కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి అతడు ఉన్న ఫోటోను ట్వీట్ చేయడంతో.. ఆయన చేసిన పోస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రచయిత, వక్త, మేధావిగా పేరొందిన శశి థరూర్ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయ్యుండి, తోటి మహిళా ఎంపీల అందచందాలు, ఆకర్షణీయత గురించి సగటు మగవాడిలా కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. “Who says the Lok Sabha isn’t an attractive place to work?” అంటూ ట్వీట్ చేశాడు. తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇకపై వ్యాఖ్యలను మానుకోవాలని కొందరు ఆయనకు సలహా ఇచ్చారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ఆయన ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి తీసుకున్న సెల్ఫీని శశి థరూర్ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఆకర్షణీయ పని ప్రదేశం కాదని ఎవరు అంటారని ప్రశ్నించారు. దీంతో చాలా మంది ఆయనపై మండిపడ్డారు. ఈ ట్వీట్‌కు జత చేసిన సెల్ఫీలో ఆయనతోపాటు సుప్రియా సూలే (ఎన్‌సీపీ), ప్రెనీత్ కౌర్ (కాంగ్రెస్), తమిళచి తంగపాండ్యన్ (డీఎంకే), మిమి చక్రబర్తి (టీఎంసీ), నుస్రత్ జహాన్ (టీఎంసీ), జోతిమాన్ సెన్నిమలై (కాంగ్రెస్) ఉన్నారు. ఆయన మహిళలపట్ల వివక్షతో వ్యవహరించారని కొందరు ఆరోపించారు. దీంతో శశి థరూర్ వివరణ ఇచ్చారు. మహిళా ఎంపీల చొరవతోనే చాలా సరదాగా ఈ సెల్ఫీ తీసుకున్నట్లు తెలిపారు. ఆ మహిళా ఎంపీలే ఈ ఫొటోను ట్వీట్ చేయాలని తనను కోరినట్లు తెలిపారు. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందుకు సారీ అన్నారు. ఈ వర్క్‌ప్లేస్ స్నేహ ప్రదర్శనలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సెల్ఫీని మిమి చక్రవర్తి తీసినట్లు తెలుస్తోంది. థరూర్ ఇచ్చిన పోస్ట్‌ను ఈ ఎంపీలు కూడా తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.