More

  కెనడాలో నెలలో మూడోసారి.. విదేశాల్లో హిందూ దేవాలయాలపై వరుస దాడులు..!

  భారత్ లోనే కాదు.. విదేశాల్లోనూ హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. హిందూ మతం లక్ష్యంగా కొన్ని దుష్ట శక్తులు దాడులకు పాల్పడుతున్నాయి. అలాగే కెన‌డాలో దుండగులు వరుసగా హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారు. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో ఆందోళన తలెత్తుతోంది. తాజాగా, బ్రాంప్టన్ పట్టణంలోని గౌరీ శంక‌ర్ దేవాలయంలో దుండ‌గులు భార‌త వ్యతిరేక రాత‌లు రాశారు. ఆల‌యంపై జరిగిన దాడిని టొరొంటోని భార‌త కాన్సులేట్ జ‌న‌ర‌ల్ ఖండించారు. గ‌తేడాది జులై నుంచి ఇప్పటి వ‌ర‌కు కెన‌డాలో మూడు సార్లు హిందూ మందిరాల‌పై దాడులు జ‌రిగాయి. గ‌త ఏడాది సెప్టెంబ‌రులో భార‌త విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

  మందిరంపై దుండ‌గులు పాల్పడ్డ ద్వేష‌పూరిత చ‌ర్యతో కెన‌డాలోని భార‌తీయుల మ‌నోభావాలు దెబ్బతిన్నాయని.. ఈ విష‌యాన్ని కెన‌డా అధికారుల వ‌ద్ద లేవ‌నెత్తామని అక్కడి భార‌త దౌత్య కార్యాల‌యం ప్రకటించింది. భార‌తీయ వార‌స‌త్వానికి ప్రతీకగా ఉన్న మందిరంపై దాడికి పాల్పడి, ద్వేష‌పూరిత రాత‌లు రాయ‌డంపై కెన‌డా అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు. కెన‌డాలో భార‌తీయుల‌పై నేర‌పూరిత చ‌ర్యలు, భార‌త వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయ‌ని, స‌రైన విచార‌ణ జ‌ర‌పాల‌ని చెప్పింది. కెన‌డాలో కొంత కాలంగా హిందూ మ‌తాన్ని ల‌క్ష్యంగా చేసుకుని దాడులు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు విప‌రీతంగా పెరిగాయి.

  కెనడా ప్రభుత్వం అధికారిక గణాంకాల ప్రకారం.. 2019, 2021 మధ్య కెనడాలో మతం, లైంగిక ధోరణి, జాతికి సంబంధించిన ద్వేషపూరిత నేరాలు 72 శాతం పెరిగాయి. ఇది మైనారిటీ వర్గాల్లో ముఖ్యంగా భారతీయ సమాజంలో భయాన్ని పెంచింది. కెనడాతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కూడా హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతుండడంతో భారతీయ సమాజం మండిపడుతోంది.

  మరోవైపు ఆస్ట్రేలియాలో స్వల్ప వ్యవధిలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. జనవరి నెల మొదట్లో మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ్‌ ఆలయం, విక్టోరియా కర్రమ్‌ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయం, మెల్‌బోర్న్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌పై దాడుదలు జరిగాయి. ఆలయాల గోడలపై భారత్‌కు, హిందు మతానికి వ్యతిరేకంగా రాతలను రాశారు. ఈ నేపథ్యంలో ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోలేకపోవడంపై.. భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది.

  హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, సంఘవిద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకరంగా ఉందని.. ఈ దాడులను ముమ్మాటికీ కఠినంగా శిక్షించదగినదని సదరు ప్రకటనలో భారత హై కమిషన్‌ చెప్పింది. అంతేకాదు ఈ చర్య.. ఇండో-ఆస్ట్రేలియన్‌ కమ్యూనిటీల మధ్య విద్వేషం రగిల్చేలా ఉందని వెల్లడించింది. ఖలీస్థానీ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయని, సిక్క్స్‌ ఫర్‌ జస్టిస్‌ లాంటి నిషేధిత ఉగ్ర సంస్థలు, ఇతర విద్వేషపూరిత సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతున్నాయని అక్కడి ప్రభుత్వాన్ని భారత్‌ వారించింది.

  ఇప్పటికే ఆలస్యం అయ్యిందన్న కోణంలో.. దాడికి పాల్పడినవాళ్లను గుర్తించి, తగ్గ కఠిన శిక్షలు విధించాలని.. తద్వారా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే ఆకాంక్ష భారత హై కమిషన్‌ వెలువరించింది. ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్‌ ఈ వ్యవహారంపై బదులిచ్చింది. ప్రస్తుతం విషయం దర్యాప్తులో ఉందని వెల్లడించింది. భారత్‌లాగే.. ఆస్ట్రేలియా కూడా బహుళ సంప్రదయాల దేశమని, హిందూ ఆలయాల విధ్వంసం తమనూ దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్‌ బ్యారీ ఓఫారెల్‌ ట్వీట్‌ చేశారు.

  Trending Stories

  Related Stories