More

  తైవాన్ కు గండం..! ‘గ్రే జోన్’ వ్యూహం..!!

  భౌగోళిక రాజకీయ ఉద్రిక్త మైదానం నుంచి అమెరికా క్రమంగా వెనక్కి తగ్గుతుంటే చైనా ఎదురుదాడిని మరింత ఉధృతం చేసింది. పెట్టుబడుల రూపంలో యూరేసియా దేశాల్లో ఇఫ్పటికే తిష్టవేసిన చైనా, ఆఫ్ఘన్ గుండెలపై ఉన్న క్రొమైట్, కోల్, కాపర్ గనుల్లో పాగావేసింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత డ్రాగన్ తన స్వరాన్ని పెంచింది. ఆపదలో ఉన్నవారిని వదిలేసి పారిపోవడమే వైట్ హౌస్ నైజమనీ, రాబోయే రోజుల్లో తైవాన్ విషయంలోనూ అదే జరిగి తీరుతుందని చైనా మీడియా కోడై కూస్తోంది.

  సీపీసీ అధికార గొంతుక గ్లోబల్ టైమ్స్ పత్రిక, ఆగస్ట్ 16న ‘‘Afghanistan today, Taiwan tomorrow? US treachery scares DPP’’ అంటూ తన అక్కసును వెళ్లగక్కింది. అందరినీ నట్టేట ముంచి తాను మాత్రం ఒడ్డుకుచేరే  అమెరికా తత్వం విషయంలో సందేహం అక్కరలేదు కానీ, చైనా ఆరోపణల వెనుక ప్రయోజనాలు అత్యంత ప్రమాదకరమైనవి అన్నది కఠోర వాస్తవం.  

  అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత కాస్త తగ్గిందని భావిస్తున్న తరుణంలో భౌగోళిక రాజకీయాల విషయంలో తిరిగి ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తైవాన్ విషయంలో చైనా తాజా వ్యాఖ్యలపై తైవాన్ ప్రిమియర్ సు సెంగ్ చాంగ్ ఘాటుగా ప్రతిస్పందించారు. తమపై డ్రాగన్ విషం కక్కుతోందని ఆరోపించారు. తమ దీవిని కబళించాలనే కుట్రలు సాగవని హెచ్చరించారు.

  తైవాన్ విషయంలో చైనా అక్కసు దేనికి? తైవాన్ విషయంలో భారత్, జపాన్, లిథువేనియాలతో చైనాకు ఉన్న ఘర్షణ ఏంటి? అమెరికా తైవాన్ బంధానికి పునాది ఏంటి? చైనా-తైవాన్ చారిత్రక వైరం ఎప్పుడు మొదలైంది? తైవాన్ గతంలో నిజంగానే చైనాలో భాగమా? తైవాన్ చైనాలు విడిపోయాయా? విడిపోతే ఎందుకు విడిపోయాయి? చైనా ‘తైవాన్ వ్యూహం’ లక్ష్యం ఏమై ఉంటుంది? భారత్ విషయంలో గతేడాది తైవాన్ చైనాకు ఇచ్చిన కౌంటర్ ఏంటి? తైవాన్ విషయంలో జపాన్-చైనాల మధ్య వివాదం ఎందుకు వచ్చింది?

  ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం.

  చైనా అమెరికా మధ్య విమర్శ, ప్రతివిమర్శల పర్వం మళ్లీ పుంజుకుంటోంది. లిథువేనియా విషయంలోనూ ఇదే జరిగింది. తైవాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందు అనుమతి ఇచ్చిందన్న కారణంగా ఆగస్ట్ మొదటివారంలో లిథువేనియాపై చైనా బెదిరింపులకు పాల్పడింది. లిథువేనియాలోని రాయబార కార్యాలయ ఉద్యోగులు తక్షణమే స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది.

  తైవాన్‌-లిథువేనియా బంధం చైనాకు కంటగింపుగా మారింది.  తాజాగా ఈ వివాదంపై అమెరికా గళమెత్తింది. లిథువేనియాకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ యూఎస్ డిప్యూటీ స్టేట్ సెక్రటరీ వెండీ షెర్మన్ ప్రకటన జారీ చేశారు. చైనా-తైవాన్ ల మధ్య ఈ ఏడాది మార్చిమాసంలో తైవాన్ పైనాపిల్ దిగుమతి విషయంలో మాటల యుద్ధం నడిచింది. పైనాపిల్ దిగుమతిని చైనా నిలిపివేసింది.

