భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నవేళ జపాన్ రాజధాని టోక్యో నగరి ఒలంపిక్ క్రీడలకు వేదికైంది. నాలుగు శతాబ్దాల పురాతన టోక్యో నగరం 201 దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న 11వేల మంది క్రీడాకారులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
ప్రపంచ దేశాల గౌరవ ప్రతిష్ఠలను అత్యంత శక్తివంతమైన ఆయా దేశాల ప్రభుత్వాలు మంటగలుపుతుంటే క్రీడాకారులు తమ వైయక్తిక ప్రతిభతో కాపాడే ప్రయత్నం చేయడం వర్తమాన వైచిత్రి. దేశాల మధ్య వైరుధ్యాలు, విభేదాలు, శతృత్వాలు అన్నీ క్రీడల్లోనూ ప్రతిఫలిస్తాయి. వర్తమాన రాజకీయ సందిగ్దతకు క్రీడలు అతీతం కాదు.
క్రీడా మైదానాలు కేవలం వినోద కేంద్రాలే కాదు, ప్రపంచ దేశాలు పరస్పరం తలపడే రణస్థలి కూడా. విజయగర్వంతో స్వర్ణ పతకాన్ని అందుకున్న ఆటగాడి దరహాసంలో దేశాల ఖ్యాతి ఇమిడి ఉందనుకునే అల్పమైన అవగాహన ఇవాళ అంతటా వ్యాపించింది. ‘దేశాలు చుట్టివచ్చిన ఒలంపిక్ జ్యోతిలో క్రీడా స్ఫూర్తి కన్నా, యుద్ధ కాంక్షే కనిపిస్తోంది’ అన్నాడు ఓ అంతర్జాతీయ పరిశీలకుడు. కాగడాలో రగిలే జ్వాల అన్ని సందర్భాల్లో జీవశక్తిని నింపకపోవచ్చు.
ఒలంపిక్స్ పట్ల ప్రతికూల వైఖరి ఉండనక్కరలేదు కానీ, అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు, వినిపిస్తున్న వార్తలూ…క్రీడల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాల గురించి ఆలోచింపజేస్తాయి. సూడాన్ జూడో ఆటగాడు మహమ్మద్ అబ్దుల్ రసూల్ ఇజ్రాయిల్ ఆటగాడు-తోహార్ బుత్ బుల్ తో తలపడేందుకు తిరస్కరించాడు. ఇంటర్నేషనల్ జూడో ఫౌండేషన్ కానీ, సుడాన్ అధికారులు కానీ, ఈ తిరస్కరణకు ఎలాంటి కారణాలు బయటపెట్టలేదు.
పాలస్తీనా – ఇజ్రాయిల్ ఘర్షణల నేపథ్యంలోనే సుడాన్ కు చెందిన జుడోకు ఇజ్రాయిల్ ఆటగాడితో పోటీకి ఒప్పుకోలేదనేది బహిరంగ రహస్యం. అల్జీరియా ఆటగాడు ఫతే నౌరీన్ సైతం ఇజ్రాయిల్ జుడోకూ ఉంటే రింగ్ లోకి అడుగుపెట్టేది లేదని శపథం చేశాడు. ‘ఒలంపిక్స్ కోసం తాము ఎంతగానో శ్రమించామనీ, అయితే పాలస్తినా ప్రజల సమస్య తమ విజయం కంటే ప్రధానమైందనీ’ తేల్చి చెప్పాడు. అల్జిరియా క్రీడా మంత్రిత్వ శాఖ సైతం ఆటగాళ్ల నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల వైఖరి కేవలం వారి వ్యక్తిగతమైంది కాదు, శకలాలుగా విడివడిన భూగోళం తాలూకు వ్యక్తీకరణ.
