ఆందోళన, ధర్నా, నిరసన, రాస్తారోకో.. పేరేదైతేనేం? అంతిమంగా మిగిలేది నష్టమే. భారతీయుడికి కోపం వచ్చిందంటేచాలు.. రైళ్లు తగులబడాల్సిందే. రైల్వే ఆస్తులు మాడి మసి అవ్వాల్సిందే. కారణమేదైనా కసిదీరా రైళ్లను బుగ్గిచేయాల్సిందే. అసలు ఏం తగలబెడుతున్నారు.? ఎందుకు తగలబెడుతున్నారు.? తగలబెట్టడం వల్ల ఒరిగేదేంటి.? ఎవరికి లాభం.? ఎవరికి నష్టం.? అన్న ప్రశ్నలకు ఆందోళనకారులు సమాధానం చెప్పాల్సి వుంటుంది. కాదు కాదు, చెప్పుకోవాల్సి వుంటుంది.
రైలు తగలబడితే, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీకి నష్టం కాదు. దేశానికి నష్టం. దేశానికి నష్టమంటే, దేశంలోని ప్రతి పౌరుడికీ నష్టం. దేశ పౌరులంతా చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము, పన్నుల రూపంలో ప్రభుత్వాలకు కడితే, అలా ప్రభుత్వ ఖజానా నిండితే.. దాన్నుంచే వివిధ వ్యవస్థలు ఏర్పాటవుతాయి.. ఆయా వ్యవస్థలు నిర్వహించబడతాయి. నిరసనలకూ ఓ హద్దూ అదుపూ వుండాలి. అసాంఘీక శక్తులు రంగంలోకి దిగినప్పుడే ఇలాంటి విధ్వంసాలు చోటు చేసుకుంటాయి.
భారతీయుడికి కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా.. కోపమొచ్చినా.. బాధ కలిగినా.. అంతిమంగా నష్టం మాత్రం రైళ్లకే. ప్రజాస్వామ్య దేశంలో దశాబ్దాలుగా నిరసనల పేరుతో సాగుతున్న హింసకు దగ్ధమైన రైళ్లు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అది రైతుల ఆందోళన అయితేనేం..? నిరుద్యోగుల ఆగ్రహమైతేనేం? మానవహక్కుల పోరాటమైతేనేం? రాజకీయ ఆందోళనలైతేనేం? నష్టంమాత్రం రైళ్లపైనే. రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతున్న నిరసనకారులు వందల కోట్లలో రైల్వేకు నష్టం చేకూరుస్తున్నారు. అసలు సికింద్రాబాద్ హింసలో రైల్వేకు జరిగిన నష్టమెంత? మరి దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అల్లర్లలో యావత్ రైల్వే శాఖకు వచ్చిన నష్టం ఎంత? అధికారులు ఏం చెబుతున్నారు..?
కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ స్కీంకు నిరసనగా దేశవ్యాప్తంగా పెల్లుబికిన అల్లర్లలో పదుల సంఖ్యలో రైళ్లు అగ్గికి బుగ్గికాగా.. మరికొన్ని రైళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానాలో సాయుధ దళాల ఉద్యోగార్థులు చేసిన నష్టం అంతాఇంతా కాదు. నార్త్ ఇండియాకే పరిమితం అవుతుందనుకున్న హింస.. దక్షిణ భారతానికి పాకింది. సికింద్రాబాద్‌లో సాయుధ దళాల ఉద్యోగార్థుల ఆందోళనలో 30కి పైగాబోగీలు ధ్వంసమయ్యాయి. ఏడు రైలింజన్లు డ్యామేజ్ అయ్యాయి. రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో ఒకటి, అజంతా ఎక్స్‌ప్రెస్‌లో రెండు బోగీలు, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక బోగి ధ్వంసమైంది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్లో ఇంజిన్ దెబ్బతింది.
రెండు పార్సిల్ వ్యాన్స్ దగ్ధమయ్యాయి. పార్సిల్ ఆఫీసు ధ్వంసమైంది. పార్సిల్స్‌లో వచ్చిన 4 బైక్‌లు కాలిపోయాయి. పార్సిల్స్‌లో ఉన్న చేపలు, గుడ్లులాంటి ఐటెమ్స్ డ్యామేజ్ అయ్యాయి. టీవీలు, ఫ్యాన్లు, సీసీటీవీలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఒక ఎస్కలేటర్ పాక్షికంగా దెబ్బతింది. రైల్వేస్టేషన్‌లోని స్టాళ్లు, షాపులు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ హింసలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతిచెందగా.. ఆందోళనకారుల దాడుల్లో ఏడుగురు పోలీసులు సహా మరో 12మంది గాయపడ్డారు. సికింద్రాబాద్ ఘటనలో 2వేల మంది ఆందోళనలో పాల్గొని విధ్వంసం చేసినట్లు శాండల్య తెలిపారు. 30 కోట్లకుపైగా నష్టం జరిగిందన్నారు రైల్వే డీజీ సందీప్ శాండిల్య. నిరసనలు ప్రశాంతంగా తెలపాలని.. హింసకు పాల్పడడం సరికాదన్నారు.
అటు అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ బీహార్‌లో భారీ స్థాయిలో నిరసనలు హోరెత్తింది. రెండు రోజుల పాటు రైల్వే ఆస్తుల్ని యువకులు తగలబెట్టారు. అయితే ఆ నష్టం సుమారు 200 కోట్లు ఉంటుందని రైల్వే అదికారులు తెలిపారు. ఆర్మీ అభ్యర్థులు జరిపిన దాడిలో 50 బోగీలు, అయిదు ఇంజిన్లు పూర్తిగా దగ్ధం అయినట్లు ఆయన చెప్పారు. ఇక ఆ బోగీలు, ఇంజిన్లు సర్వీస్‌కు పనికి రావన్నారు. ప్లాట్‌ఫామ్‌లు, కంప్యూటర్లు, సాంకేతిక వస్తువులు ఎన్నో డ్యామేజ్ అయినట్లు తెలిపారు. అనేక రూట్లలో రైళ్లను రద్దు చేసినట్లు డీఆర్ఎం చెప్పారు. మొత్తం దేశ వ్యాప్తంగా దాదాపు 350 కోట్ల రూపాయల వరకు రైల్వే శాఖకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో ఆందోళన చేపట్టారు. అయితే ఆ ఘటనలో 250 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం నాటికి ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫిరోజాబాద్, అలీఘడ్, వారణాసి, గౌతమ్ బుద్ద నగర్ జిల్లాల్లో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. అరెస్టు అయిన 260 మందిలో 109 మంది బాలియాకు చెందిన వారున్నారు. 70 మంది మథుర, 31 మంది అలీఘడ్, 27 మంది వారణాసి, గౌతమ్ బుద్ద నగర్ నుంచి 15 మంది ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం రోజున బాలియా రైల్వే స్టేషన్లో యువత ఓ రైలుకు నిప్పుపెట్టారు. ఇటు సికింద్రాబాద్ అల్లర్లలో ప్రధాన సూత్రదారి సుబ్బారావుతో పాటు 22మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా 400మంది ఆందోళనకారులు అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.