కృష్ణా వాటర్ వార్… పంపకాల్లో కుదరని సయోధ్య

0
884

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు జరపాలని తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తోసి పుచ్చింది.

66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల ప్రతిపాదనను తెలంగాణ ముందుకు తీసుకొని రాగా అందుకు ఒప్పుకోలేదు. రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది తెలంగాణ. 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల పంపిణీలో భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలన్న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కోరారు. తెలుగు రాష్ట్రాలకు నీటి వాటా, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించడం, నిధుల కేటాయింపు, ఆర్డీఎస్‌పై చర్చలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు తదితర కీలకాంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్‌ ఎర్రమంజిల్ జలసౌధ వేదికగా సమావేశం నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి, వరద సమయంలో వినియోగించిన నీటి వివరాలు, తదితర అంశాలపై కూడా చర్చలు జరిపారు.

శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలకు మించి తీసుకోరాదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. దురదృష్టవశాత్తు కొత్త రాష్ట్రమైన తెలంగాణకు నీటి కేటాయింపుల అంశాన్ని ఇంకా ట్రైబ్యునల్‌కు నివేదించడం లేదని అన్నారు. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తి ఒక్క ఏడాదికే అని గత సంవత్సరం అంగీకరించామన్న ఆయన… కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెరిసగం వాటా ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నదే విద్యుత్ ఉత్పత్తి కోసమన్న రజత్​కుమార్.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అభ్యంతరం కరెక్ట్ కాదని అన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నప్పటికీ… తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రావాల్సిన నీరు ఇవ్వడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎంపీ సింగ్ అధ్యక్షతన కొనసాగిన ఈ బోర్డు భేటీలో కార్యదర్శి రాయిపురే, సభ్యులు మౌంతాంగ్, ఆర్కే పిళ్లై, తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × 5 =