తెలుగు అకాడమీకి చెందిన రూ.324 కోట్లు కొట్టేయాలని ప్లాన్

తెలుగు అకాడమీ డిపాజిట్ కేసుకు సంబంధించి చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను ఈరోజు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ స్కామ్‌లో అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది. బుధవారం ఒక్కరోజే సీసీఎస్ పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. బుధవారం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను మీడియాకు వివరించారు. ఈ స్కామ్‌లో ఏ1 మస్తాన్ వలీ, ఏ2 సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, ఏ3 సత్యనారాయణ, ఏ4 పద్మావతి, ఏ5 మోహినుద్ధిన్, ఏ6 వెంకట సాయి, ఏ7 నండూరి వెంకట్, ఏ8 వెంకటేశ్వరరావు, ఏ9 రమేష్, ఏ10 సాధన ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ముఠా గతంలోనూ పలు కుంభకోణాలకు పాల్పడిందని.. ఈ స్కామ్‌లో యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు నొక్కేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు డబ్బులను లాగేయడం చేశారని గుర్తించారు. డిసెంబర్‌కల్లా అకాడమీకి చెందిన రూ.324 కోట్లు కొట్టేయాలని ప్లాన్ వేసినట్లు తెలిపారు.
ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ వలీతో పాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా మస్తాన్ వలీకి 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. మరో ముగ్గురి కస్టడీ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేసింది.