జమ్మూ కశ్మీర్ లో పోలీసుల బస్సుపై విరుచుకుపడ్డ తీవ్రవాదులు

0
775

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు శ్రీనగర్ శివార్లలోని జెవాన్ ప్రాంతంలో ఓ పోలీస్ బస్సుపై భారీగా కాల్పులకు తెగబడ్డారు. పోలీస్ శిబిరానికి సమీపంలోని పంతా చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న సాయుధ బలగాలు వెంటనే ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉందని, పాక్ ఉగ్రవాదుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘కశ్మీర్ టైగర్స్’ అనే ఉగ్రవాద సంస్థ పేరు కూడా తెరపైకి వచ్చింది, అయితే ఇది బూటకమని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేస్తూ, “శ్రీనగర్‌లోని పంథా చౌక్ ప్రాంతంలోని జెవాన్ సమీపంలో పోలీసు వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బంది అందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది” అని చెప్పుకొచ్చారు. “శ్రీనగర్ టెర్రర్ అటాక్: గాయపడిన పోలీసు సిబ్బందిలో, ఒక ఏఎస్ఐ ఒక సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ వీరమరణం పొందారు.” అని మరో ట్వీట్ లో చెప్పుకొచ్చారు.

ఉగ్రవాదులందరినీ పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, గాయపడిన పోలీసు సిబ్బందిని ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. దాడి తర్వాత సీఆర్‌పీఎఫ్ స్క్వాడ్, జమ్మూ కశ్మీర్ పోలీసు సీనియర్ అధికారులను జెవాన్‌ ప్రాంతానికి పంపారు. ఉగ్రదాడిలో అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. దాడికి సంబంధించిన వివరాలను కూడా పీఎం కోరినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.

కొన్నిరోజుల కిందట కూడా ఇదే తరహాలో ఓ పోలీస్ బస్సుపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. డిసెంబరు 10న బందిపొరా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఇటీవల కశ్మీర్ లోయలో వలస కూలీలపై జరిగిన దాడుల తర్వాత ఉగ్రవాదులు పోలీస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది.