More

    పామాయిల్‎పై కేంద్రం మరో కీలక నిర్ణయం..!

    ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెట్రోలు ధరలను తగ్గించిన కేంద్రం కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను తగ్గించింది. వీటితో పాటు వంట నూనె ధరల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.

    ధరలు అదుపు చేసే ప్రయత్నంలో భాగంగా పామాయిల్‌పై బేస్‌ దిగుమతి సుంకం తగ్గించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేం‍ద్రం తాజాగా బేస్‌ దిగుమతి సుంకాలు సవరించడంతో టన్ను క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతికి ఇంతకు ముందు 1703 డాలర్లు అవగా ఇప్పుడు 1625 డాలర్లకే రానుంది. రిఫైన్డ్‌ చేసిన పామాయిల్‌ విషయానికి వస్తే ఆర్‌బీడీ పామ్‌ ఆయిల్‌ ధర 1765 నుంచి 1733 డాలర్లకు దిగివచ్చింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పామాయిల్‌ ధరలు తగ్గుతాయని ఆనందించేలోపు సోయా రూపంలో ప్రమాదం వచ్చి పడింది. సోయా ఆయిల్‌ టన్ను ధర 1827 నుంచి 1,866కి పెరిగింది.

    అయితే వారంక్రితం రెండేళ్ల పాటు ఏటా 20 లక్షల టన్నుల పరిమితికి లోబడి.. ఈ రెండు వంట నూనెలను ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే దిగుమతి చేసుకునే క్రూడ్‌సోయా, సన్‌ఫ్లవర్‌ నూనెలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. అగ్రికల్చర్‌ సెస్‌ పేరుతో విధిస్తున్న 5 శాతం ప్రత్యేక సెస్‌ కూడా ఈ రెండు ముడి వంట నూనెలకు వర్తించదని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం శుద్ధి చేయని సోయా, సన్‌ఫ్లవర్‌ నూనెల దిగుమతిపై 5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు.

    ఈ రెండు పన్నుల ఎత్తివేతతో దేశంలో ఈ రెండు వంట నూనెల సెగ కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. తాజా సుంకాల తగ్గింపుతో 2024 మార్చి వరకు మొత్తం 80 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్‌, సోయాబీన్‌ నూనెలను ఉచితంగా దిగుమతి చేసుకునే అవకాశం లభించనుంది. సుంకాల ఎత్తివేత కారణంగా లీటర్‌ సోయాబీన్‌ ధర రూ.3 వరకు తగ్గే అవకాశం ఉందని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బీవీ మెహతా తెలిపారు. కాగా వినియోగదారులకు పెరుగుతున్న ధరల నుంచి ఉపశ మనం కల్పించేందుకు సుంకాలను పూర్తిగా ఎత్తి వేసినట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు తెలిపింది. మరోవైపు టారిఫ్‌ రేట్‌ కోటా కింద సుంకాల ఎత్తివేతను వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది.

    Trending Stories

    Related Stories