ANATOMY OF A ‘POLITICAL CHAMELEON’ పేరుతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ లో కొన్నేళ్ల క్రితం ఓ ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఓ సెమినార్ సందర్భంగా ‘రాజకీయ ఊసరవెల్లుల’ అంశంపై ఆసక్తికరమైన విశ్లేషణలు ముందుకు వచ్చాయి. వాటి ఉద్దేశాలు-నేపథ్యాలూ వేరైనా….భారత దేశ రాజకీయాల్లో ANATOMY OF A ‘POLITICAL CHAMELEON’ గురించి చర్చించాల్సిన అగత్యం ముందుకన్నా ఇప్పుడు మరింత పెరిగింది.
రంగు మార్చకుండా దిక్కుమార్చే వాళ్లూ, రంగూ దిక్కూ రెండూ మార్చేవాళ్ల చరిత్ర మన దేశంలో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. వర్తమాన రాజకీయాల్లో అలాంటి వారికేమీ ప్రాసంగీకత లేకపోయినా…వారు సృష్టించే గందరగోళం మాత్రం చాలా అలజడికి కారణమవుతుంది. అశాంతిని రేపుతుంది. దక్షిణ భారత దేశ రాజకీయాల్లో ‘రాజకీయ ఊసరవెల్లుల’ సంచారం ఎక్కువ.
దక్షిణాన రాజకీయ ఊసరవెల్లుల కాలం నిక్షేపంగా గడిచిపోవడానికీ-ఎన్నిక నల్లేరు మీద నడక కావడానికి కారణం కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు. మారిన స్థల-కాలాలను బట్టీ వైఖరులు మార్చుకోవడానికీ, అవకాశవాదంతో రంగు మార్చుకోవడానికీ నక్కకీ-నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
దక్షిణాది భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రను అధ్యయనం చేసిన అమిత్ షా…కుల ప్రాతిపదిక సమాజాన్ని చీల్చిన గతాన్నీ, అవినీతి-బంధుప్రీతి-అశ్రిత పక్షపాతం వేళ్లూనుకున్న రాజకీయాలూ, ప్రాంతీయ పార్టీలు సాంస్కృతిక అంశాలను తమ అవకాశవాదానికి ఉపయోగించుకున్న తీరుపై నిశితమైన అంచనాలను రూపొందించారు.
చారిత్రక స్పృహలేకుండా రాజకీయ చదరంగంలోకి దిగడం వ్యర్థమని భావించారు. అందుకే దక్షిణాది కోసం ప్రత్యేకంగా ‘‘ TINA ’’ అంటే There is no alternative అన్నమాట. ప్రత్యామ్నాయం లేదు అంటూనే తామే ప్రత్యామ్నాయమని చెప్పకనే చెప్పారు షా. వింధ్య దాటేందుకు వినూత్న వ్యూహం రచించిన అమిత్ షా…అనువుగాని చోట ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దూకుడు ప్రదర్శించాల్సిన చోట దూసుకుపొమ్మని శ్రేణులను సమయాత్తం చేస్తున్నారు.
‘‘TINA’’ వ్యూహం కేవలం దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఒడిషా రాష్ట్రాల్లో సైతం అమలు చేస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల ప్రాతిపదికన ప్రత్యేకమైన ఎత్తుగడలను రూపొందించమని రాష్ట్రాల్లోని కీలక నేతలను ఆదేశించారు.
ఉత్తరాది రాజకీయాలకు, Southern political ground కు ఉన్న వ్యత్యాసమేంటి? ఏ చారిత్రక కారణాలు ఈ భేదాలకు కారణం? అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలపై ఏ ప్రాతిపదికన దృష్టి సారించారు? షా చారిత్రక అధ్యయనం వల్ల రూపొందించిన అంచనాలేంటి? ‘‘TINA’’ వ్యూహం కేవలం దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమా? బెంగాల్లో దీదీకి షాకిచ్చిన అంశమేంటి? తిరుపతి కేంద్రంగా బీజేపీ దక్షిణాదిలో రూపొందించిన వ్యూహం విజయం సాధిస్తుందా? తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో సామాజిక సమీకరణలు ఎలా ఉండబోతున్నాయి?
ఇలాంటి అంశాల గురించి కూలంకుశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం….
ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉండటానికి చారిత్రక కారణాలూ ఉన్నాయి. దక్షిణ భారతంలోని ఐదు రాష్ట్రాల్లో గతంలో కొన్ని ప్రిన్స్ లీ స్టేట్స్ గా, బ్రిటీష్ ఇండియాలో భాగంగా ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ ముస్లీం రాచరిక పాలనలో మగ్గితే, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లు బ్రిటీష్ పాలన కింద ఉన్నాయి.
