More

    కశ్మీర్‎లో ఉగ్రవాది అరెస్ట్.. అతని వద్ద ఏం దొరికాయో తెలుసా..?

    జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. అతని దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

    అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో భద్రతను పెంచారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి దోడా పట్టణం శివార్లలోని చెక్‌ పాయిట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేయగా.. ఒక వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని దోడాలోని కోటి గ్రామానికి చెందిన ఫరీద్ అహ్మద్‌గా గుర్తించారు. ఫరీద్‌ దగ్గర నుంచి ఒక చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

    మార్చి నెలలో అహ్మద్‌కు ఓ వ్యక్తి నుంచి ఇవి అందాయని, దోడాలోని పోలీసు సిబ్బందిపై దాడి చేసేందుకు అతడికి పని అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. అయితే సకాలంలో ఆ కుట్రను తెలుసుకుని భగ్నం చేశామన్నారు. దీనిపై ప్రత్యేక బృందం విచారణ చేస్తోందని పోలీసులు తెలిపారు. కశ్మీర్‌లోయ దోడాలో ఉగ్రవాద సంస్థల కోసం అతను పని చేస్తున్నట్టు చెప్పారు. నిందితుడు పోలీసు సిబ్బందిపై దాడి చేసేందుకు సిద్ధమయ్యాడని అతనిపై దోడా పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

    Related Stories