More

  అసోం-మిజోరాం మధ్య తెల్లోడి చిచ్చు..!

  విభజించి పాలించు అనే దుష్టనీతితో.. బ్రిటిష్ వాడు మన దేశంలో పెట్టిన చిచ్చు అంతా ఇంతా కాదు. నాటి సంస్థానాలను ముక్కలు చేశాడు. ప్రెసిడెన్సీల పేరుతో గోడలు కట్టి.. దేశాన్ని భాగాలు చేసుకుని పాలించాడు. దశాబ్దాలుగా కశ్మీర్ రావణకాష్టంలా రగులుతోందంటే.. దానికి దేశవిభజనే కారణం. స్వాతంత్ర్యం సిద్ధించిందని సంతోషించేలోపే.. మతోన్మాదులకు తలొగ్గి.. దేశాన్ని మూడు ముక్కలు చేశాడు. మీరూ మీరూ కొట్టుకు చావండని చేతులు దులుపుకున్నాడు. కశ్మీర్ ఒక్కటే కాదు.. ఎన్నో ప్రాంతాల మధ్య శాశ్వత పరిష్కారం చూపకుండా.. ప్రాంతాల మధ్య ఇష్టమొచ్చినట్టు సరిహద్దు రేఖలు గీశాడు. దేశ సరిహద్దులను వివాదం చేయడమే కాదు.. రాష్ట్రాల సరిహద్దులను కూడా వివాదాస్పదంగా మార్చేశాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేడు అలాంటి అపరిష్కృత సరిహద్దులెన్నో వున్నాయి. వాటిలో ఒకటే.. అసోం-మిజోరాం బోర్డర్.

  ఇటీవల ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బోర్డర్‎లో అపరిష్కృతంగా వున్న భూవివాదంతో మరోసారి అక్కడ హింస చెలరేగింది. ఇరు రాష్ట్రాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. రైతుల గుడిసెలు, ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. ఈ గొడవ పోలీసుల మధ్య కాల్పుల వరకు వెళ్లింది. ఈ క్రమంలో మిజోరాం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించారు.

  నెలరోజుల క్రితం కూడా ఓసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐత్లాంగ్హనార్ అనే ప్రాంతాన్ని అసోం తమ అధీనంలోకి తీసుకుందని మిజోరాం ఆరోపించింది. దీనిని ఖండించిన అసోం.. తమ ప్రాంతాన్నే మిజోరాం ఆక్రమించుకుందంటూ ఆరోపించింది. మిజోరాంలోని మూడు జిల్లాలు అంటే ఐజ్వాల్, కొలాసిబ్, మమిత్‌లు అసోం లోని కాచర్, కరీంగంజ్, హైలకంది జిల్లాలతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. జూన్ 30న కొలాసిబ్‌ జిల్లాకు సమీపంలోని సరిహద్దు దాటి అసోం తమ రాష్ట్ర భూభాగంలోకి అక్రమంగా చొరబడిందని మిజోరాం ఆరోపణలు చేసింది. అయితే మిజోరాం రాష్ట్రమే అసోంలోని హైలకంది జిల్లాలోకి 10 కిలోమీటర్ల మేరా అక్రమంగా చొరబడి అక్కడ అరటి చెట్లు, వక్కపొడి చెట్లను నాటిందని అసోం రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు.

  అసోం అధికారులు ఆక్రమించారని మిజోరాం ఆరోపణలు చేస్తున్న ప్రాంతాన్ని స్థానికంగా ఐత్లాంగ్హనార్ అని పిలుస్తారు. ఇది ఐత్లాంగ్ నది సమీపంలో ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఈ ప్రాంతం మిజోరాంకు చెందుతుందని ఇది కొలాసిబ్ జిల్లాలోని వేరెంగ్తే గ్రామం కిందకు వస్తుందని మిజోరాం చెబుతోంది. అయితే అసోం వాదన ఇందుకు భిన్నంగా ఉంది. మిజోరాం రాష్ట్రమే అసోం భూభాగంలోకి అడుగుపెట్టి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడింది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆ తర్వాత అది కాస్త అగ్గిరాజుకోవడంతో వివాదం మరింత వేడిని పెంచింది. దీంతో హింస చెలరేగింది.

  నిజానికి, ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి బ్రిటీష్ కాలంలోనే బీజం పడిది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఈశాన్య భారతంలో క్రమంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత మిజోరాం రాష్ట్రం ఒకప్పుడు అసోం రాష్ట్రంలో ఒక జిల్లాగా వుండేది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా మారింది. ఒక మిజోరాం మాత్రమే కాదు.. మణిపూర్, త్రిపుర మినహా.. ప్రస్తుత ఈశాన్య రాష్ట్రాలన్నీ అసోం నుంచి వేరుపడ్డవే. 1963లో నాగాలాండ్ ను, 1970లో మేఘాలయను ఏర్పాటు చేశారు. 1972లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలను ఏర్పాటయ్యాయి. ఇక, అవశేష రాష్ట్రంగా ప్రస్తుత అసోం మిగిలిపోయింది. అయితే, మిజోరాం, అసోం రాష్ట్రాలు విడిపోయాయి కానీ, బ్రిటీష్ కాలం నాటి సరిహద్దు వివాదం మాత్రం అలాగే కొనసాగుతోంది.

  అసోం-మిజోరాం రాష్ట్రాల మధ్య 165 కిలోమీటర్ల మేర సరిహద్దు వుంది. ప్రస్తుత మిజోరాం రాష్ట్రాన్ని ఒకప్పుడు లుషాయ్ హిల్స్ అని పిలిచేవారు. 1857లో అప్పటి బ్రిటీషు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. లుషాయ్ హిల్స్‌ కాచర్ ప్రాంతం నుంచి వేరుపడింది. ఆ తర్వాత 1933లో లుషాయ్ హిల్స్ మణిపూర్‌ల మధ్య ఓ సరిహద్దును నిర్వచిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. లుషాయ్ హిల్స్ మరియు అసోంలోని కాచర్ జిల్లాల నుంచి మణిపూర్ సరిహద్దు ప్రారంభమవుతుంది. అయితే, 1875 నోటిఫికేషన్ ప్రకారం సరిహద్దులను గుర్తించాలనేది మిజోరాం వాదన.

  బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ చట్టం 1873 ఆధారంగా.. 1875 నోటిఫికేషన్ ను రూపొందించారు. BEFR చట్టం ఇన్నర్ లైన్ రెగ్యులేషన్స్ ను నిర్వచించింది. దానినే ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ అంటారు. దీని ప్రకారం నాడు సరిహద్దులను ఏర్పాటు చేశారు. అయితే, అసోం మాత్రం 1933 నోటిఫికేషన్ లో రూపొందించిన సరిహద్దులను అనుసరిస్తోంది.

  148 ఏళ్ల క్రితం నోటిఫై చేసిన.. 1873 BEFR రెగ్యులేషన్ ప్రకారం.. 1,318 చదరపు కిలోమీటర్లు కలిగిన ఇన్నర్ లైన్ రిజర్వ్ ఫారెస్ట్ తమదేనని మిజోరాం వాదిస్తోంది. 1933 నోటిఫికేషన్ ప్రకారం ఆ ప్రాంతం తమ రాష్ట్ర పరిధిలోకే వస్తుందని.. ఆ ప్రాంతాన్ని వదులుకునేది లేదని అసోం చెబుతోంది. అయితే, మిజోరాం మాత్రం ఈ నోటిఫికేషన్ ను తప్పుబడుతోంది. తమను సంప్రదించకుండానే 1933 నోటిఫికేషన్ రూపొందించారనేది మిజోరాం వాదన. ఇలా బ్రిటీష్ కాలంలో వెలువడిన ఈ రెండు నోటిఫికేషన్లే ఇరు రాష్ట్రాల మధ్య గొడవకు కారణమయ్యాయి. ఒక నోటిఫికేషన్ లో ఒకలా.. మరో నోటిఫికేషన్ లో మరోలా సరిహద్దులు నిర్వచించడం వివాదానికి దారితీసింది.

  వివిధ గిరిజన తెగలు, వాస్తవికత గురించి తెలుసుకోకుండానే.. అనాలోచితంగా అప్పట్లో బ్రిటిషర్లు ఇష్టం వచ్చిన రీతిలో సరిహద్దులను నిర్ణయించారు. ప్రస్తుత మిజోరాంలో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా.. అదే రీతిలో ప్రవర్తిస్తోంది. తమ రాష్ట్రానికి చెందిన మిజో జాతి తెగలు కాచర్ హిల్స్ లో నివసిస్తోందని.. అందువల్ల ఆ భూభాగం తమదేనంటూ వాదిస్తోంది.

  ఇదిలావుంటే, మిజోరాం అసోం రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఉమ్మడి సరిహద్దు వద్ద స్టేటస్‌కో మెయిన్‌టెయిన్ చేయాలని నిర్ణయించాయి. అయితే 2018 ఫిబ్రవరిలో మిజో జిర్లాయ్ పాల్ అనే విద్యార్థి సంఘం.. మిజోరాం రైతుల కోసం అసోం భూభాగంలో ఒక రెస్ట్ హౌజ్ నిర్మించింది. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోం పోలీసులు దాన్ని కూల్చివేశారు. గతేడాది అక్టోబర్‌లో ఒకే వారంలో రెండు సార్లు హింస చెలరేగింది. అసోంలోని లైలాపూర్‌ ఓ నిర్మాణం చేపట్టడంతో మిజోరాం భగ్గుమంది. అది తమ భూభాగమని వాదించింది.

  ఇటీవల ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి గొడవలు చెలరేగాయి. నెలరోజుల నుంచి అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగానే వున్నాయి. తాజా గొడవల్లో ఆరుగురు అసోం పోలీసులు చనిపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహంతో వున్నారు. తమ పోలీసులను చంపి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండంటూ.. మిజోరాం పోలీసులు, స్థానిక ప్రజలు ఒకరికొకరు అభినందనలు చెప్పుకుంటున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

  సరిహద్దులో తరచూ ఘర్షణలు జరగడానికి జాతుల ఉనికి కూడా కారణం. మైనారిటీ జాతులను అణిచివేసేందుకు కొన్ని గ్రూపులు గొడవపడతాయి. కొన్నిసార్లు ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి రెండు గిరిజన గ్రూపుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇలాంటి సమస్యలు దశాబ్దాలుగా వున్నాయి. మిజోరాం-అసోం గొడవ కూడా ఈ కోవకు చెందినదే. అయితే, గత ప్రభుత్వాలు దీనిని పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దు అపరిష్కృతంగానే మిగిలిపోయింది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా ఈశాన్య ప్రాంతాలను సందర్శించి ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో భాగమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులతో సమావేశమై.. సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

  Trending Stories

  Related Stories