ఆలయంలో ఆభరణాలు దొంగిలించడానికి ప్రయత్నించిన ఓ దొంగ కిటికీలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. దీంతో అతడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జూడుపూడి గ్రామానికి చెందిన ఈసురు పాపారావు సోమవారం రాత్రి స్థానిక జామి ఎల్లమ్మ దేవాలయం కిటికీని పగులగొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించాడు. విగ్రహం నుండి ఆభరణాలను కొట్టేసిన తర్వాత, అతను అదే కిటికీ ద్వారా తిరిగి బయటకు రావడానికి ప్రయత్నించాడు.. అయితే అడ్డంగా ఇరుక్కుపోయాడు. ముందుకు లేదా వెనుకకు కదలలేక చిక్కుకున్నాడు. అటుగా వచ్చిన కొందరు స్థానికులు ఇతని కష్టాలను గమనించారు. అతను బయటకు రావడానికి వారి సహాయం కోరాడు. అతని చేతిలో నుండి పడిపోయిన బంగారు ఆభరణాలను చూసి, వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని బయటకు తీసుకుని వచ్చి పోలీసులకు అప్పగించారు.
ఆలయంలో చోరీకి వచ్చిన దొంగ కిటికీ రంధ్రంలో ఇరుక్కుపోయి.. ముందుకు రాలేక, వెనక్కిపోలేక దిక్కుతోచని స్థితిలో స్థానికులకు పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతని అరుపులు విన్న స్థానికులు సహాయం చేయడం కోసం వచ్చారు. కొందరు అతనికి నీరు కూడా అందించారు. ఈ ఘటన ఏప్రిల్ 5వ తేదీన చోటు చేసుకుంది.