  హానికారక క్రిములు ఉన్నాయనీ, అవి తమ దేశంలో పంటను ప్రభావితం చేసే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. “తైవాన్ పైనాపిళ్లు ఫైటర్ జెట్ల కన్నా బలమైనవి. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు పండ్ల రుచిని తగ్గించలేవు” అంటూ తైవాన్ సరైన జవాబు ఇచ్చింది.

  ఇదే ఏడాది జూలైలో తైవాన్ విషయంలో జపాన్ పై విరుచుకుపడింది చైనా. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అణుబాంబు వేస్తానంటూ జూలై 19న హెచ్చరించింది. తైవాన్ అంశం తమ అంతర్గతం విషయమని ఎవరి జోక్యాన్ని సహించబోమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తైవాన్ కు సమీపంలోని సెనెకొకు దీవుల్లో మిసైళ్లను మోహరించాలన్న జపాన్ నిర్ణయం నేపథ్యంలో చైనా ఈ హెచ్చరికలు చేసింది.

  ప్రతి ఏటా అక్టోబర్ 10న జరిగే తైవాన్ నేషనల్ డే ఉత్సవాల సందర్భంగా తైవాన్‌- భారత్‌లు సహజ మిత్రులనే సందేశాన్ని ఇచ్చింది. ఇది డ్రాగన్ కు కోపం తెప్పించింది. చైనాతో దౌత్య సంబంధాలు ఉన్న దేశాలన్నీ ‘‘వన్‌- చైనా’’ పాలసీకి కట్టుబడి ఉండాలని హెచ్చరించింది. తైవాన్‌ ప్రకటనలపై  అసహనం వ్యక్తం చేసింది. తైవాన్‌ కూడా అందులో అంతర్భాగమని నొక్కి చెప్పింది.

  ఇదీ స్థూలంగా ఇటీవలి కాలంలో తైవాన్ విషయంలో చైనా చేసిన హెచ్చరికల సారాంశం.

  ఆఫ్ఘనిస్థాన్ ను నట్టేట ముంచినట్టే తైవాన్ ను కూడా అమెరికా ఒంటరిని చేసి పారిపోతుందని చైనా ఆగమేఘాలమీద ఎందుకు స్పందించినట్టూ అనే సందేహం వెనుక డ్రాగన్ వ్యూహం లేకపోలేదు. ఈ ఏడాది ఆగస్ట్ 17న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ సైనిక ప్రదర్శన కోసం తైవాన్ కు ఆగ్నేయంగా ఉన్న దీవుల వద్ద సముద్ర తలంలో, గగన తలంలో యుద్ధనావలు, సబ్ మెరైన్ లు, ఫైటర్ జెట్ లనూ మోహరించింది. దీనిపై అమెరికా స్పందించే అవకాశం ఉంది కాబట్టి తైవాన్ కు ఓ చిన్నపాటి హెచ్చరికను జారీ చేసింది.

  అమెరికా-తైవాన్ బంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

  అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తైవాన్‌ అనధికారిక రాయబారి బై కెమ్‌ షియావ్‌ హాజరయ్యారు. 1979 తరవాత తైవాన్‌ ప్రతినిధి అధికారికంగా హాజరుకావడం ఇదే తొలిసారి. తమదౌత్య ప్రతినిధులు, ఉన్నతాధికారులు తైవాన్‌తో సంబంధాలు నెరపకుండా విధించుకున్న స్వీయ ఆంక్షలను తొలగిస్తున్నట్లు  అమెరికా విదేశాంగశాఖ ఈ ఏడాది జనవరి తొలివారంలో ప్రకటించింది.

