రంజాన్ వేళ రాజస్థాన్ లో మత ఘర్షణలు

0
729

రంజాన్ పండుగ వేళ రాజస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అల్లర్లు చెలరేగాయి. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. జోధ్‌పుర్‌లో ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపివేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవంటున్నారు.

పండుగ సందర్భంగా జోధ్‌పుర్‌లోని జలోరీ గేట్‌ వద్ద పరిస్థితి చేయి దాటిపోయింది. జెండాలను ఏర్పాటు చేసే క్రమంలో సోమవారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఇందులో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోలీసులపైకి కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఖాకీలకు సైతం గాయాలు అయ్యాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు ఉపయోగించారు. అప్రమత్తమైన పోలీసులు..బలగాలను భారీగా మోహరించారు. రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఇంటర్‌నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

పోలీసుల భారీ బందోబస్తు నడుమ ముస్లింలు పండుగ చేసుకుంటున్నారు. ప్రార్థనల సమయంలోనూ నిఘా ఉంచారు. మరోవైపు ఘర్షణపై రాజస్థాన్‌ సీఎం ఆరా తీశారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ అలర్ట్ చేశాయి. రంజాన్ వేళ భద్రతను కట్టుదిట్టం చేశారు.

మధ్యప్రదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో ఖర్గోన్ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఢిల్లీలోని జహంగీర్‌పుర్‌లోనూ నిఘా రెట్టింపు చేశారు. ఇటు హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా భద్రతను ఉంచారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here