పాక్ ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి: ఐరాసలో భారత్ వార్నింగ్

0
1039

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ కు భారత్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ‘దౌత్య విధానాల ద్వారా అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణ’ అనే అంశంపై చర్చ సందర్భంగా భారత్ తరపున ఐరాసలో భారత శాశ్వత కౌన్సిలర్, న్యాయ సలహాదారు డాక్టర్ కాజల్ భట్ చర్చలో పాల్గొన్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ వెంటనే కశ్మీర్ లో ఆక్రమించిన ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లాలని గట్టి వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఐరాస వేదికలను పాక్ దుర్వినియోగపరుస్తోందని విమర్శించారు. భారతదేశంపై అబద్ధపు ప్రచారాన్ని పాకిస్తాన్ ఆపాలని కోరారు.

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు రాజభోగాలు అనుభవిస్తున్నారు.. వారికి పాక్ మద్దతు ఇస్తోందని చరిత్ర చెబుతూనే ఉంది. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిచే నిషేధించబడిన మిలిటెంట్లలో అత్యధికమందికి ఆతిథ్యమిచ్చిన అవమానకరమైన రికార్డు పాక్ సొంతమని ఆమె చెప్పుకొచ్చారు. ఈరోజు ముందు పాకిస్తాన్ ప్రతినిధి చేసిన కొన్ని పనికిమాలిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించడానికి నేను మరోసారి ప్రసంగించవలసి వచ్చిందని ఆమె పాక్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ వారికి శిక్షణనిస్తోందన్న విషయం బహిరంగ వాస్తవమని, ప్రపంచం మొత్తానికీ అది తెలుసని అన్నారు. పాక్ సహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటుందని.. అయితే, సీమాంతర ఉగ్రవాదంపై అంతే కటువుగా ఉంటామని తేల్చి చెప్పారు. పాక్ లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని, దాని నుంచి దృష్టి మరల్చేందుకే భారత్ పై ఆ దేశం విషం కక్కుతోందని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లోని భూభాగమేనని కాజల్ భట్ తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ముందు ఖాళీ చేయాలని, ఆ దేశం ఆక్రమించిన కశ్మీర్ లోని అన్ని ప్రాంతాలనూ వదిలి వెళ్లాలని హెచ్చరించారు. పాక్ తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలోనే జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు. “నా దేశంపై తప్పుడు మరియు దురుద్దేశపూరితమైన ప్రచారాలను ప్రచారం చేయడానికి ఐరాస వేదికలను దుర్వినియోగం చేయడం పాక్ కు కొత్తేమీ కాదు.. తమ దేశంలోని విచారకరమైన స్థితి నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి పాక్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. సాధారణ ప్రజల జీవితాలు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారి జీవితాలు ఆ దేశంలో తలకిందులయ్యాయి” అని కాజల్ అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కాజల్ భట్ తన ప్రసంగంలో పాక్ ను తూర్పారబట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం వంటి చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని ఐరాస సభ్య దేశాలకు తెలుసునని తెలిపింది. తీవ్రవాదులకు ఆయుధాలను అందజేసే దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని ఆమె అన్నారు. జమ్మూ మరియు కాశ్మీర్, లడఖ్ లు భారతదేశం యొక్క అంతర్భాగంగా మరియు విడదీయరాని భాగమని అన్నారు. ఇందులో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. ఆక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చారు.