8వ తేదీ నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు.. లాక్ డౌన్ ప్రచారంపై క్లారిటీ

0
710

తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్‌ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి, కరోనా పరిస్థితులు, టీకా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. 16 తర్వాత వైరస్‌ పరిస్థితులను బట్టి సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారులు రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా ఉండరాదని, కోవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా కరోనా నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి లాక్ డౌన్ అవసరం ప్రస్తుతం లేదని వారు సీఎం కు నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. “ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో అజాగ్రత్త పనికిరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని చేసే దగ్గర అప్రమత్తంగా ఉంటూ మాస్క్ లు ధరించాలని, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని” అన్నారు.

తెలంగాణలో లాక్ డౌన్ గురించి వస్తున్న వార్తలపై ఆరోగ్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ఆరోగ్యశాఖ పూర్తి సిద్ధంగా ఉందన్నారు హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఉండబోవని ఇప్పటి వరకే చెప్పామని.. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నామని అన్నారు. జనవరి చివరలో లాక్‌డౌన్ ఉండొచ్చునని తాను చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.