More

  ‘ఐ లవ్ యూ రస్నా’.. అంటున్న 60 దేశాలు..! అదీ భారతీయుడి సత్తా..!! అరీజ్‎కు NH నివాళి..

  ‘ఐ లవ్ యూ రస్నా’..! 80వ నుంచి ప్రతి ఇంట్లో మార్మోగుతున్న టీవీ యాడ్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎంతో ఇష్టంగా తాగే ఫ్రూట్ డ్రింక్ రస్నా. రూపాయి ప్యాకెట్ నుంచి పెద్ద ప్యాకెట్ల వరకూ మార్కెట్ లో దొరికే ఈ సాఫ్ట్ డ్రింక్ ను ఇష్టపడని వారుండరంటే ఆశ్చర్యమేమీ కాదు. స్కూలు ఇంటర్వెల్ సమయంలో రూపాయి రస్నా ప్యాకెట్ ను కొని నీళ్ళలో కూడా కలుపుకోకుండా తిన్న తీపి అనుభవాలు 80, 90ల నాటి జనరేషన్లకు చాలా ఉన్నాయి. అయితే ఈ నోరూరించే డ్రింక్ గురించి ఇప్పుడెందుకు ప్రస్తావించామనుకున్నారో తెలుసా..? కాస్త బాధాకరమైన విషయమైనా ప్రస్తావిచాల్సిన సందర్భం కాబట్టి. ఈ సాఫ్ట్ డ్రింక్ ను భారతీయులకు 1976లో రుచిచూపించిన ‘అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా’ గుండెపోటుతో ఇటీవలే మృతి చెందారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 85 ఏళ్ళ ‘కంబట్టా’ గుజరాత్ అహ్మదాబాద్ లో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయనకు నేషనలిస్ట్ హబ్ నివాళులు అర్పిస్తూనే.. రుచికరమైన రస్నాను భారతీయులకందించడంతో పాటు,.. ఒక భారతీయ కంపెనీ సత్తాను దాదాపు 60 చాటిన అరీజ్ గురించి తెలుసుకోవడం సముచితం. అసలు రస్నా ఎలా పుట్టింది..? ఎప్పుడు ప్రారంభమైంది..? దీనివెనుక అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా చేసిన కృషి ఎలాంటిది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  ‘అరీజ్ ఫిరోజ్ షా కంబట్టా’ 1976లో ‘జఫ్ఫే’ అనే పేరుతో సాఫ్ట్ డ్రింక్ పొడులను అమ్మడం మొదలుపెట్టారు. అహ్మదాబాద్ లో తయారు చేసిన వీటిని మెల్లమెల్లగా విస్తరించి గుజరాత్ రాష్ట్రం మొత్తం విస్తరించేలా చేశారు. తన ఫార్ములా సక్సెస్ అవడంతో దీన్ని రీబ్రాండ్ చేస్తూ జఫ్ఫే పేరును రస్నాగా మార్చుతూ నిర్ణయించుకున్నారు. అక్కడితో మొదలైన రస్నా ప్రయాణం తన సక్సెస్ ఫార్ములాతో భారత్ అంతటా విస్తరించడంతో పాటు విదేశాల్లోనూ తన బ్రాండ్ ను నిరూపించుకుంది. అయితే ఒక చిన్న కంపెనీగా మొదలైన ఈ బ్రాండ్ పెద్ద పెద్ద కోకో కోలా లాంటి కంపెనీలను కూడా తట్టుకుని నిలబడటానికి పూర్తి భారతీయతే కారణం.

  భారత్ ఎంతో ప్రాచీనమైన దేశం. వేల ఏళ్ళక్రితమే పూర్తి నాగరికతతో బతికిన సమాజం. అప్పట్లో ప్రజలు పానీయాలు తాగాలంటే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగేవారు. సీజన్ కు తగ్గట్టుగా పండే పళ్ళను రసాలుగా పిండుకుని తాగేవారు. అయితే బ్రిటిష్ పాలనలో ఈ విధానం మారుతూ వచ్చింది. పారిశ్రామిక విఫ్లవం పేరుతో కార్బొనేటెడ్ వాటర్ ను భారత్ కు పరిచయం చేశారు. ఈ పానీయాల్లో ఎటువంటి పళ్ళ రసం లేకుండా కేవలం ఫ్లేవర్ ను మాత్రమే జతచేసి అందులోకి కార్భన్ డయాక్సైడ్ ను చేర్చి అమ్మడం మొదలైంది. దీంతో పళ్ళకు పెట్టాల్సిన ఖర్చు భారీగా తగ్గిపోయింది. వీటివల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం చేకూరడం జరిగింది. కానీ ప్రజలకు మాత్రం ఎటువంటి పోషకాలు విటమిన్లు అందేవి కావు. కానీ సమాజం అంతటా ఫ్లేవర్డ్ డ్రింక్ లకే అలవాటు పడటంతో పళ్ళ రసాలను తాగటం చాలా తగ్గిపోయింది. అయితే బ్రిటిష్ వారు భారత్ ను వదిలి వెళ్ళిన తర్వాత కూడా ఈ ధోరణి మారలేదు. ఇది గమనించిన కంబట్టా భారతీయులకు సాంప్రదాయిక రుచుల్లో పానీయాలు అందించాలనే ఆలోచన చేశారు. ఇందులో భాగంగానే రస్నా పుట్టుకొచ్చింది. భారత్ లో దొరికే పళ్ళ ఫ్లేవర్లతో పొడిని తయారు చేసి అమ్మడం ద్వారా చాలామందికి పళ్ళ రసం తాగిన అనుభూతి వచ్చింది. మ్యాంగో, నింబూ, ఆరెంజ్ ఫ్లేవర్లతో రస్నా డ్రింక్ లను తయారు చేశారు. దీంతో పాటు సాధారణంగా పళ్ళ రసం కంటే తక్కువ ధరలో వచ్చే ప్యాకెట్లతో చేసుకునే డ్రింక్స్ కావడంతో ఎక్కువమంది వీటిని ఇష్టపడటం మొదలైంది. అంతేకాకుండా రస్నా పొడి వల్ల సీజన్ లో దొరికే మామిడి పళ్ళ అనుభూతిని ఏడాదంతా అందించడం జరిగింది. ఇక అంకితా జావేరి చిన్న పిల్లగా ఉన్నప్పుడు 80లలో తీసిన రస్నా యాడ్ తో దేశంలోని పిల్లలందరినీ ఆకర్షించింది. ఈ ఒక్క యాడ్ తో దేశవ్యాప్తంగా బ్రాండ్ పాపులర్ అయింది. అప్పట్లో ‘ఐ లవ్ యూ రస్నా’ అంటూ చిన్న పిల్లలతో పాటు పెద్దల దాకా ప్రతిఒక్కరూ అనేవారు.

