More

    నేడే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. భారత్ తుది జట్టు ఇదే..!

    క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేడు ఆరంభం కాబోతోంది. ఫైనల్ లో భారత జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడబోతోంది. సౌతాంఫ్టన్ లోని ఏజీస్ బౌల్ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు సన్నద్ధమయ్యాయి. ఫైనల్ ముందు ఇంగ్లండ్ మీద టెస్ట్ సిరీస్ గెలిచిన ఊపులో న్యూజిలాండ్ ఉండగా.. ఎటువంటి జట్టునైనా ఢీకొట్టగల సత్తా ఉన్న జట్టుగా భారతజట్టు ఉంది. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, లాథమ్, కొత్త ఆటగాడు డెవాన్ కాన్వోయ్ లతో కివీస్ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ వంటి ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారు. ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ కూడా కివీస్ కు ప్లస్ కానున్నాడు.

    ఐపీఎల్ అర్థాంతరంగా నిలిచిపోవడంతో భారత ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీసు లేకుండా పోయింది. ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీసు మ్యాచ్ లు ఆడారు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్, గిల్ పుజారా, రహానే, రిషబ్ పంత్ లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్ఠంగా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ పేస్ బౌలింగ్ అటాక్ తో కివీస్ బ్యాట్స్మెన్ కు చిక్కులు తప్పవు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, జడేజా ఎలాగూ కివీస్ ను టెన్షన్ పెట్టొచ్చు.

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడే భారత తుది జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే వ్యవహరిస్తారు. రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ జోడీ ఇన్నింగ్స్ ఆరంభించనుంది. నయా వాల్ పుజారా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని భారత అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. రిషబ్ పంత్ కు తుది జట్టులో స్థానం దక్కింది. టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది. బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ పేస్ బౌలర్లు కాగా.. అశ్విన్, జడేజా స్పిన్ సేవలు అందించనున్నారు.

    Image

    ఇక ఫైనల్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. సౌతాంప్టన్‌లో డబ్ల్యుటిసి ఫైనల్ మొదటి రోజు వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. మొదటిరోజు మ్యాచ్ కు అంతరాయం కలిగించే అవకాశం లేకపోలేదు. శుక్రవారం తెల్లవారుజాము నుండి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. “సౌతాంప్టన్‌లో శుక్రవారం ఉదయం 6 నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని” అని యుకె వాతావరణ విభాగం ప్రతినిధి తెలిపారు. ఉరుములు, చల్లటి గాలులు ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌ పై ప్రభావం చూపే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన వర్షం మ్యాచ్ లో అనేక సెషన్లకు భంగం కలిగిస్తుంది. ముఖ్యంగా మొదటి నాలుగు క్రికెట్ రోజులలో ఒక్క రోజు పూర్తిగా వాష్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ కోసం ఒక అదనపు రోజు కేటాయించినా.. అది సరిపోకపోవచ్చని అంటున్నారు.

    Trending Stories

    Related Stories