More

  ప్రభుత్వం వైఫల్యం.. పార్టీల ప్రమేయం..! వెలసి రైల్వేస్టేషన్ ధ్వంసం..!!

  దేశం..! మాతృభూమి..! ఈ రెండు మాటలు విన్నప్పుడు మదిలో మెదిలే తొలి దృశ్యం… సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికులు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం కంటే మించిన త్యాగం ఇంకేం ఉంటుంది. అందుకే… 18 ఏళ్లు నిండిన చాలా కుర్రాళ్లు సైన్యంలో చేరడమే తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆర్మీ యూనిఫాం వేసుకుంటే వచ్చే కిక్కే వేరు.

  రైఫిల్‌ పట్టుకుని… సరిహద్దుల్లో గస్తీ కాస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరికొందరు మాత్రం… చిన్న వయసులో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం. సమాజంలో సైనికుడనే గౌరవం. దేశమంతా పని చేసే అవకాశం తదితర కారణాలతో సైన్యంలో చేరడమే ఊపిరిగా బతుకుంటారు. వీటిని నిజం చేసుకోవడానికి.. లక్ష్యం వెంబడి పరిగెడుతూనే ఉంటారు. వీలైతే జవాన్‌… అవకాశం ఉంటే ఆఫీసర్‌ స్థాయిలో సైన్యంలో అడుగుపెట్టడానికి శక్తి మేర ప్రయత్నిస్తుంటారు. అయితే కరోనా కారణంగా… అన్ని రకాల ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి. నిత్యం జరిగే ఆర్మీ ర్యాలీలు నిలిచిపోయాయి. అంతమాత్రానికి ఇంత హింస ఎందుకు..?

  మొన్న త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల ఆందోళన.. నిన్న రాజ్ భవన్ ముట్టడిలో కాంగ్రెస్ హింస.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై ఆర్మీ అభ్యర్ధుల దాడి. ఈ ఘటనలు అన్నింటిని ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులోనూ ఇది భారీ కుట్ర అని పోలీసుల విచారణలో తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం రైల్వే స్టేషన్ పై దాడి చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇక కొన్ని రాజకీయ పార్టీల హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం ప్రభుత్వం వైఫల్యంతో మొదలు కొని రాజకీయ పార్టీల హస్తం వరకు రైల్వే స్టేషన్ ధ్వంసంలో కారణాలు తెలుస్తోంది. జవాన్ అయ్యే అర్హత లేని వారు సైతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసంలో కీలక పాత్ర పోషించారు. అసలైన ఆర్మీ అభ్యర్ధులు చెబుతున్న మాటలకు అక్కడ జరిగిన హంసకు సంబంధం లేకుండా పోయింది.

  అయితే ఖైరతాబాద్ కాంగ్రెస్ ఆందోళన హింసాత్మకంగా మారి ఇరవై నాలుగు గంటలు కాక ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మంటల్లో చిక్కుకుంది. ఒక్క సారిగా వేల మంది ఆర్మీ లో ఉద్యోగాలు పొందాలనుకునే ఆశావహులు దూసుకొచ్చారు. వారంతా అప్పటికప్పుడు వచ్చిన వాళ్లు కాదు. మాట్లాడుకుని మరీ వచ్చారు. వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకుని స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. ఇంత భారీగా స్టేషన్‌పై వచ్చి పడినా తెలంగాణ అధికార యంత్రాంగంలో కదలిక లేదు. ఇంటలిజెన్స్ ఏమైందో స్పష్టత లేదు. చివరికి విధ్వంసం ప్రారంభమైన చాలా సేపటికి పోలీసు బలగాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

  ఈ రెండు మాత్రమే కాదు.. బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వారంతా ఇంటర్ విద్యార్థులు. వారిపై కూడా రాజకీయ ముద్ర వేసి.. పట్టించుకోవడం మానేశారు. మంచినీరు.. ఆహారం కూడా ఆపేసి విమర్శల పాలయ్యారు. విద్యార్థుల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించి లైట్ తీసుకున్నారు. ఈ వ్యవహారాలన్నింటిలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అటు సీఎం కానీ.. ఇటు కేటీఆర్ కానీ ఈ అంశాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కేటీఆర్ తమ రాష్ట్రంలో ఉన్నరైల్వే స్టేషన్‌లో విధ్వంసం జరిగిందని కంగారు పడకుండా ఇదంతా యువతలో పెరుగుతున్న అసహనానికి సందేశం అని.. బీజేపీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అచేతనంగా మారిందన్న విమర్శలు రావడానికి వరుసగా జరుగుతున్న ఘటనలు కారణం అవుతున్నాయి.

  spot_img

  Trending Stories

  Related Stories