Right Angle

ప్రశాంత్ కిషోర్ Vs రాహుల్ గాంధీ

చివరి రాజకీయ మజిలీలో ఉన్న ప్రశాంత్ కిషోర్, ఆఖరు ఘడియలు లెక్కిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైపోయినట్టూ వార్తలు వెలువడుతున్నాయి. ‘ఊడిగం’ అనే మాటకు వ్యూహమనే టైటిల్ తగిలించి, ఖరీదు నిర్ధారించేందుకు ఏకంగా ఓ సంస్థనే స్థాపించిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ కు భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానముంది. కిరాయి మాధ్యమాలు వచ్చాక, కీర్తి, ప్రతిష్ఠలకు వ్యక్తిగత ప్రతిభ, సమర్థత అక్కరలేదని నిరూపించేందుకు పీ.కే జీవితం ప్రబల ఉదాహరణ.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడమనే వార్త అత్యంత ఆసక్తికరమైంది. కాంగ్రెస్ నిజంగానే పీకేను పార్టీలో చేర్చుకుంటే; ఆ పార్టీ తనకు తెలియకుండానే అనేక వ్యక్తావ్యక్త సంకేతాలను ఇచ్చినట్టవుతుంది. కాంగ్రెస్ అసమర్థతను ఆ పార్టీయే స్వయంగా ప్రామాణిక వాస్తవమని అంగీకరించనట్టవుతుంది.

‘‘రాజకీయ విరోధం మితి మీరినకొద్దీ ఇంగితం చచ్చిపోతుంది’’ అన్నారు ఇండియన్ పొలిటికల్ థింకర్ రాఘవన్ అయ్యార్. రాఘవన్ అయ్యర్ కాలిఫోర్నియా కేంద్రంగా ఎనభైల ఉత్తరార్ధం వరకూ నడిచిన CSDI పొలిటికల్ థింక్ ట్యాంక్ లో కీలకంగా పనిచేశారు.

రాబోయే ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏ కూటమి గెలుస్తుందేమో అనే ఊహా, భయం కాంగ్రెస్ అంతరంగాన్ని గందరగోళానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ ఎదిగేందుకు అవసరమైన జీవశక్తి చచ్చిపోయి చాలా కాలమైంది. ఇక మిగిలింది రాజకీయ విరోధిని రాక్షసుడిగా చిత్రించే ప్రచార ఆర్భాటమే! అందుకు పీకే లాంటి నటనాకౌశలమున్న నేత కావాలి.

వ్యూహకర్తననే భ్రమను సజీవంగా ఉంచగలిగి ఉండాలి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో పీకే పేలిన మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆశాజ్యోతిని వెలిగించాలి. శవయాత్రలో ‘దింపుడుగల్లం’ అనే సంప్రదాయం మనిషిలో చావని చిట్టచివరి ఆశకు ఒకానొక సాంత్వన. కాంగ్రెస్ ను దింపుడుగల్లం వద్ద దింపేందుకు పీకే అవసరం ఇప్పుడు ఆ పార్టీకి ఎంతైనా ఉంది. 

ప్రశాంత్ కిషోర్ ను చేర్చుకుని రాహుల్ సమర్థత గురించి కాంగ్రెస్ పార్టీ లోకానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటోంది? ఘటనాఘటన సమర్థులు, తలపండిన నేతలూ, దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని ఔపోసన పట్టినవారూ పార్టీలో ఉండగా; తాను విఫల రాజకీయవేత్తనని స్వయంగా ఒప్పుకున్న పీకేను ఎందుకు కాంగ్రెస్ పనిగట్టుకుని పార్టీలోకి ఆహ్వానిస్తోంది?

పీకే నేరుగా సోనియాకు మాత్రమే రిపోర్ట్ చేస్తాడనే వార్తలు దేన్ని సూచిస్తున్నాయి? రాహుల్ అసమర్థతనా? సీనియర్ నేతల అప్రాధాన్యతనా? ప్రశాంత్ కిషోర్ ప్రభ పెరగడమంటే పార్టీలు, నేతల్లో అశక్తత, దౌర్బల్యం పుంజుకునే స్థితిలో లేవని అంగీకరించినట్టు కాదా?

ప్రశాంత్ కిషోర్ అనేబడే మోతుబరి వ్యూహకర్త భారత రాజకీయ యవనికపై అడుగుపెట్టి రాబోయే డిసెంబర్ కు సరిగ్గా పదేళ్ల కాలం గడిచింది. మన దేశ రాజకీయాల్లో 2011 కు విశిష్ఠమైన స్థానముంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2011 జనవరిలో కేంద్రానికి సమర్పించింది. అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో అదే ఏడాది డిసెంబర్ లో లోక్ సభ లోక్ పాల్ బిల్లుకు ఆమోదముద్ర వేసింది. మొత్తంగా కాంగ్రెస్ పతనం 2011లోనే మొదలైంది.

