గత ఆరేళ్ల లెక్కలను బట్టి 2016 – 2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021 – 2022 ముగిసేసరికి అప్పు 2.86 లక్షల కోట్లకు చేరనుంది. రాష్ట్రంపై అక్షరాల ఆరేళ్లలో లక్ష 57 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది. మొత్తానికి ఇరు రాష్ట్రాలు అప్పుల సేకరణలో పోటీ పడుతున్నట్లుగా తాజా లెక్కలతో తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కంటే అప్పుల్లో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అంచనాలకు మించి అప్పులు చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇటు తెలంగాణ రాష్ట్రం ప్రజలపై పెనుభారం మోపుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వంద రూపాయలలో 45 రూపాయలు అప్పు అని కాగ్ ఇటీవల లెక్కలు విడుదల చేయగా, ప్రజల కోసం అప్పులు చేస్తున్నామని అధికార పక్ష నేతలు సెలవిస్తున్నారు. ఇక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా వేరు పడిన తెలంగాణా రాష్ట్రంలోనూ అప్పుల చిట్టా పెరగటం ఆందోళన కలిగిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి పై ఇప్పటివరకు ఉన్న అప్పు ఒకింత షాక్ కు గురి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పద్దు రోజురోజుకు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ నిర్వహణ చట్టం పరిమితులకు లోబడి ప్రభుత్వం ఏటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్ ను మించిపోయాయి అంటే ఎంతగా అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది 2.30 లక్షల కోట్ల బడ్జెట్ కాగా, మొత్తం అప్పులు 2.86 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో నలభై ఒక్క వేల కోట్లు అప్పు పెరగనున్నట్లుగా తాజా ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2.44 లక్షల కోట్లను బహిరంగ మార్కెట్లో సేకరించింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుండి 7852 కోట్ల రూపాయలు, స్వయం ప్రతిపత్తి ఉన్న ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో 19,552 కోట్లు రుణాలను సమీకరణ చేసినట్లు బడ్జెట్ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాకు, రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తి పై 81,395 రూపాయలు అప్పు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక గత ఏడాది తలసరి అప్పు 65, 480 రూపాయలు. ప్రస్తుతం మరో 16వేలకు పైగా పెరిగి 81,395 రూపాయలు తలసరి అప్పు చేరుకుంది. రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రజల కోసమే అప్పులు చేస్తున్నట్టు తెలంగాణా ప్రభుత్వం సైతం చెప్పుకోవటం కనిపిస్తుంది. ఇక ఈ ఏడాది అప్పు పెరగటానికి కరోనా కారణంగా ఇరు రాష్ట్రాలు చెప్తున్నాయి .
గత ఆరేళ్ల లెక్కలను బట్టి 2016 – 2017 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021 – 2022 ముగిసేసరికి అప్పు 2.86 లక్షల కోట్లకు చేరనుంది. రాష్ట్రంపై అక్షరాల ఆరేళ్లలో లక్ష 57 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది. మొత్తానికి ఇరు రాష్ట్రాలు అప్పుల సేకరణలో పోటీ పడుతున్నట్లుగా తాజా లెక్కలతో తెలుస్తుంది.
ఇదే విషయమై విపక్షాలు అటు విపక్షాలు తెరాస ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాయి. భాజపా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావు అయితే ఆధారాలతో సహా ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో లోపాలను ఎత్తి చూపించారు. బడ్జెట్ లో అంకెలు చూస్తే అబ్బో అనిపించేలా ఉన్నాయని.. ఆచరణలో మాత్రం అబ్బే అన్నట్లున్నయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసేస్తున్నారని.. ప్రజలపై ఆ భారం మోపుతున్నారని తెలిపారు.