తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, అలాగే వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానాల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాలకు మార్చి 14వ తేదీ ఆదివారం పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు అందరూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు చివరి ప్రయత్నాలు అమలు చేస్తున్నారు.
సోషల్ మీడియాతోపాటు ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించి ప్రత్యేక యాప్ లు సైతం అందుబాటులోకి రావడంతో వారి వారి ఫోన్ నంబర్లను ఇప్పటికే సేకరించిన అభ్యర్థులు నేరుగా వారితోనే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు కలిగి…, ఓటర్లను మోటివెట్ చేసి… పోలింగ్ బూత్ ల వరకు తీసుకువెళ్లే నాయకులపైనే వీరు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడు లేనివిధంగా ప్రధాన పార్టీలతో సమానంగా … ఈసారి పలువురు స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరాహోరీగా
సాగించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , అలాగే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ జన సమితి ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్న, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తోపాటు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి, వాణీదేవి, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, అటు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌరి సతీశ్ తదితరులు పోటీపడుతున్నారు.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఒకటిది టీఆర్ఎస్ దికాగా… మరొకటి బీజేపీది. దీంతో అటు అధికార టీఆర్ఎస్..ఇటు బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించాయి. టీఆర్ఎస్ తరపున మంత్రులు, ముఖ్యనేతలంతా ప్రచారం చేశారు. ఇటు బీజేపీ కూడా తన ముఖ్యనేతలందరిని రంగంలోకి దించి… ప్రచారాన్ని కొనసాగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అరవింద్, అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకులు అందరూ ఈ రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులతో సభలు, సమావేశాలు నిర్వహించారు. కుల సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగాల భర్తీ, పీఆర్‌సీ, నిరుద్యోగ భృతి, ఎన్నికల హామీలు, విభజన హామీలు, పెట్రోధరలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సహా అనేక అంశాలు ఎన్నికల్లో ప్రచారంలో భాగమయ్యాయి.
మరోవైపు… గతంలో ఎన్నడూ లేనివిధంగా… ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో సైతం ప్రలోభాల పర్వం కొనసాగడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉన్నతవిద్యాను అభ్యసించిన పట్టభద్రలను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు.. , పార్టీలు ఆఖరి ప్రయత్నంగా
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. ఓటర్లను నగదు, మద్యం సీసాలు, స్వీటు బాక్సులు,
క్రికెట్‌కిట్లు చివరకు కొందరికి మేకపోతులు కూడా పంపిణీ చేసినట్లుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియాలో సైతం కథనాలు వచ్చాయి.
కొన్నిచోట్ల పార్టీల నాయకులు సంఘాల నేతలతో మాట్లాడి గంపగుత్తగా ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఓటర్లను విడివిడిగా బుట్టలో వేసుకునే పనిని క్షేత్రస్థాయి కేడర్‌కు అప్పగించడంతో చాలా ప్రాంతంల్లో నగదును సైతం పంపిణీ చేసినట్లు తెలిసింది.
పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలే అయినా కొందరు అభ్యర్థులు సాధారణ ఎన్నికల స్థాయిలో ఖర్చుచేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడలేదు. ఓ పార్టీ అభ్యర్థి ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చుపెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే సమావేశాలకు భారీగా వెచ్చించిన నేతలు ఓటుకు వెయ్యి నుంచి నాలుగు వేల వరకు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానంలో 5.05 లక్షల ఓటర్లుంటే..71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5.31 లక్షల మంది ఓటర్లుంటే.. ఏకంగా 93 మంది పోటీపడుతున్నారు. ఈసారి స్వతంత్రులు కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో ప్రతి ఓటు కీలకంగా మారింది.