మాంద్యానికి.. మెడిసిన్ భారత్‎కే తెలుసు..?! ఆర్థిక నిపుణుల అంచనా నిజమవుతుందా..?

0
793

ప్రపంచానికి ఆర్థికమాంద్యం భయం చుట్టుకుంది. ఇప్పటికే ప్రముఖ టెక్ దిగ్గజాలు తమ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023 లో ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం ఎదుర్కుంటుందనే అనుమానాలతో.. ఈ చర్యలకు పూనుకున్నాయి. జనవరి 10న ప్రపంచ బ్యాంకు కూడా ఆర్థిక మాంద్యంపై అన్ని దేశాలను హెచ్చరించింది. 2023 లో ప్రపంచం అంతటా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కుంటుందనీ,.. దీనికి అన్ని దేశాలూ సిద్దం కావాలని తెలిపింది. ఆర్థికంగా అభివృద్ది చెందుతున్న దేశాలే.. ఈ మాంద్యం ప్రభావానికి ఎక్కువగా గురవుతాయని హెచ్చరించింది. దీంతో పాటు ఆర్థిక నిపుణుల సర్వేలో 2023 రెసిషన్ ప్రపంచ దేశాల్లో 18 శాతం వరకూ ఉంటుందని లెక్కగట్టారు. దీంతో ఇప్పటికే టెక్ దిగ్గజాలు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నాయి. తమ సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఈ తొలగింపులపై అనుమానాలున్నా కూడా ఇప్పుడు అవి కార్యరూపం దాల్చుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. జనవరి 20న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ 12 వేల ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని ప్రకటించారు. జనవరి 18న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని,.. మార్చి నుంచి ఈ తొలగింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. దీంతో పాటు అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ఏకంగా 18 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇవేకాకుండా అనేక టెక్ దిగ్గజాలు ఈ జనవరిలో తమ ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. అన్ని కంపెనీలు 6 శాతం నుంచి 20 శాతం వరకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపాయి.

అయితే ఆర్థిక మాంద్యం నెలకొనడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నా,.. ప్రధాన కారణాలు, అవి రావడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిలో మొదటిది ఆర్థిక మందగమనం. ఇప్పుడు ప్రపంచదేశాల ఆర్థిక పరిస్థితి చాలా మందకొడిగా సాగుతోంది. ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ యుద్ద ప్రభావం ఎక్కువవుతుండటంతో పరోక్షంగా ఐటీ కంపెనీలపై పడుతోంది. అన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు, పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరగటంతో ప్రజలు ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇది కొనుగోళ్ళపై ప్రభావం చూపడంతో ఆర్థిక వ్యవస్థ మందకొడిగా కొనసాగుతోంది. ప్రపంచ పెట్రోల్ ఎగుమతుల్లో రష్యా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండేది. అయితే యుద్దం తర్వాత రష్యా పై ఆంక్షలు విధించడంతో పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, యూకే ఆంక్షల వల్ల అన్ని దేశాలూ రష్యాతో చమురు దిగుమతులను నిలిపివేశాయి. ఇక ఇదే అదనుగా చూసుకుని అరబ్ దేశాలన్నీ చమురు ధరలను పెంచుకుంటూ వచ్చాయి. దీంతో అమెరికా నుంచి చిన్న దేశాల వరకు పెట్రోల్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ ప్రభావంతో దేశంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అగ్రరాజ్యాన్ని కూడా ఈ నిత్యావసరాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దివాలా తీసిన శ్రీలంకకు, దివాలా దిశగా పరుగులు పెడుతున్న పాకిస్తాన్ కు ఈ పరిస్థితి తలెత్తడానికి రష్యా ఉక్రెయిన్ యుద్దం కూడా ఒక కారణమే అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇది ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారితీస్తోంది.

ప్రపంచ పరిస్థితులతో పాటు కొవిడ్ కూడా ఈ తొలగింపు పై పరోక్షంగా ప్రభావం చూపింది. అయితే కొవిడ్ వల్ల బాగుపడిన కంపెనీలు ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నాయి. మహమ్మారి మనుగడలో ఉన్నప్పుడు పెద్దయెత్తున ఉద్యోగులను తీసుకున్నాయి. 2020లో తీవ్ర ప్రభావం చూపిన కోవిడ్ 2021, 2022 వరకూ కొనసాగింది. ఈ కాలంలో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ను ప్రకటించాయి. దీంతో ఆయా కంపెనీలకు భారీగా వ్యయం ఆదా అయింది. ఈ కారణంతో ఆయా కంపెనీలు మరిన్ని ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. ఈ నిర్ణయం వల్ల అప్పట్లో బాగుపడిన కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొవిడ్ పూర్తిగా తొలగిపోవడం, ఉద్యోగులంతా ఆఫీసుల నుంచి పనిచేస్తుండటంతో,.. అప్పట్లో అవసరమొచ్చిన ఈ ఉద్యోగులే ఇప్పుడు ఆయా కంపెనీలకు భారంగా మారారు. దీంతో కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి.

