సింగపూర్ అధికార పార్టీ మాజీ సభ్యుడు, భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం 70.4% ఓట్లతో దేశ అధ్యక్ష రేసులో విజయం సాధించినట్లు ఆ దేశ ఎన్నికల విభాగం ప్రకటించింది. థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ తొమ్మిదవ అధ్యక్షుడు. 2011 తర్వాత ఆ దేశంలో తొలిసారిగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా సంతతి నాయకులైన ఎన్‌జి కోక్ సాంగ్, తాన్ కిన్ లియాన్‌లను ధర్మన్ షణ్ముగరత్నం ఓడించారు. వీరిద్దరికీ కేవలం 15.7 శాతం, 13.88 శాతం ఓట్లు మాత్రమే పొందగలిగారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన థర్మన్ షణ్ముగరత్నంకు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఎన్నికల్లో భాగమైన ఓటర్లకు, పోటీదారులకు చాలా థాంక్స్ అన్నారు. ఇది సింగపూర్ దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని లీ సీన్ లూంగ్ అన్నారు.
ఇక గెలిచిన తర్వాత థర్మన్ షణ్ముగరత్నం మాట్లాడుతూ.. తనకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ వాసులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. ఇది తనకు విజయం మాత్రమే కాదని.. సింగపూర్ భవిష్యత్తు కూడా అని అన్నారు. సింగపూర్ వాసులు తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తానన్నారు. తనకు ఓటు వేయని వారితో సహా సింగపూర్ పౌరులందరినీ గౌరవిస్తానని అన్నారు. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న హలీమా యాకూబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనుంది.
షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా సేవలందించారు. భారత సంతతికి చెందిన షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పలు కీలక పదవుల్లో పనిచేశారు. తాజా ఎన్నికల్లో షణ్ముగరత్నం సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. షణ్ముగరత్నం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఆరేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.
థర్మన్ 1957 ఫిబ్రవరి 25న సింగపూర్ లో ఒక తమిళ వ్యక్తికి, చైనా మహిళకు జన్మించారు. తండ్రి కనకరత్నం షణ్ముగరత్నం ప్రసిద్ధ పాథాలజిస్ట్, క్యాన్సర్ పరిశోధకుడు. తల్లి గృహిణి. ఆయనకు ఆంగ్లం, తమిళం, మలయ్, మాండరిన్ భాషల్లో మంచి పట్టు ఉంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2001లో సింగపూర్ అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ధర్మన్ రాజకీయాల్లోకి వచ్చారు. విద్య, ఆర్థికం, మానవ వనరులు, సామాజిక విధానాలు సహా వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2011లో ఉపప్రధానిగా నియమితులైన ఆయన ప్రధాని లీ సియెన్ లూంగ్ తో కలిసి పనిచేశారు. 2011 నుంచి 2019 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి విధాన నిర్ణాయక సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి 2023 జూలైలో థర్మన్ పీఏపీకి రాజీనామా చేశారు.