దీంతో అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు ముస్లీం పాలకులు, బ్రిటీష్ వలస వాదులు. సంస్కరణ, సేవ పేరుతో మతాన్ని జీవితంలోకి చొప్పించి దేశీయ సంస్కృతిని నాశనం చేశారు. విభజనను ప్రవేశపెట్టి సుదీర్ఘ అశాంతికి బీజం వేశారు.
స్వాతంత్ర్యం తర్వాత దక్షిణాన చెలరేగిన అశాంతికి ఈ చారిత్రక కారణాలే మూలం. ఆ తర్వాత ఏర్పడిన పార్టీలు, రంగంలోకి ప్రవేశించిన రాజకీయ సంస్థలు వీటిని విజయవంతంగా ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకున్నాయి.
ద్రవిడ ఉద్యమమైనా, ఆంధ్రదేశంలో వచ్చిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమమైనా, భక్తి ఉద్యమాన్ని స్వలాభం కోసం వాడుకున్న కన్నడ రాజకీయాలైనా, సెక్యూలరిజం పేరుతో మత వ్యాప్తికి కారణమైన కేరళ అయినా మొత్తంగా ‘విభజిత’ సమాజం పునాదిగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నాయి.
దక్షిణాది ప్రాంతీయ పార్టీలతో తలపడాలంటే చాలా చిక్కులున్నాయని బీజేపీ గుర్తించింది. జాతీయ వ్యతిరేక, హిందూ వ్యతిరేక పార్టీలకు నెలవు ఈ రాష్ట్రాలు. దీనికి కుల రాజకీయాలు తోడయ్యాయి. ఉత్తరాది, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కులం, తెగలు ప్రభావాన్ని చూపినా జాతీయ వ్యతిరేకత లేదు. హిందూ వ్యతిరేకత సైతం తక్కువ.
దీంతో దక్షిణాదిలో సామాజిక వర్గాల గణాంకాలను అనివార్యంగానే ఆశ్రయించింది బీజేపీ. ఉదాహరణకు తెలంగాణను తీసుకుందాం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలో 18 శాతం ఓట్లను సాధించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో అది కాస్త 34శాతానికి చేరింది. అంటే సుమారుగా రెండింతలైంది.
సికింద్రాబాద్ లో 27 శాతం, హైదరాబాద్ లో 42శాతంగా ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 స్థానాల నుంచీ 48 స్థానాలకు తన బలాన్ని పెంచుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ లకు ఓట్ షేరింగ్ లో కేవలం 0.3శాతం మాత్రమే తేడా ఉంది.
హైదరాబాద్ లోని 39 శాతం ఓబీసీలను, ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నంలో ఫలితాలు సాధించింది. ముఖ్యంగా శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసుల్లో జనాభా వివరాలు, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేశారు అమిత్ షా.
2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతి పార్లమెంటరీ సెగ్మెంట్ లో గ్రామీణ ఓటర్ల సంఖ్య గణనీయంగా 32.2 శాతంగా ఉంది. ఇందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలిజలు నిర్ణాయక పాత్ర పోషిస్తారు. ఎస్సీల జనాభా 25.15 శాతం కాగా ఎస్టీల జనాభా 9.56 శాతంగా ఉంది.
తిరుపతి లోక్‌సభ పరిధిలో దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మాల సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ. మాల, మాదిగ సామాజికవర్గాల మధ్య ఏడు నుంచి పదిశాతం ఓట్ల తేడా ఉంటుందని ఒక అంచనా. ఇలాంటి లెక్కలను బీజేపీ పరిగణలోకి తీసుకుంది.
తిరుపతి లోక్‌సభ పరిధిలో మాల సామాజికవర్గానిదే ఆధిపత్యం. ఇక్కడ నుంచి చింతా మోహన్ ఆరుసార్లు ఎంపీ అయ్యారు. మధ్యలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నెలవల సుబ్రమణ్యం సైతం అదే వర్గానికి చెందినవారు. 1999లో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ వెంకటస్వామి మాత్రం మాదిగ సామాజికవర్గం నేత. ఆయన ఎంపీ అయ్యారు. నాడు ఆ ఫార్ములా సక్సెస్ కావడంతో అదే ప్రయోగం మళ్లీ రత్నప్రభ ద్వారా చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మాల సామాజిక వర్గం ఓట్లు చీలినా.. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓట్లు తమకు గంపగుత్తగా పడతాయని బీజేపీ నేతల అంచనా. ఈ ఓట్లకు తోడు ప్రధాన సామాజిక వర్గమైన బలిజతో పాటు ఇతర సామాజికవర్గ ఓట్లు కలిసి వస్తాయని లెక్క లేసుకుంటున్నారు.