దీంతో పాటు అన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై పెద్దయెత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ విషయంలో గూగుల్ ముందువరుసలో ఉంది. దాదాపు 20 AI ఆవిష్కరణల్లో గూగుల్ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. అటు మైక్రోసాఫ్ట్ కూడా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఈ AI లో భారీ యెత్తున పెట్టుబడులు పెట్టింది. ప్రముఖ AI స్టార్టప్ ఛాట్ జీపీటీలో మైక్రోసాఫ్ట్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. రాబోయే కాలమంతా ఈ ఛాట్ జీపీటీ పై నడుస్తుండటంతో టెక్ దిగ్గజాలు ఏఐ పై పెట్టుబడులు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మాంద్యాన్ని ఎదుర్కొంటున్న ప్రపంచం ముందు ఈ భారీ పెట్టుబడులను పెట్టాల్సిన కంపెనీలు వీలైనంత మేర తమ ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇక ఇప్పటికే కరోనా మహమ్మారితో కొన్ని కంపెనీలు ఆర్థికంగా చితికిపోయాయి. వీటితో పాటు ప్రపంచ కారణాల వల్ల పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అధిక ధరలు కూడా పెరుగుతుండటంతో.. వీటన్నిటి ఖర్చులు తగ్గించుకోవడానికి అవసరం లేదనుకున్న ఉద్యోగులను ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. దీని వల్లే అన్ని కంపెనీలూ ఈ రెసిషన్‎పై నిర్ణయం తీసుకుంటున్నాయి. దాదాపు అభివృద్ది చెందుతున్న దేశాలన్నీ ఈ రెసిషన్ భయాన్ని ఎదుర్కొంటున్నా.. ఈ భయం భారత్‎పై కాస్తంత తక్కువగానే ప్రభావం చూపవచ్చనే అంచనాలు వేస్తున్నారు ఆర్థిక నిపుణులు.

భారత్ కు రెసిషన్ భయం అంతగా లేదనీ,.. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా,.. భారత ఆర్థిక వృద్ధి రేటు 6 నుంచి 7 శాతం మధ్యలో ఉండొచ్చని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. సాధారణంగా భారత్ ఆర్థిక వృద్ధి రేటు యావరేజ్ గా 7 శాతం ఉంటుంది. ఈ అంచనా ప్రకారం తక్కువలో 6 శాతం వచ్చినా రెసిషన్ ప్రభావం అంతగా ఉండదనే చెప్పాలి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ద ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడినా కూడా భారత్ పై పెద్ద ప్రభావం చూపలేదు. ముఖ్యంగా రష్యా భారత్ కు ప్రీ కొవిడ్ ధరలకే ముడి చమురును ఆఫర్ చేయడంతో భారత్ లో పెట్రోల్ ధరలు పెరగకుండా తటస్థంగా ఉన్నాయి. స్వల్పంగా ధరలు పెరిగినా అది ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పై అంత ప్రభావాన్ని చూపలేదు. ఇక అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఉద్యోగులకు జీతాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. అదే భారత్ లో అయితే తక్కువ ధరలకే లేబర్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగులను తొలగించే అవకాశం తక్కువగానే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. కానీ,.. కొవిడ్ సమయంలో జరిగిన రిక్రూట్ మెంట్ల సంఖ్య కూడా భారత్ లో కాస్తంత ఎక్కువగా ఉండటంతో ఇది కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు.

వీటితో పాటు భారత్ ఇప్పుడు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదవ స్థానంలో ఉంది. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరుగులు పెడుతోంది. విదేశీ మారకం కూడా భారత్ వద్ద భారీగా ఉండటంతో ఈ రెసిషన్ లను భారత్ చాకచక్యంగా ఎదుర్కోగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ప్రపంచంలో ఎదురయ్యే ప్రతికూలతలను చాకచక్యంగా ఎదుర్కొనేందుకు భారత్ కు బలమైన నాయకత్వం ఉంది. పరిస్థితులను బట్టి అగ్రదేశాల వెంట పరిగెత్తకుండా భారత్ తనకంటూ ప్రత్యేక విదేశాంగ విధానాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్దం లో అమెరికా, యూకే లను ఎదురించి మరీ నిలబడింది. ఏ దేశమూ ధైర్యం చేయకపోయినా,.. రష్యాతో వాణిజ్యం పెంచి చూపింది. ఒకవేళ అమెరికా ఆంక్షలకు భారత్ భయపడి ఆగిపోయి ఉంటే,.. ఇప్పటికే దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగి ఉండేవి. దీంతో పాటు ఆహార ధరలు కూడా పెరిగి.. అమెరికా యూకేలు ఎదుర్కొన్న ఇబ్బందులను భారత్ కూడా ఎదుర్కొనేది. ఇదే విధంగా బలమైన నాయకత్వంతో ముందుకు సాగితే వీలైనంత వరకు రెసిషన్ ను తగ్గించి ఉద్యోగుల తొలగింపును కూడా భారత్ నిరోధించగలదని ఆర్థిక నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

2 × 4 =