తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో మూడు ఓమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కెన్యా, సోమాలియా దేశాల నుండి వచ్చిన ఇద్దరూ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత వారి నమూనాలను సీసీఎంబీకి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కోసం పంపారు. ఈ పరీక్షల్లో వారికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు బయటపడిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఓమిక్రాన్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఓమిక్రాన్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. కెన్యా పౌరురాలి వయసు 24 ఏళ్లు కాగా, సోమాలియా పౌరుడి వయస్సు 23 ఏళ్లు అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపించామని, మంగళవారం రాత్రి ఫలితాలు వచ్చాయన్నారు. వారిద్దరికి ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. మూడో వ్యక్తికి కూడా ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. అయితే అతడి వయసు ఏడేళ్లు కావడం గమనార్హం. అయితే పశ్చిమ బెంగాల్‌కు చెందిన సదరు బాలుడు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగి నేరుగా కోల్‌కతా వెళ్లాడని అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఓమిక్రాన్ కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వేరే దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ గా తేలిందని ఆయన చెప్పారు. నిన్న రాత్రి ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు. పాజిటివ్ వచ్చిన తలీబ్ ఇక్రాన్ అనే మహిళను వెంటనే టిమ్స్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు. 23 ఏళ్ల అబ్దుల్లా అహ్మద్ అనే యువకుడి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో ఉన్నామని, ఇటు వైద్యశాఖ అధికారులు, అటు పోలీసులు అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నారని హరీశ్ వెల్లడించారు. ఓమిక్రాన్ కేసులను చూస్తే వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని.. అయితే, వ్యాధి వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉందని వివరించారు. బ్రిటన్ లో రెండు మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.