  ఈ చర్య బయటకు తైవాన్ కు మద్దతు ఇచ్చినట్టే కనిపించినా నిజానికి చైనాను హెచ్చరించేందుకే అంటారు నిపుణులు. అంతేకాదు, తైవాన్-అమెరికాల మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందాలు కూడా లేవు. తైవాన్‌ రక్షణకు అమెరికా బాధ్యత వహించే రాతపూర్వక ఒప్పందం కూడా లేదు. అమెరికాతో దౌత్య సంబంధాల పెంపు, ‘ఇండో-పసిఫిక్‌ స్ట్రాటజీ’లో తైవాన్‌ పాత్రను మరీ మరీ ప్రస్తావించడం చైనా అనుమానాలను మరింతపెంచాయి. చైనా అనుసరిస్తున్న ‘2049’ ప్రణాళికను వేగవంతం చేసే ప్రమాదం  కూడా పొంచి ఉందంటారు నిపుణులు. డ్రాగన్ ఇప్పటికే ‘గ్రే జోన్‌’ యుద్ధతంత్రాన్ని అవలంబిస్తోంది.

  బిల్‌క్లింటన్‌ తరవాత తైవాన్‌తో అత్యధికంగా 20 ఆయుధ ఒప్పందాలు చేసుకున్నారు నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా బాహటంగా వెల్లడించకపోయినా- తైవాన్‌ను ఒక దేశంగానే పరిగణిస్తోంది.  ఒక వేళ చైనాలో భాగమే అనుకుంటే సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఆయుధాలను ఎందుకు విక్రయిస్తుందనే ప్రశ్న రావడం సహజం. తైవాన్‌ సంబంధాల హామీ చట్టంపై గతేడాది డిసెంబరులో ట్రంప్ సంతకం చేశారు. తైవాన్ రిలేషన్స్ యాక్ట్’‌ ను సైతం అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.

  ఇందులో భాగంగా తైవాన్‌కు రక్షణ ఆయుధాలను అమెరికా సరఫరా చేయసాగింది. తైవాన్‌పై చైనా ఎలాంటి దాడి చేసినా అది తమను ‘తీవ్రమైన ఆందోళన’కు గురిచేస్తుందని అమెరికా ప్రకటించింది.

  ఈ నేపథ్యమే చైనా తాజా వైఖరికి మూలం.

  ఆసియా భౌగోళిక రాజకీయాలు, అమెరికా విదేశాంగ విధానం చైనాకు కంటుగా మారాయి. ఇరు దేశాలూ విదేశాంగ విధానాన్ని మౌలిక భావజాలంగా మార్చుకోవడమే ప్రమాదకర పరిణామం. నిజానికి శ్వేతసౌధం అవలంబించిన ఫారెన్ పాలసీ ఫలితాలను సాధించలేకపోయింది సరికదా…నష్టాలు కొనితెచ్చుకుంది. పరస్పర వాణిజ్య ప్రయోజనాలు తలపడుతున్న మైదానాలు యాదృచ్చికంగా వ్యూహాత్మక భూభాగాలు కావటం ఇరు దేశాల మధ్య చిచ్చుకు కారణమవుతోంది.

  అంతేకాదు, 2000 తర్వాత ప్రపంచ వేదికపై అమెరికా ప్రాభవం అప్రతిష్ఠపాలైంది. వందేళ్లు పూర్తి చేసుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ తన చుట్టూ  ఉన్న వ్యూహాత్మక భూభాగ వివాదాలను అడ్డగోలు పెత్తనంతో పరిష్కరించుకోవాలని చూస్తోంది. పసిఫిక్ లోని దీవులపై కన్నేసింది. అలాంటి దీవుల్లో ‘తైవాన్’ కూడా ఒకటి. చైనా-తైవాన్ ల మధ్య చారిత్రక బంధంతో పాటు వైరమూ ఉంది.

  దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపం తైవాన్. ఇక్కడే మొదట చైనా నుంచి వలస వెళ్లిన ‘ఆస్ట్రోనేసియన్’ గిరిజనులు స్థిరపడినట్లు భావిస్తారు. చైనా రికార్డుల ప్రకారం క్రీ.శ.239లో చైనాకు చెందిన దండయాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించారు. ఈ కారణంగానే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తుంది.

