More

  ఉత్తరాది ఒక రణక్షేత్రం..! సాధువు ఒక సైనికుడు..?

  దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ల‌ఖీంపూర్ ఖేరీ  లో జ‌రిగిన ఘ‌ట‌న దేశ రాజ‌కీయాల‌ను అత‌లాకుత‌లం చేసింది. చేస్తోంది. చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా కూడా ఉన్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఘటనపై స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. అరెస్టులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బన్‌బీర్‌పూర్‌సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌మౌర్య, అజయ్‌మిశ్రాలకు నల్లజెండాలతో రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు ఎక్కువయ్యాయి.

  లఖీంపూర్‌ఖేరీ ఘటనలో మృతిచెందిన రైతులు, జర్నలిస్టు  కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున సాయంగా అందజేస్తామని కాంగ్రెస్‌పాలిత ఛత్తీస్ గఢ్‌, పంజాబ్‌ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ఘటనపై ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణ లో సీబీఐ విచారణ జరిపించాలని యూపీకి చెందిన శివ కుమార్‌త్రిపాఠి, సీఎస్‌పండా అనే న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మంత్రి అజయ్‌మిశ్రా, ఆయన కుమారుడు అశిష్‌మిశ్రాలను శిక్షించాలని కోరారు. లఖీంపూర్‌ఖేరీ ఘటనను సుప్రీంకోర్టు సుమో టోగా స్వీకరించింది. ఈ కేసును చీఫ్‌జస్టిస్‌ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

  న్యాయాన్యాయాల చ‌ర్చ‌క‌న్నా…ఘ‌ట‌న చోటుచేసుకున్న‌తీరు అత్యంత బాధాక‌రం. రాజ‌కీయ చ‌ట్రాల్లోకి కుదించి మృతిచెందిన‌వారికి శ‌వ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించడం ఆన‌వాయితీగా మార‌డం సిగ్గుచేటు. చ‌నిపోయింది మామూలు మ‌నుషులు. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ది అధికార బీజేపీకి చెందిన మంత్రీ, ఆయ‌న కుమారుడు. అజ‌య్ మిశ్రా త‌థాగ‌తుడేమీ కాదు. ఆయ‌న కుమారుడు శాంతిదూతా కాదు. అధికారం ఉన్న‌వారివ‌లెనే వారు కూడా కొంచెం అధికార మ‌దాన్ని ప్ర‌ద‌ర్శించి ఉండ‌వచ్చు. రెచ్చ‌గొట్టాల‌న్న పంతంతో వ‌చ్చిన‌వారికి అజ‌య్ మిశ్రా త‌న‌యుడి అహంకారం మ‌రింత ఉప‌క‌రించి ఉండ‌వ‌చ్చు.

  ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త్వ‌ర‌గా మేల్కొని చ‌ర్య‌లు తీసుకుని ఉంటే…మేలు జ‌రిగి ఉండేది. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు క‌ళ్లెం వేసే అవ‌కాశం కూడా మిగిలేది. కానీ, భార‌తీయ జ‌న‌తాపార్టీ ఏరికోరి కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలు అప్ప‌గిస్తోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రంలో అడుగుపెడుతున్న‌పుడే ప‌రిణ‌తిగ‌ల రాజ‌కీయ పార్టీకి నిర్దిష్ట‌మైన అంచ‌నా ఉండాలి. ప్ర‌తికూల శ‌క్తుల ప్ర‌తిఘ‌ట‌న వెనుక అల్లిన వ‌ల‌ల గురించి ఎరుక ఉండి తీరాలి. దారిలో ప‌ల్లేరుగాయ‌లు చూసుకోకుండా పూన‌క‌పు నృత్యాలు చేస్తే…అరిపాదాల‌కు అంటేది నెత్తూరే అనే స్పృహ ఉండ‌టం ష‌ర‌తు క‌దా!

  కార‌ణాలేమైనా ఘ‌ట‌న జ‌రిగిపోయింది. తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి. ప‌ర‌స్ప‌ర రాజ‌కీయ కాట్లాట‌లో ఎవ‌రు ఎవ‌రి ఖాతాలో అయినా మృతుల సంఖ్య‌ను గ‌ణించ‌వ‌చ్చు. అజ‌య్ మిశ్రాపై అమిత్ షా ఆగ్ర‌హంతో ర‌గిలిపోయి ఉండ‌వ‌చ్చు. ఇవేవీ ఉప‌శ‌మ‌నం కింద‌కు రావు. ఓట్ల రాజ‌కీయాల్లో భౌతికంగా ప్ర‌స్ఫుటించే చ‌ర్య‌లే అంతిమ తీర్పును నిర్ధారిస్తాయి. 