ఈ ఇద్దరు వేరు వేరు దేశాల ఆటగాళ్లు తోహర్ బుత్ బుల్ తో తలపడేందుకు నిరాకరించిన దాఖలా గురించి బ్రిటీష్ దిన పత్రిక జూలై 28న ‘ది ఇండిపెండెంట్’ ‘‘Second athlete sent home from Tokyo Olympics for refusing to face Israeli opponent’’ శీర్షికన ఓ కథనాన్ని ప్రచురించింది. మాతృదేశ గౌరవాన్ని ఇనుమడింపజేయాలనే ఇజ్రాయిల్ ఆటగాడికి, తనదేశం అవలంబిస్తున్న విదేశాంగ విధానం ఆటంకంగా మారడం క్రీడాజగత్తులో చొరబడిన రాజకీయాల తాలూకు సారాన్ని బట్టబయలు చేస్తోంది.
ఒలంపిక్స్ వేదికగా మరో నినాదం వార్తల్లో ప్రధానంగా నిలుస్తోంది. నల్లజాతీయులపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న జాత్యాహంకార దాడులను నిరసిస్తూ…పుట్టిన ‘‘taking the knee ’’ నినాదం మనవజాతి అంతరాంతరాల్లో మిగిలిపోయిన వర్ణవివక్ష తాలూకు అల్పత్వాన్ని సూచిస్తోంది. అమెరికా పౌరహక్కుల కార్యకర్త, ఫుట్ బాల్ మాజీ ఆటగాడు Colin Kaepernick ‘టేకింగ్ ది నీ’ నినాదాన్ని భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. గ్రేట్ బ్రిటన్ కు చెందిన మహిళా ఫుట్ బాల్ జట్టు ‘టేకింగ్ ది నీ’ నినాద స్ఫూర్తితో ఒలంపిక్స్ మైదానం నుంచి తప్పుకుంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సందర్భాల్లో జరిగే ఒలంపిక్ క్రీడల్లో ఇలాంటి ప్రతిస్పందనలు రావడం ఇదేమీ తొలిసారి కాదు. 1936లో నాజీ జర్మనీలో జరిగిన ఒలంపిక్స్ లో అమెరికా, యూకేలు పాల్గొనడానికి నిరాకరించాయి. హిట్లర్ నేతృత్వంలోని ‘థర్డ్ రీష్’ అమానుష స్వభావానికి నిరసనగా పోటీ నుంచి తప్పుకున్నాయి.
జర్మనీ, జపాన్ లు రెండో ప్రపంచ యుద్ధ నెపం పెట్టి 1948 ఒలంపిక్స్ లో పాల్గొనలేదు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా 1964 నుంచి 1992 వరకూ ఒలంపిక్స్ ను బహిష్కరించింది. నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు 1956లో మెల్ బోర్న్ లో జరిగిన ఒలంపిక్స్ ను బహిష్కరించాయి. సోవియట్ యూనియన్ యుద్ధ ట్యాంకులు హంగరీ విప్లవాన్ని అణచివేసినందుకు నిరసనగా ఆయా దేశాలు బహిష్కరణ పల్లవిని అందుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ‘సూయిజ్ సంక్షోభ కాలం’లో 1956లో మెల్ బోర్న్ లో జరిగిన ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ఈజిప్ట్, ఇరాన్, లెబనాన్ దేశాలు నిరాకరించాయి. 1964లో బహిష్కణ అస్త్రాన్ని వాడాయి చైనా, ఉత్తర కొరియా, ఇండోనేసియా దేశాలు. ఈ నిరాకరణ మంత్రానికి కారణం భౌగోళిక వివాదాలు కాదు, తమ దేశాల అథ్లేట్ల విషయంలో ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కమిటీతో ఏర్పడిన భేదాభిప్రాయాలే !
ఇజ్రాయిల్-పాలస్తినాల మధ్య శతాబ్దకాలంగా రగులుతున్న మారణహోమానికి గుర్తుగా మిగిలిపోయిన మరో రక్తసిక్త గాయం…1972లో మ్యూనిక్ ఒలంపిక్స్ సంఘటన. ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు మ్యూనిక్ నగరానికి వచ్చిన 11 మంది ఇజ్రాయిల్ అథ్లెట్లను పాలస్తీనా హంతక మూకలు పొట్టనపెట్టుకున్నాయి. వినోద కలాపం కావాల్సిన క్రీడా మైదానం కాస్త విషాదంగా మారి మ్యూనిక్ మారణకాండగా చరిత్రకెక్కింది. ప్రభుత్వాల వైఖరులకు ఆటగాళ్లు బాధ్యులు కారు. ప్రతినిధులు అంతకన్నా కాదు. కానీ, రాజకీయ నిర్ణయాలవల్ల రగిలే అంతర్జ్వాల పెనుమంటగా మారిన తర్వాత ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా దహిస్తుందో అంచనావేయడం ఎంతపెద్ద దుర్బిణికైనా అసాధ్యమే!
సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్థాన్ ను దురాక్రమించిన నేపథ్యంలో 1980లో జరిగిన మాస్కో ఒలంపిక్స్ ను సుమారు 65 దేశాలు బహిష్కరించాయి. నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఈ ‘మహా బహిష్కరణ’కు నేతృత్వం వహించాడు. ఇస్లామిక్ దేశాలతో పాటు చైనా, పశ్చిమ జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్, కెనడా దేశాలు అగ్రరాజ్యాన్ని అనుసరించాయి.
అమెరికా బాక్సర్ మొహమ్మద్ ఆలీ బహిష్కణ ఉద్యమంలో పాల్గొని మిగతా దేశాల సంఘీభావాన్ని కోరాడు. తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి రష్యా 1984లో లాస్ ఏంజెల్స్ ఒలంపిక్స్ ను వేదికగా మార్చుకుంది. అమెరికా అనుసరిస్తున్న సోవియట్ వ్యతిరేక ధోరణికి నిరసనగా అంతర్జాతీయ క్రీడలను బహిష్కరించింది.
క్రీడల్లో రాజకీయ జోక్యం, ఆటగాళ్లలో సద్యోజనిత రాజకీయ స్పందనలూ అరుదుగా ప్రస్ఫుటమవుతుంటాయి. అయితే, ఉద్రిక్తతల పాలు హెచ్చిన కొలదీ సహజంగానే క్రీడా ప్రాంగణాలన్నీ అభివ్యక్తికి వేదికలుగా మారిపోతుంటాయి. చైనా వైరస్ ప్రపంచాన్నిపట్టిపీడిస్తున్న వర్తమాన సన్నివేశంలో దేశాల మధ్య రోజురోజుకీ తీవ్రమవుతున్న ఘర్షణాత్మక వాతావరణం టోక్యో ఒలంపిక్స్ లో తేటతెల్లంగా కనిపిస్తోంది.
వర్తమానంలో చైనా, అమెరికాల మధ్య నెలకొన్న వైరంలో అనేక కారణాల వల్ల అగ్రరాజ్యమే వెనక్కి తగ్గింది. భూగోళం మీదకు ఒంటికాలిపై లేస్తోన్న డ్రాగన్ తన ప్రతాపాన్ని చూపేందుకు ప్రతి వేదికనూ బ్యాటిల్ గ్రౌండ్ గా మారుస్తోంది. ఎనభయ్యో దశకం పూర్వార్ధం వరకూ ఒలంపిక్స్ లో చైనా పోటీదారు కాదు. లీగ్ టేబుళ్లలో దాని ఊసే ఉండేది కాదు. యుద్ధక్రీడల్లో ఆరితేరిన డ్రాగన్ సాధారణ ఆటలపోటీలను తేలిగ్గానే తీసుకుంది.
ఇరవయ్యో శతాబ్దం తొలివేకువ కాలంలో అభివృద్ధి చెందుతున్న, ఆర్థికంగా వెనుకబడిన పేదదేశంగా మాత్రమే దాని ఉనికి లోకానికి వినిపించేది. ఫిలిప్పిన్స్ లాంటి చిన్న దేశాల సరసన మాత్రమే నిలిచేది. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కొనుగోలు చేసే శక్తి కూడా చైనా పౌరులకు ఉండేది కాదు.
ఆనాటికి దాని సైనిక శక్తి కూడా అంతంత మాత్రమే. డెంగ్ జియావో పింగ్ అమలు చేసిన ’’hide and bide’’-దాక్కో-ఓర్చుకో’ విధానం కారణంగా లోపాయికారిగా వ్యవహరించింది. అలాంటి చైనా 2018 తర్వాత జూలు విదిల్చింది.
1984 లాస్ ఏంజెల్స్ లో చైనా ఒక్కటంటే ఒక్క స్వర్ణాన్ని కూడా సాధించలేదు. అదే చైనా 2008 వచ్చేసరికి అమెరికాను తలదన్ని 48 స్వర్ణాలను కైవసం చేసుకుంది. అమెరికా 36 బంగారు పతకాలతో సరిపెట్టుకుంది. చైనా భిన్నరంగాల్లో సాధించిన ప్రగతి క్రీడలకూ వ్యాపించింది. పశ్చిమ దేశాలు మోహరించిన ఒలంపిక్ మైదానాన్ని తన అదుపులోకి తెచ్చుకోవాలన్న కాంక్ష క్రమంగా డ్రాగన్ లో పెరుగుతూ వచ్చింది. స్వర్ణ పతకాలు సాధించి, గాలిమేడల కీర్తిని పొందాలని భావించడంలేదు చైనా. తను దాటే ప్రతి మైలురాయినీ అన్యాక్రాంత యుద్ధంలో ఆయుధాలుగా మలుచుకుంటోంది.
“The Olympic idea in the modern era is symbolic of a world war, one that does not openly reveal its military ambitions, but which provides—to those who know how to read sports statistics—a good appreciation of the hierarchy of nations.” అంటూ వ్యాఖ్యానించింది 1913లో జర్మనీకి చెందిన స్పోర్ట్స్ పత్రిక. అంటే ‘ఆధునికయుగంలో జరిగే ఒలంపిక్ క్రీడలు ప్రపంచ యుద్ధ సన్నాహాలకు ప్రతీక. సైనిక లక్ష్యాలను అవి నేరుగా ప్రతిబింబించకపోవచ్చు కానీ, క్రీడల గణాంకాలు జాగ్రత్తగా పరిశీలిస్తే దేశాల మధ్య అంతరాల తారతమ్యం అర్థమవుతుంది’’ అంటూ లోతైన విశ్లేషణ చేసింది.
‘‘The Read ’’ పత్రిక సైతం ‘‘The geopolitics behind the Olympics’’ పేరుతో ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఆసులో దారంలా రాజకీయ పరిణామాల తాలూకు సారం క్రీడల్లోనే స్పష్టంగా అర్థమవుతుందని ఈ కథనంలో పేర్కొంది.
అలాంటి చైనా నేడు manufacturing workshop of the world-ప్రపంచపు ఉత్పాదక కర్మాగారంగా తయారైంది. అమెరికా మెరైన్ కోర్ జనరల్ , డిఫెన్స్ మాజీ సెక్రటరీ Jim Mattis ‘‘today, every domain is contested: air, land, sea, space, and cyberspace” అనే అంచనాను నిర్ధారించారు. అన్ని ప్రాంగణాల్లోనూ నెలకొన్న క్రిక్కిరిసిన పోటీలో చైనా తన ప్రాబల్యాన్ని చాటుతోంది.
ఈ ప్రభావం క్రీడామైదానంపై సైతం ఉండే అవకాశం తప్పక ఉంటుంది. వాణిజ్య దిగ్గజం, ‘స్పేస్ X’ అధినేత ఎలాన్ మస్క్ సైతం చైనా భిన్న రంగాల్లో వ్యక్తం చేస్తున్నధోరణిపై గాఢమైన విశ్లేషణ చేశారు. చైనా ఆర్థిక ఎదుగుదల కేవలం దాని భౌగోళిక పరిధులకే పరిమితం కాదనీ, ఇతరేతర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని ఇటీవలే హెచ్చరించారు.
