తెలుగు విద్యార్థిని శ్వేతారెడ్డి అమెరికా విద్యాసంస్థలో రూ.2 కోట్ల స్కాలర్ షిప్ ను అందుకుంది. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో భాగంగా అడ్మిషన్ పొందింది. ఆమెరికాలోని లాఫాయేట్ కళాశాల 17 ఏళ్ల శ్వేతారెడ్డికి ఈ ఆఫర్ ఇచ్చింది. లాఫాయేట్ కళాశాల అత్యుత్తమ విద్యానైపుణ్యాలు ప్రదర్శించే వారికి ప్రతి ఏటా డైయర్ ఫెలోషిప్ పేరిట ఉపకారవేతనం అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఆరుగురు విద్యార్థులను డైయర్ ఫెలోషిప్ కు ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన శ్వేతారెడ్డి ఉన్నారు. తాను లాఫాయేట్ కాలేజీ స్కాలర్ షిప్ కు ఎంపిక కావడం పట్ల శ్వేతారెడ్డి ఆనందం వ్యక్తం చేస్తోంది. డెక్స్ టెరిటీ గ్లోబల్ సంస్థలో శిక్షణ తీసుకున్నానని.. అందుకే తాను స్కాలర్ షిప్ పొందగలిగానని వెల్లడించింది. ఈ అద్భుత అవకాశం రావడం వెనుక నాలుగేళ్ళ కృషి ఉందని.. శిక్షణ తీసుకునే సమయంలో నాయకత్వ పటిమతో పాటు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలిగానని శ్వేత తెలిపింది.
లాఫాయేట్ కాలేజీ కూడా దీనిపై స్పందిస్తూ, శ్వేతారెడ్డి ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపింది. హైస్కూల్ స్థాయిలో శ్వేతారెడ్డి కనబరిచిన ప్రతిభ, నాయకత్వ లక్షణాలు తమను మెప్పించాయని సదరు కాలేజీ యాజమాన్యం తెలిపింది. కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ(మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది.
శ్వేతకు స్కాలర్‌షిప్ రావడం పట్ల కోచింగ్ ఇచ్చిన డెక్స్ టెరిటీ గ్లోబల్ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. రాబోయే తరాల నాయకులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని డెక్స్ టెరిటీ గ్లోబల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కెరీర్‌కు సంబంధించి తన సంస్థ ఇచ్చిన ట్రెయినింగ్‌తో ఎంతో మంది కొలంబియా, యేల్ యూనివర్శిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేస్ వెస్టర్న్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, బోస్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, తదితర ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారు.