చంద్రగ్రహణం కారణంగా దాదాపు 11 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని టిటిడి అధికారులు మూసి వేయనున్నారు. మంగళవారం ఉదయం 8:41 గంటలకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు అధికారులు ఆలయ తలుపులను మూసి వేశారు. ఇవాళ మధ్యాహ్నం 2:39 గంటల నుండి సాయంత్రం 6:27 గంటల వరకూ చంద్రగ్రహణం గ్రహణం ఉంటుంది. దీంతో 11 గంటల ముందే అంటే ఉదయం 8:41 గంటలకే శ్రీవారి ఆలయాన్నిటిటిడి మూసి వేసింది. తిరిగి రాత్రి 7:30 గంటలకు శ్రీవారి ఆలయంను తెరిచి, ఆలయ శుద్ది చేపట్టిన అనంతరం పుణ్య వచనం చేసి రాత్రి కైంకర్యాలు సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి వద్ద పంచాంగ శ్రవణం నిర్వహించిన తర్వాత భక్తులను స్వామి వారి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ఇక చంద్ర గ్రహణం కారణంగా విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.