క్రీడాకారులను సైతం చైనా సైనికుల్లాగే భావిస్తుంది. దేన్నయినా సరే యుద్ధంగానే పరిగణిస్తుంది. సైనిక శిక్షణ కేంద్రాలను పోలిన క్రీడా శిక్షణా సంస్థలను నిర్వహిస్తోంది. చైనా ఆటగాళ్లలో గెలుపు అనేది దేశ ప్రతిష్ఠ, గౌరవానికి సంబంధించిన అంశంగా ఉండదనీ, ప్రభుత్వ నైతిక దండనా భయమే క్రీడాకారులను విజయం వైపు ఉసిగొల్పుతుందంటారు క్రీడారంగ నిపుణులు.
శతఘ్నుల పేలుళ్లూ, తూటాల వర్షం, ట్యాంకర్ల వీరవిహారం సాగుతున్న రణరంగంలో చిక్కుకుపోయిన సైనికుల మానసిక స్థితీ, ఒలంపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్లలో పేరుకున్న భయవిహ్వలతలో వ్యత్యాసం ఉండదంటారు చైనాపై అధ్యయనం చేసిన నిపుణులు. వినోదాన్ని అందించే రంగాలపై అజమాయిషీ అనారోగ్య వాతావరణానికి కారణమవుతుందని చైనాను చూస్తే అర్థమవుతుంది. స్వర్ణాలు గెలవడం కాదు, హృదయసీమల్లో దేశభక్తిని నింపుకోవడమే క్రీడల పరమావధి.
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ ప్రారంభం అయిన మరునాడే చైనా పతకాల ఖాతా తెరిచింది. తొలి గోల్డ్ మెడల్ ను సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో చైనాకు చెందిన యాంగ్ కియాన్ స్వర్ణం గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో రష్యా షూటర్ అనస్తేసియా గలేషినా రజతంతో సరిపెట్టుకోగా…లాస్ట్ షాట్ లో చైనా ప్లేయర్ యాంగ్ కియాన్ గోల్డ్ గెలిచేసుకుంది.
ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో చైనా అమ్మాయిల పసిడి పట్టు కొనసాగుతోంది. టేబుల్ టెన్నిస్ క్రీడను తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మహిళల సింగిల్స్‌లో చైనా పసిడి పతకం నిలబెట్టుకుంటూనే వచ్చింది. ఏకంగా తొమ్మిదిసార్లు చైనా అమ్మాయిలే ఒలింపిక్ స్వర్ణం సాధించారు.
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కూడా తన సత్తా చూపుతోంది. మనదేశంలో క్రీడాకారులు ఔత్సాహిక పోటీదారులు మాత్రమే. పరిమిత ప్రోత్సాహం, అపరిమిత అవరోధాలూ ఆటగాళ్లను వెంటాడుతుంటాయి. పిడికెడు మంది మాత్రమే ఖ్యాతికెక్కి, సరిహద్దులు దాటి అంతర్జాతీయ మైదానాలకు చేరతారు. గ్రామీణ ప్రాంతాల్లో అనామకంగా మిగిలిపోయిన అనన్యసామాన్యమైన ప్రావీణ్యం ఉన్నవారు అనేకమంది క్రీడాకారులు ఉన్నారు. వారంతా ఈనాటికీ గ్రామాల పొలిమేరలు సైతం దాటిలేని స్థితిలో ఉన్నారు. వారంతా అంతర్జాతీయ వేదికలపై తమ శక్తిని ప్రదర్శించి…భారత్ ప్రతిష్ఠను పెంచాలనీ, పెంచుతారనీ ఆశిద్దాం..