More

    తెలుగు రాష్ట్రాల విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై.. విమర్శలు ఎక్కుపెట్టిన తెలంగాణ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు

    ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని విమర్శించారు. అవతలివాళ్లకు అపఖ్యాతి ఆపాదించడం, దేశంలో అస్థిరత నెలకొల్పడం, మంచిని తొలగిండం అనే మూడు విధానాలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహాలని మోదీ మండిపడ్డారు. తెలంగాణను తామే ఏర్పాటు చేశామని కాంగ్రెస్ క్రెడిట్ తీసుకున్నా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించలేదని, ఎన్నికల్లో ఓడగొట్టారని లోక్ సభ ప్రసంగంలో చెప్పారు ప్రధాని మోదీ. అధికారం అనే మత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా, తెలంగాణ మధ్య చిచ్చులు పెట్టిందని ప్రధాని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారని, కనీసం చర్చ కూడా జరగకుండా విభజన బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందని, దాని పర్యవసానాల వల్ల ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని మోదీ అన్నారు. తాను తెలంగాణ వ్యతిరేకి కాదన్న మోదీ.. ఏపీ విభజన మాత్రం సరైన పద్దతిలో జరగలేదన్నారు.

    ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్-బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. మోదీ వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ మోసం చేశారని.. బీజేపీ సీనియర్లను మోసం చేసి మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అంటూ తెలంగాణలో బీజేపీ ప్రచారం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన వాజ్ పేయి, తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అప్పట్లోనే తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది ప్రాణాలు పోయేవి కాదని చెప్పారు.

    తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావో చెప్పు అని వ్యాఖ్యానించారు. బాధ్యతతో ఉండాల్సిన ప్రధాని, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఇప్పుడాయన డ్రామాలు ప్రారంభించారని.. హైదరాబాదులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోదీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ధార్మిక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే మాట్లాడారని, తెలంగాణ అంటే మోదీకి ఎంత కక్ష ఉందో ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని తలసాని అన్నారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర సర్కారు నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తే సరిపోతుందని, అయినా ప్రధాని పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.

    మోదీ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు ఖండించారు. రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోందని చెప్పారు. రాష్ట్రంపై ఉన్న అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. తెలంగాణ వచ్చిందని మనం ఆనందంగా ఉంటే మోదీ మాత్రం బాధగా ఉన్నట్టున్నారని చెప్పారు.

    Trending Stories

    Related Stories