పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. సినిమాలో పోలీస్‌గా నటిస్తున్న పవన్ కళ్యాణ్ పాత్ర గురించి వివరించారు. ‘సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్‌గా విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది. ఈ పాటకు థమన్ సంగీతం సమకూర్చగా.. తెలంగాణ కళాకారుడు ‘కిన్నెర మొగులయ్య’ ఈ పాట ఆరంభాన్ని ఆలపించారు.
ఆ పాటపై ఓ ఐపీఎస్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పాటలోని సాహిత్యాన్ని తప్పుబట్టారు. ‘మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం’ అని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం పాటిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేశ్ భీమ్లా నాయక్ పాట విన్న అనంతరం ఓ ట్వీట్ చేశారు. ప్రజల రక్షణార్థం జీతాలు పొందుతున్న మేం ప్రజల బొక్కలు విరగ్గొట్టం అని స్పష్టం చేశారు. అనంతరం ప్రముఖ రచయిత రామజోగయ్యశాస్త్రి రాసిన సాహిత్యంపై స్పందిస్తూ ‘పోలీస్ పాత్రను వర్ణించేందుకు తెలుగులో ఇంతకన్నా గొప్ప పదాలు దొరకలేదంటే ఆశ్చర్యమేస్తోంది’ అని ఐపీఎస్ అధికారి రమేశ్ తెలిపారు. ‘పోలీసుల సేవలను పాటలో ఎక్కడా ప్రస్తావించలేదు’ అని ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు. తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టం. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.’’ అంటూ రమేష్ ట్వీట్ చేశారు.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా క్రేజీ కాంబోలో త్రివిక్రమ్ రచనా సారథ్యంలో సాగర్ చంద్ర డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బీజుమేనన్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్.. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రను రానా పోషిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్, నిత్యామేనన్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.