More

    హామీలను నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ ఎలా వస్తారో చూస్తాం: బీజేపీ

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా జిల్లాకు వస్తున్న కేసీఆర్ ను అడ్డుకుని తీరుతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఆగస్టు 14న వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అనంతరం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తాండూరులో మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఆ తర్వాత పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరుకు కేటాయించిన మెడికల్ కాలేజ్ వికారాబాద్ కు కేటాయించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. హామీని నిలబెట్టుకోలేక పోయిన సీఎంను తాండూరు ప్రజలు అడ్డుకోవాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఆగస్టు 14 నుండి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17న మేడ్చల్-మల్కాజిగిరిలో ఆ తర్వాత వరుసగా మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులు ఈ నెల 20న మునుగోడులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

    Related Stories