జమ్ముకశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. గుంద్‌జహంగిర్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని ఇంతియాజ్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తరపున పని చేస్తున్నాడు. బందిపొరాలోని షాగుండ్‌లో ఇటీవల జరిగిన పౌరుల హత్యలో దార్ ప్రమేయం ఉందని భావిస్తోంది. తీవ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లాలోని వెరినాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ముష్కరుల కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
ఇక జమ్ముకశ్మీర్‌లో ఎన్‌ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 16చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. వాయిస్ ఆఫ్ హింద్ ప్రింటింగ్ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఐఈడీల రికవరీకి సంబంధించి ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్, అనంతనాగ్, కుల్గామ్, బారాముల్లాలోని 9 ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. హసన్ రోడ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్ అయిన నయీమ్ అహ్మద్ భట్, నంద్ సింగ్ చత్తబాల్‌లోని మస్తాక్ అహ్మద్ దార్ ఇంటిపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్క శ్రీనగర్‌లోనే 70 మంది యువకులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కశ్మీర్‌వ్యాప్తంగా మొత్తం 570 మందిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు సైతం.. రాళ్ల దాడులకు పాల్పడినవారు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేంద్రం ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నతాధికారిని ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల సమన్వయానికి శ్రీనగర్‌కు పంపింది. స్థానికంగా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం అనంతనాగ్, శ్రీనగర్, కుల్గాం, బారాముల్లా తదితర 16 చోట్ల దాడులు ప్రారంభించింది. వాయిస్ ఆఫ్ హింద్, ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్‌ఎఫ్) కేసుల దర్యాప్తులో భాగంగా ఈ సంస్థ సభ్యుల ఇళ్లపై దాడులు చేపడుతోంది.