ఈ కారణంగానే బీజేపీ గ్రామీణ ఓటర్లపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు అర్బన్ ఏరియాలో ప్రధాన సమస్యల ప్రాతిపదికన ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. తిరుపతి పార్లమెంటరీ స్థానాన్ని కైవసం చేసుకుంటే టీడీపీకి చెక్ పెట్టడంతో పాటు వైసీపీతో బాహాబాహీకి దిగేందుకు రంగం సిద్ధమవుతుందని బీజేపీ భావిస్తోంది.
టీడీపీ విషయంలో బీజేపీ అంత ఖచ్చితమైన వైఖరి అవలంబించడానికి కారణం బలమైన సామాజిక వర్గం మద్దతుతో నాలుగు దశాబ్దులగా ప్రాబల్యాన్ని ప్రదర్శించడంతో పాటు అంత సులభంగా ఓటమి ఒప్పుకునే లక్షణం ఉన్నది కాకపోవడమే అందుకు కారణం. బలమైన కేడర్ ఉన్న టీడీపీని ముందు బదాబదలు చేస్తే…ఉద్వేగ పునాదులపై అధికారంలోకి వచ్చిన వైసీపీని సులభంగా గద్దె దించవచ్చని బీజేపీ భావిస్తోంది.
బెంగాల్ లో సైతం బీజేపీ ఇదే తరహా విధానాన్ని అవలంబిస్తోంది. దక్షిణాదితో పాటు తూర్పు రాష్ట్రాల్లో పథకం ప్రకారం ఎదుగుతోంది. 2024లో సాధారణ ఎన్నికలతో పాటు జరిగే ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పి టు పి-పార్లమెంట్ టు పంచాయిత్ పని పద్ధతిని అనుసరిస్తోంది
గడిచిన రెండు మూడేళ్లుగా భారతీయ జనతా పార్టీ బెంగాల్ సామాజిక సమీకరణాలపై బాగా దృష్టిపెట్టింది. వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో, గిరిజనుల్లో ఉండే అస్తిత్వ ఆరాటాన్ని పసిగట్టి వాళ్లను నాయకత్వ శ్రేణుల్లోకి తీసుకొచ్చింది. మధ్యతరగతిని జాతీయవాద భావ జాలంతో ఆకర్షించగలిగింది. బీజేపీ చాపకింద నీరులా చేపట్టిన ఈ సోషల్ ఇంజనీరింగ్ సత్ఫలితాలను ఇస్తోంది.
నిజానికి బెంగాల్ లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసింది. అయితే మమత ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టింది. ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది. ఈ నష్టాన్ని పూరించేందుకు ‘బెంగాల్ సంస్కృతి’ చర్చను లేవదీసింది దీదీ. ప్రీపోల్ సర్వేలు ఎలా ఉన్నా….గాలి కమలం వైపే వీస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ -25, తెలంగాణ -17, కర్నాటక-28, తమిళనాడు-39, కేరళ -21, పాండిచ్చేరి -1, అండమాన్ నికోబార్ -1, లక్షద్వీప్-1 ల్లో మొత్తం 133 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటికి తోడు తూర్పున ఉన్న ఒడిశా -21, పశ్చిమ బెంగాల్ -43 లోక్‌సభ స్థానాలను కూడా కలుపుకుంటే.. మొత్తం 197. ఇందులో కనీస 145 నుంచి 150 స్థానాలు దక్కించుకోవాలనేది బీజేపీ వ్యూహం. ఇందుకోసం సిద్ధం చేసిందే ‘‘TINA’’ వ్యూహం. ప్రాంతీయ పార్టీల ప్రాబల్య రాష్ట్రాల్లో పాగా వేస్తే అసెంబ్లీ స్థానాల మాటెలా ఉన్నా పార్లమెంట్ స్థానాలను మాత్రం కచ్చితంగా దక్కించుకోవాలనే పంతంతో బీజేపీ.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా గ్రౌండ్ అవుతున్న కమలం పార్టీకి తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ కలిసి వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బలం పుంజుకునేందుకు అవకాశం ఇస్తుందనడంలో సందేహం లేదు. నిజానికి దక్షిణ భారత దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ పతనావస్థలో ఉన్నాయి. అయితే 2004 నుంచి 2014 వరకూ పదేళ్ల కాలం అధికారంలో ఉన్న యూపీఏ కారణంగా ప్రాంతీయ పార్టీలకు శ్వాస తీసుకునే అవకాశం లభించింది. అవినీతి కారణంగా భారీ ఎత్తున అక్రమ సంపదను పోగేసుకున్నాయి. మొత్తంగా తెలుగునాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముసుగు లౌకికవాదానికీ, జాతీయ వాదానికీ మధ్య సిద్ధాంతపరమైన ఘర్షణ మరింత తీవ్రమవుతున్న కాలంలో శ్రీవారి చెంతన జరుగుతున్న ఎన్నిక నిర్ణయాత్మక ఫలితాన్నిస్తుందా? ఏమో వేచి చూడాల్సిందే!