More

    మరోసారి వలస కూలీలపై దాడులు చేసిన తీవ్రవాదులు

    జమ్మూ కశ్మీర్‌లో వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలసకూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రఖ్-మోమిన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత రఖ్-మోమిన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పది రోజుల కిందట ఇదే జిల్లాలో ఇద్దరు వలసకూలీలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తాజా ఘటనలో గాయపడిన ఇద్దరిలో ఒకరిది బిహార్.. ఇంకొకరిది నేపాల్‌గా గుర్తించారు. ప్రసాద్, గోవింద్ అనే ఈ ఇద్దరూ బొందియాల్‌గామ్‌లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారని అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌లో స్థానికేతరుల రాక పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు.. ఉపాధి కోసం వచ్చిన స్థానికేతరులపై ఈ చర్యలకు పాల్పడుతున్నారు.

    Trending Stories

    Related Stories