ఆధారంగానే తీసిన ఈ సినిమా ఎంతో మందిని ఆకట్టుకుంది. దీంతో వివేక్ అగ్రిహోత్రికి మిగతా డైరెక్టర్ల కంటే భిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తాజాగా నిర్మిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ పై కూడా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. భారత్ కు వ్యాక్సిన్ అందించడానికి శాస్త్రవేత్తలు పడ్డ కష్టాల గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం సినిమా తీయడం శుభపరిణామం. అయితే ఈ సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ లాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలంటే వచ్చే స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఆగాల్సిందే. దానికంటే ముఖ్యంగా లెఫ్ట్ లిబరల్ కుహనావాదులు, విదేశీ పెంపుడు మీడియా పాడు దృష్టి ఈ సినిమాపై పడకూడదని.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా నిర్మాణం పూర్తికావాలని కోరుకుందాం. జైహింద్..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

1 × 2 =