సరిగ్గా ఈ కాలంలోనే పీకే వ్యూహకర్తగా వ్యూహకర్త పేరుతో ఎంట్రీ ఇచ్చాడు. హస్తం పార్టీ పతనానికి బీజాలు పడిన కాలంలో రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ మరణావస్థలో ఉన్న ప్రస్తుత స్థితిలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నాడు. జేడీయూ నుంచి బహిష్కరించిన తర్వాత ‘తాను విఫల రాజకీయవేత్త’నని స్వయంగా ప్రకటించుకున్న పీకే, ఆ తర్వాత జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ తరపున వ్యూహకర్తగా పనిచేశాడు.

టీఎంసీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టగానే పీకే కు నూతనోత్సాహం పుట్టుకువచ్చింది. ఇక తాను ప్రాంతీయ పార్టీల వెంటబడి తిరగకూడదని నిర్ణయించుకున్నాడో ఏమోగానీ ఏకంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కప్పుకునేందుకు సిద్ధమయ్యాడు.

కాంగ్రెస్ తాను ఆపదలో ఉన్నానని భావించినపుడు, విధేయత ప్రదర్శిచగల వక్య్తులు తారసపడినపుడు  రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులకూ, బ్యూరోక్రాట్లకూ పదవులు ఇచ్చి సేవలు చేయించుకోవడం ఆ పార్టీకి కొత్త కాదు. భారత తొలి ఆర్థిక మంత్రి జాన్ మత్తై మొదలు మన్మోహన్ వరకూ అదే తంతు కొనసాగింది. తాజాగా పీకే వంతు వచ్చింది.

సొంతంగా చేతకాని పరిస్థితి వచ్చినపుడు ప్రైవేటు సంస్థలపై ఆధారపడి పార్టీని రక్షించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు 1984లో రాజీవ్ గాంధీ. వ్యూహకర్తను అరువుతెచ్చుకోవడమనే విచిత్ర రాజకీయ సంప్రదాయం వెర్రితలలు వేసిందనడానికి పీకే ఒక ప్రతీక.

రాజకీయ మైదానంలో ఉన్న ప్రజా బలమెంత? కార్యకర్తల బలగమెంత? నేతల శక్తియుక్తులు ఏపాటివి? భౌగోళిక, సాంస్కృతిక, రాజకీయ నిర్దిష్టతల ప్రాతిపదిక ‘ఎన్నికల రాజకీయాల’కు ఎంతవరకు ఉపకరిస్తుంది? లాంటి సవాళ్లకు జవాబు ఇవ్వగలిగేది కేవలం ఆయా పార్టీల్లోని సీనియర్ నేతలు, ఆయా ప్రాంతాలపై పట్టుగల పార్టీ శ్రేణులు వ్యూహరచనలో భాగం కావాలి మినహా పార్టీ బలాబలాలు తెలియని ఓ బయటి వ్యక్తి హఠాత్తుగా ప్రవేశించి ఏం చేయగలడు అనే ప్రశ్నఇప్పుడు ప్రధానమైంది.

ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాస్తవ స్థితిని సరళంగా అంగీకరించి,  అందుకు తగిన పరిష్కరాలను ఎంచుకునే స్వభావాన్ని కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ఏనాడో కోల్పోయాయి. మంత్రదండమున్న మాయగాడు ఎవడైనా వచ్చి గెలిపిస్తానంటే కరెన్సీకట్టల్ని తివాచీలుగా పరిచి ఆహ్వానిస్తాయి మన దేశంలోని రాజకీయ పార్టీలు.

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాక, మాయల ఫకీరులే ‘అధికార’ మంత్రాంగం చేస్తారు. ఎన్నికల చిట్కాలు చెప్తారు. గెలుపు గుర్రాలను గుర్తించి అంచనాలు వేస్తారు. అలాంటి మాయల ఫకీరు ప్రశాంత్ కిషోర్. ‘‘Unlike Modi, other leaders engaged Kishor, either to create apolitical ‘product’ or to sharpen their visage. In the past seven years, barring the brief period before the Pulwama terror attack, the opposition has failed to position itself as a national level alternative’’. అన్నారు ప్రముఖ పాత్రికేయులు నిలాంజన్ ముఖోపాధ్యాయ్. ‘రాజకీయ ఉత్పత్తి’ అమ్మేందుకు, నేతలు తమ ముఖాలను చెల్లుబాటు చేసుకునేందుకు పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను వాడుకున్నాయి.

గడచిన ఏడేళ్లుగా, పుల్వామా దాడికి ముందు వరకూ ప్రతిపక్షం ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోయింది. మోదీ అందుకు భిన్నం’’ అన్నారు. అంతేకాదు, రాజకీయ ప్రాంగణంలో బీజేపీని ఎదుర్కోలేని స్థితి ఉందనే విషయం పీకే ని ఆహ్వానించవల్ల తేటతెల్లమైందంటారాయన.