  1624 నుంచి 1661 డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తరువాత 200 ఏళ్లకు పైగా 1683 నుంచి 1895 వరకు చైనాకు సంబంధించిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలో ఉంది.17వ శతాబ్దం మొదట్లో చైనాలో నెలకొన్న భరించలేని పరిస్థితుల కారణంగా ఫూజియన్, గ్వాంగ్‌డాంగ్ ప్రావీన్సులకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో తైవాన్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం తైవాన్‌లో నివసిస్తున్న ప్రజల్లో ఎక్కువ మంది ఈ ప్రావీన్సుల నుంచి వలస వచ్చిన వారి వారసులే.

  1895లో మొదటి సినో-జాపాన్ యుద్ధంలో క్వింగ్‌ రాచరికం పతనమైంది. దీంతో తైవాన్, జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక తైవాన్‌పై జపాన్ నియంత్రణ కోల్పోయింది. అమెరికా, యూకే‌ల అనుమతితో తైవాన్‌ను మళ్లీ చైనా పాలించడం మొదలుపెట్టింది. కానీ, ఆ తరువాత కొన్నేళ్లకే చైనాలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి చైనా నాయకుడు చియాంగ్ కై-షెక్ బలగాలను మావో సేటుంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు ఓడించాయి. దీంతో 1949లో చియాంగ్‌ కై షేక్ తో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న 15లక్షల మంది ప్రజలు తైవాన్‌ లో స్థిరపడ్డారు.  తైవాన్ జనాభాలో వాళ్ల సంఖ్య 14శాతమే! చాలా ఏళ్లు వీరే తైవాన్ రాజకీయాలను శాసించారు.

  చివరి ఘడియల వరకూ చియాంగ్‌ కై షేక్ తైవాన్‌ను పాలించాడు. ఆ తరువాత చియాంగ్ కొడుకు చియాంగ్ చింగ్-కో అధికారం చేపట్టాడు. కానీ, తైవాన్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆయన 2000 సంవత్సరంలో ఎన్నికలకు అనుమతిచ్చాడు. అలా తైవాన్‌లో తొలిసారి షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది. దశాబ్దాల పాటు కొనసాగిన శతృత్వం, యుద్ధ హెచ్చరికల అనంతరం ఎనభయ్యో దశకంలో చైనా, తైవాన్ మధ్య సంబంధాలు మెరుగవ్వడం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా  ‘‘One country, two systems’’ సూత్రాన్ని చైనా తీసుకొ చ్చింది. చైనాతో మళ్లీ కలిసిపోవడానికి తైవాన్ ఒప్పుకుంటే, ఆ ద్వీపానికి పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చైనా హామీ ఇచ్చింది.

  తైవాన్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. 1991లో చైనాతో యుద్ధానికి సిద్ధమైంది తైవాన్.   2000 సంవత్సరంలో తైవాన్ ప్రజలు షెన్ షుయ్-బియాన్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు చైనా మరింత అప్రమత్తమైంది. షెన్ మొదట్నుంచీ స్వతంత్ర తైవాన్‌కు కట్టుబడి ఉన్నాడు. 2004లో కూడా మళ్లీ ఆయనే తైవాన్ అధ్యక్షుడయ్యారు. దీంతో, 2005లో చైనా వేర్పాటువాద వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది.

  తైవాన్ గనుక చైనా నుంచి వేరు పడే ప్రయత్నం చేస్తే సైనిక చర్య చేసేవిధంగా చట్టంలో పొందుపరిచింది. 2016లో ట్సాయ్ ఇంగ్-వెన్ తైవాన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ కూడా చైనా నుంచి స్వతంత్రంగా ఉండాలని ప్రకటించింది.  అధికారికంగా తైవాన్‌లోని డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ తైవాన్ స్వతంత్రతకే మద్దతిస్తుంది. డీపీపీపై చైనాకు కోపం రావడానికి కారణం స్వాతంత్ర్యంగా ఉండాలని కోరుకోవడమే! ఇదే తాజా అక్కసుకు కారణం.

  ఒకవేళ నిజంగానే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వ్యవహరించినట్టూ తైవాన్ మద్దతుపై కూడా అదే వైఖరి అవలంబిస్తే అది ఆ దేశానికి కీడు చేస్తుందో లేదో తెలియదు కానీ, దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెరగడంతో పాటు ఆసియాలో డ్రాగన్ ఆధిపత్యం మరింత స్థిరపడే ప్రమాదముంది.

  Trending Stories

  Related Stories