  ఉత్తరాది బ్రాహ్మణుల ప్రతినిధిగా భావించి బీజేపీ అజయ్ మిశ్రాను  ఎంచుకుని ఉండవచ్చు. అందుకే కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకుని ఉండవచ్చు. ఓబీసీ అంకగణితంలో జితిన్ ప్రసాదతో పాటు మిశ్రాను చేర్చుకుని  ఉండవచ్చు. అయితే ఉత్తర ప్రదేశ్ లాంటి సంకీర్ణ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలో బీజేపీ వద్ద ఏదైనా పూర్వ నిర్ధారిత నక్షా ఉందా అనే ప్రశ్న తాజా ఘటన నేపథ్యంలో రావడం సహజం.

  దళిత-బ్రాహ్మణ సంయోజనాన్ని సిద్ధం చేసిన మాయావతి, యదుకుల సమీకరణను నమ్ముకున్న అఖిలేష్ యాదవ్, ఆందోళనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట భారతీయ జనతాపార్టీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించగలిగింది? అనే శంక రాకమానదు. 2024 సాధారణ ఎన్నికలు కందకం వలె బీజేపీ ముందు కాచుకు కూర్చున్నాయి.

  అసలు లఖీంపూర్ ఖేరీ ఘటనకు ముందస్తుగా పన్నిన పన్నాగం ఏంటి? బింద్రన్ వాలే టీషర్టులు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అచ్చు వేయించారు? కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తన తనయుడి విషయంలో పక్షపాతాన్ని ప్రదర్శించాడా? కాంగ్రెస్ అత్యుత్సాహం వెనుక వ్యూహమేంటి? మిశ్రా పర్యటన ఖరారు కాగానే కాంగ్రెస్ శ్రేణులు భారీ పథక రచనకు ప్రణాళికలు రచించాయా? యూపీలో యోగీ గ్రాఫ్ నిజంగానే పడిపోతోందా?

  యూపీ ఫలితాలు రాబోయే ఎన్నికలకు నిజంగానే ముందస్తు ఫలితంగా భావించాలా?

  ఇలాంటి కీలక అంశాలకు సంబంధించిన విశ్లేషణ తెలియజేసే ప్రయత్నంచేస్తాను. ….

  ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి నిరసనగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు వ్యతిరేక ప్రదర్శన కోసం కాపుకాశారు. దీన్ని ఎలాగైనా ఛిన్నాభిన్న చేసి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎస్కార్ట్ కు మార్గం సుగమం చేయాలని స్థానిక పోలీసులు భావించారు. ఇక్కడే వివాదం మొదలైంది.

  కేశవ్ ప్రసాద్ మౌర్య కోసం నియమించిన వాహన శ్రేణి…నిరసన తెలుపుతున్న కార్యకర్తలను ఢీకొంటూ ముందుకెళ్లిపోయింది. దీంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. ఆందోళనకారులు కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేయడం వల్లనే కారును ఆపకుండా ముందుకు నడిపినట్లు మరికొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. వీటిలో నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది.

  ఉత్తర ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నిజాలన్నీ అబద్ధాలు అయిపోవు. జరిగిన ఘటనలన్నీ రద్దు కావు. తప్పు ఎవరిదైనా తప్పే. అయితే ఈ పొరపాటు వెనుక జరిగిన కథేంటి? ఎవరు అగ్గిని రాజేశారు? నిప్పు పెట్టిందెవరు?

  ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం పరిస్థితిని మరింత స్తిమితంగా అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి.

  హర్యానా,ఢిల్లీ సరిహద్దులుగా ఉన్న ప్రాంతాల్లో రైతుల నిరసన ఏడాదిగా కొనసాగుతోంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో జాట్ రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఉత్తర ప్రదేశ్ రాజకీయ సంచలనం సృష్టించేందుకు ఒక వేదిక. ఉత్తర ప్రదేశ్ అనేక సంక్లిష్టతలకు నెలవు. కులాలు, ఉప కులాలు, తెగలు, ఉప తెగలు, అగ్రవర్ణాలు, వారి తాబేదార్లు చాలా రకాలుగా విభజించబడిన ప్రాంతం ఉత్తర ప్రదేశ్. పశ్చిమ ప్రాంతమే కాదు, ఉత్తర ప్రాంతాన్ని కూడా రెచ్చగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు యూపీ మధ్య ప్రాంతం కూడా తాజా మృత్యు ఘంటికతో జాగృతమైంది. తూర్పు ప్రాంతాన్ని కూడా రైతుల ఆందోళనలోకి లాగితే…మధ్య ప్రాంతంపై సహజంగానే పట్టువస్తుందని కూడా కాంగ్రెస్ భావించి ఉంటుంది.

  మరోవైపు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ల మధ్య అగాథం పెరిగిందన్న ఊహాగానాల నేపథ్యంలో యూపీ బీజేపీ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. అలాంటి ముందస్తు జాగ్రత్త లఖీంపూర్ ఖేరీ ఘటనలో కనిపించలేదు. మరీ ముఖ్యంగా బరేలీ ప్రాంతంలో  జాట్ సిక్కు జనాభా విస్తారంగా ఉన్న ప్రాంతం…….కాంగ్రెస్ కు పట్టు ఉన్న ప్రాంతం. కేంద్రం చేపట్టిన అనేక పథకాల్లో యూపీలోని నిరుపేదలు ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని సుమారు 9 లక్షల మందికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలు చేకూరుస్తోంది. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం అప్రతిహతంగా సాగుతోంది. ఇలాంటి సందర్భంలో ఏ కార్యక్రమం చేసినా వైరి పక్షం ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తుందో అంచనా ఉండాల్సిన అవసరముంది.

  శాంతి, భద్రతల సమస్యను ఎల్లవేళలా కారణంగా చెప్పలేం. పైగా ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉండటం సహజం. దీన్ని సాకుగా చూపి బలగాలకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం అమోదయోగ్యం కాదు. ఈ ఘటన తర్వాత ఏ మాత్రం నాయకత్వ అర్హతలు లేని రాహుల్ గాంధీని ఉత్తర ప్రదేశ్ పర్యటనకు అంగీకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతకాలం మౌనం పాటించిన ప్రియాంక చీపురుతో ప్రత్యక్షమైంది. ఈ పరిణామాలన్నీ అనుభవ రాహిత్యంతో జరిగినవా…మితిమీరిన ఆత్మవిశ్వాసంతో జరిగినవా…అనేది బీజేపీ స్పష్టం చేయాలి. స్వయంగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం స్పందించక తప్పని స్థితి ఏర్పడటం దేనికి సంకేతం? నిరసనకారులపైకి వాహనాలను తోలడాన్ని ఎవరైనా ఎలా సమర్థించగలరు? అనే సందేహాలు రాకమానవు.

  అదను కోసం చూస్తున్న కాంగ్రెస్ కు అవకాశం కల్పించడం దేనికి అనే ప్రశ్నకు బీజేపీ ఎలాంటి సమాధానమిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఘటన జరగ్గానే అజయ్ మిశ్రాను రాజీనామా కోరడం కన్నా, ఘటనకు కారణమైన నిందితులను సత్వరమే నిర్బంధించి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది.

  తొమ్మిది మంది మరణం మొత్తంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుందా? 2022 ఎన్నికల్లో వెలువడే యూపీ ఫలితాలు దేశ భవితవ్యాన్ని ఖరారు చేస్తాయా…అంటే అంత రూఢీగా అంతిమ ఫలితాన్ని బేరీజు వేయలేం. బీజేపీ ఎలాంటి ప్రతిక్రియలను అనుసరిస్తుంది అనే దాన్ని బట్టి భవిష్యత్తు తేలుతుంది. ఉత్తర ప్రదేశ్ లో బీఎస్పీ బలహీన పడింది. సమాజ్ వాదీ పార్టీ బీజేపీని ఢీకొనే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ ఏనాడో మట్టికొట్టుకుపోయింది. 2007 నాటి యూపీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల బలం పాతాళానికి దిగజారింది. ఇక ఉత్తరాది మైదానంలో యుద్ధం చేయాల్సింది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే! ఇన్ని అనుకూలతలు పెట్టుకుని వైరి నెత్తిన కిరీటం పెట్టేలా బీజేపీ  ఎందుకు వ్యవహరించింది. అనే శంక రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

  యోగి ఆదిత్యానాథ్ మరోమారు ముఖ్యమంత్రి అవుతాడని పండితుల జాతకాలు చెపుతున్నాయి. చిత్రం తారుమారైనా…మాయావతి కమలం పార్టీ వెన్నంటే ఉంటుందనే అంచనాలూ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ రాబోయే ఎన్నికలను కేవలం  ప్రతిపక్ష స్థానం కోసం చేస్తున్న పోరాటంగానే భావించాలంటున్నాయి సర్వేలు. ఇలాంటి కీలక దశలో జరిగిన లఖీంపూర్ ఖేరీ ఘటనను బీజేపీ హైకమాండ్ చాలా తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమిస్తే…వేరును తొలిచే కీటకానికి నత్రజని సరఫరాను నిలిపివేసినట్టు అవుతుంది. లేదంటే….2022లో జరిగే యూపీ  ఎన్నికల్లో ఓటమి దేశవ్యాప్తంగా వేసే రాజకీయ ప్రభావం 2024 ఎన్నికలపై పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త!

  Trending Stories

  Related Stories