  ఇక రస్నా బ్రాండ్ ఫ్లేవర్లతో భారత్ లో వ్యాపిస్తున్న రోజుల్లోనే ఇంటర్నేషనల్ కూల్ డ్రింక్ కంపెనీల పోటీ తీవ్రతరమైంది. కోకో కోలా, పెప్సీ లాంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కూల్ డ్రింక్స్ కంపెనీలను మింగివేయడం మొదలైంది. మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే అమ్మడం వల్ల చిన్న చిన్న కంపెనీలన్నీ మూతపడిపోయాయి. దీంతో రస్నా కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కానీ, ఈ బ్రాండ్ అప్పటికే ప్రజల మనసుల్లో పాతుకుపోవడం వల్ల ఎన్ని పెద్ద కంపెనీలు కూడా దీని ముందు నిలవలేకపోయాయి. అచ్చం దీనిలాగే ఇతర కంపెనీలు కూడా ప్రయత్నించాయి. 2001లో టాంగ్ కంపెనీ, 2011లో కోకాకోలా-సన్‎ఫిల్ అనే పేరుతో రస్నాలా పొడిని తయారు చేశాయి. కానీ రస్నా ధాటికి ఈ పెద్ద కంపెనీలు కూడా నిలబడలేకపోయాయి. కూల్ డ్రింక్ ఫ్లేవర్ల సాఫ్ట్ డ్రింక్ లలో రస్నా తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. సాఫ్ట్ డ్రింక్ స్థానంలో 80 శాతం మార్కెట్ ను రస్నా ఆక్రమించింది.

  అయితే ఏదైనా కంపెనీ కాలానుగుణంగా మారితేనే మనుగడ కొనసాగిస్తుంది. సాంప్రదాయం పేరుతో దశాబ్దాల కాలం తర్వాత కూడా అదే పాత ఫార్ములాను అనుసరిస్తే కంపెనీ ఎదిగే అవకాశం చాలా తక్కువ. అప్పటివరకూ కేవలం పొడిని అమ్మడానికే పరిమితమైన రస్నా 2002 నుంచి జ్యూస్ లను అమ్మడం మొదలుపెట్టింది. పళ్ళరసాలను కూడా ఎంతో నాణ్యతతో తక్కువ ధరకే అమ్మడం వల్ల ఇవి కూడా బాగా సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో పాటు 2010లో రస్నా హెల్త్ డ్రింక్ సెగ్మెంట్ లో ప్రవేశించింది. ఈ విధంగా కాలానుగుణంగా మార్పులు చెందుతూ తన సుస్థిర స్థానాన్ని పదిలం చేసుకుంది.

  ఈ విధంగా కాలానుగుణంగా ఎదురయ్యే పోటీలను తట్టుకుని నిలబడిన రస్నా కంపెనీ కేవలం భారత్ లో మాత్రమే కాకుండా విదేశాలకు కూడా విస్తరించింది. కోకాకోలా లాంటి కంపెనీల ప్రభావం విదేశాల్లో చాలా ఉన్నా కూడా దాన్ని తట్టుకుని విస్తరించింది. రస్నా కంపెనీ వెబ్ సైట్ ప్రకారం ఇప్పటికే 53 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. ఒక చిన్న పరిశ్రమ స్థాయి నుంచి మొదలైన రస్నా విదేశాలకు సైతం ఎదిగింది. లోకల్ ఫర్ గ్లోబల్ అనే నినాదాన్ని రస్నా కంపెనీ సాధించి చూపింది. ఈ విధంగా ఒక చిన్న కంపెనీని 53 దేశాలకు పైగా విస్తరించిన అరీఫ్ ఫిరోజ్ షా కంబట్టా గుండెపోటుతో మృతి చెందడం రస్నా అభిమానులతో పాటు.. సగటు భారతీయులను ఆవేదనకు గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేషనలిస్ట్ హబ్ కోరుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.. పదిమందికీ షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెల్స్‎ను సబ్‎స్క్రయిబ్ చేసుకోండి.

  Trending Stories

  Related Stories