More

    ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు, ఆంధ్ర విద్యార్థులను తీసుకుని రావడానికి తీవ్ర ప్రయత్నాలు

    ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయుల్లో 219 మందిని భారత్ తీసుకుని వస్తోంది. రొమేనియా స‌రిహ‌ద్దుల‌కు చేరుకున్న 219 మంది భార‌తీయుల‌ను విమానంలో ఎక్కించి ముంబైకి టేకాఫ్ కూడా తీసుకుంది. ఈ విష‌యాన్ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఫొటోల‌ను పోస్టు చేశారు. భార‌త విదేశాంగ శాఖ సూచ‌న‌ల‌ను అనుస‌రిస్తూ రొమేనియా స‌రిహ‌ద్దుల‌కు చేరుకున్న 219 మంది భార‌తీయుల‌ను ఆ విమానం ద్వారా ముంబైకి పంపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయులు అంద‌రినీ సుర‌క్షితంగా దేశానికి తీసుకువ‌చ్చేందుకు శ్ర‌మిస్తున్న‌ట్లుగా జైశంకర్ పేర్కొన్నారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను తానే స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నాన‌ని కూడా ఆయ‌న తెలిపారు. భార‌తీయుల త‌ర‌లింపులో మెరుగైన స‌హ‌కారం అందిస్తున్న రొమేనియా విదేశాంగ మంత్రి బోగ్డాన్ అరెస్కూకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

    ఉక్రెయిన్ లో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో అక్కడ ఉన్న మన దేశ ప్రజలకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకోకుండా ఏ బోర్డర్ పోస్టుకు వెళ్లవద్దని సూచించింది. పలు బోర్డర్ చెక్ పాయింట్ల వద్ద పరిస్థితి బాగోలేదని తెలిపింది. మన పౌరులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు సరిహద్దు దేశాల ఎంబసీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. సమాచారం అందించకుండానే బోర్డర్ చెక్ పాయింట్లకు చేరుకున్న భారతీయులకు సహాయం అందించడం మరింత కష్టతరంగా మారుతోందని తెలిపింది. ఎంబసీ అధికారులకు సమాచారం అందించకుండా బోర్డర్ పాయింట్లకు వెళ్లవద్దని సూచించింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు చాలా మంది బంకర్లలోకి వెళ్లిపోయారు. ఎంతోమంది సుదూరంగా ఉన్న బోర్డర్ పాయింట్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు.

    ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. కృష్ణబాబు మాట్లాడుతూ ఉక్రెయిన్ లోని 7 యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నదీ మ్యాపింగ్ చేశామని తెలిపారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సూచనలు ఇస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏపీ భవన్ తరఫున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఉక్రెయిన్ లో సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచనలు వచ్చాయని వెల్లడించారు. అదే విషయాన్ని ఏపీ విద్యార్థులకు వివరించామని, సరిహద్దుల వద్దకు వెళ్లొద్దని స్పష్టం చేశామని కృష్ణబాబు తెలిపారు. రుమేనియా ఎంబసీలను సంప్రదిస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులు తప్ప ప్రవాసాంధ్రులెవరూ తమను సంప్రదించలేదని కృష్ణబాబు తెలిపారు.

    Trending Stories

    Related Stories