Scroll.in పత్రికలో జూలై 19న రోహన్ వెంకట రామక్రిష్ణన్ రాసిన ‘‘What can Prashant Kishor bring to the Congress – or the anti – Modi Opposition? ఆర్టికల్ లో కొంచెం అక్కసుతో అయినా సరే కొన్ని అవసరమైన ప్రశ్నలను సంధించారు. ‘‘Can a group of disparate Opposition parties put aside their differences to actually work together? Do they have a platform that goes beyond the desire to battle anti-Bharatiya Janata Party hegemony? Do they have access to resources to match the BJP’s massive, electoral bond-stuffed war chest? And – most frequently brought up – do they have a face? A leader who can be projected to match up to Modi?’’ అంటూ గుక్కతిప్పుకోలేని సవాళ్లు విసరారు. ఏ మాత్రం పొసగని పార్టీలు విభేదాలు మరిచి కలిసి పనిచేస్తాయా? బీజేపీ ఆధిపత్యాన్ని నియంత్రించాలన్నవాంఛకు అతీతంగా పనిచేసేందుకు ఏదైనా వేదిక ఉందా? బీజేపీతో సరిపడా వనరులు, ఆర్థిక దన్ను ఈ పార్టీలకు ఉందా? మోదీని ఢీ కొట్టగల వర్ఛస్సు ఉన్న నేత ఎవరున్నారు? అంటూ నిష్టూరమైన ప్రశ్నలు వేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక దన్ను ఉండవచ్చు. ఇతర వనరులూ సమకూర్చుకోవచ్చు. అయితే లేనిదల్లా ప్రజల విశ్వాసం. ఓటర్ల విశ్వాసం కోల్పోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎన్ని మంత్రాలు వేసినా చింతకాయలు రాలవు. పీ.కే తమ పార్టీలోకి వస్తే రాబోయే ఎన్నికల్లో గెలవచ్చు అనుకోవడం కాంగ్రెస్ పార్టీ దుస్థితిని-అనివార్య స్థితిలో పీకేపై పెట్టుకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.

ఆ మధ్య పీ.కే ఎన్సీపీ నేత శరద్ పవార్ తో సమావేశమైన తర్వాత మరో ఆసక్తికరమైన వార్త బయటకు పొక్కింది. శరద్ పవార్ ను రాష్ట్రపతిని చేస్తానని ప్రశాంత్ కిషోర్ మాట ఇచ్చినట్టూ, అందుకు అంగీకరించిన పవార్ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్టూ ఈ గాలివార్తల సారాంశం.

భారతదేశ రాజకీయాల్లో శరద్ పవార్ ను మించిన కిలాడీనేత లేడు. రాజకీయ రంకుకు చిరునామా అయిన శరద్ పవార్ ప్రశాంత్ కిషోర్ ను నమ్మడమేంటి అని చాలా మంది ముక్కుమీద వేలేసుకున్నారు. పర్యవసానాలు పవార్ కు సాంతం తెలుసు.

కాకపోతే ఆప్షన్ ను వదులుకోకూడదని ఓ టీ తాగి ఓకే చెప్పి ఉంటాడంటారు రాజకీయ విశ్లేషకులు. నేతలంతా ప్రశాంత్ కిషోర్ ను నమ్ముతున్నారంటే అది పీకే వ్యూహదక్షతను చూసి కాదు, నేతల బలహీనతలన్నీ వారి మనస్సాక్షికి తెలుసు కాబట్టి, వారి ముఖారవిందం, పార్టీ గుర్తు రెండూ గెలిపించే అవకాశం లేదు కాబట్టి ఆలీబాబా అద్భుత దీపమేదైనా దారి చూపిస్తుందని ఆశపడుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మొట్టమొదట సంతోషించేది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే కల్లోల జలాల్లో ఎదురీదుతున్న కాంగ్రెస్ పీకే రాకతో మరింత సంక్షోభంలో పడుతుంది. జి-23 నేతల వ్యతిరేకత మరింత తీవ్రమవుతుంది. రాహుల్ మాటకన్నా, పీకే ఆదేశాలే చెల్లుబాటు అయ్యే రోజులు వస్తే హస్తం పార్టీ ఛిన్నాభిన్నం కావడం ఖాయం. ప్రశాంత్ కిషోర్ నేరుగా సోనియా గాంధీకే రిపోర్ట్ చేయాలన్న వార్తలు చూస్తే కాంగ్రెస్ లో రాహుల్ ప్రాధాన్యత అర్థమవుతుంది.

ఏ ఎన్నికా ఒకటి కాదు. ఏ ఫలితమూ మరో ఎన్నిక ఫలితాన్ని నిర్ణయించదు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహిస్తున్నంత సులువుగా బీజేపీ అధికార పీఠాన్ని వదులుకోదు. సామ,దాన, భేద, దండోపాయాలన్నీ ఉపయోగిస్తుంది. అనేక ఎత్తు పల్లాలనూ, ఆటుపోట్లను చూసిన కమలం పార్టీ వ్యూహాల ముందు ప్రశాంత్ కిషోర్ తాయత్తులు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తాయనుకోవడం అమాయకత్వమే అవుతుంది. మొత్తంగా రెండున్నరేళ్ల సమయం ఉండగానే ముసురుకున్న ఎన్నికల వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ భయమే కొట్టొచ్చినట్టూ కనిపిస్తోంది.

Related Articles

One Comment

  1. Probably PK is expecting to become Prime Minister as Rahul Gandhi, emerged as a failed leader and politically illiterate, can not become.

Leave a Reply

Your email address will not be published.

3 × 5 =

Back to top button