మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు.. భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారన్న వైసీపీ నేతలు

0
778

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ ఒక నరరూప రాక్షసుడని.. తెలంగాణకు వైయస్ చేసిన నష్టం చాలా ఉందని అన్నారు. తండ్రి తప్పు చేసినా కొడుకు (వైయస్ జగన్) మంచి చేస్తాడని అనుకున్నామని, కానీ, మామిడి చెట్టుకు మామిడి కాయలే కాస్తాయి, చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయని విమర్శించారు.వైయస్ కడుపులో పుట్టినా అదే పద్ధతిలో జగన్ ఉంటాడని అనుకోలేదని మనుషుల్లో మార్పు వస్తుందని అనుకున్నామని, రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నామని అన్నారు. జగన్ తీరు కూడా దారుణంగా ఉందని అన్నారు. తెలంగాణకు అడుగడుగున వైయస్ నష్టం చేశాడని.. దోచుకుపోయినవాడిని దొంగ అనకపోతే ఇంకేమనాలని ప్రశ్నించారు. గతంలో వైయస్ దోచుకుపోయాడని, ఇప్పుడు ఆయన కొడుకు జగన్ దోచుకుపోతున్నాడని ఆరోపించారు. అందుకే దొంగ, గజదొంగ అని అంటున్నామని చెప్పారు. పోతిరెడ్డిపాడు కోసం దివంగత పీజేఆర్ కొట్లాడారని… ఆ తర్వాత ఏం జరిగిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పీజేఆర్ చావుకు వైయస్సార్ కారణం కాదా? అని ప్రశ్నించారు. పీజేఆర్ ను వైయస్ ఎంతో క్షోభ పెట్టాడని మండిపడ్దారు. వైయస్సార్ అంటే కేవలం దొంగ మాత్రమే కాదని… ఒక నరరూప రాక్షసుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు శాశ్వత నష్టం చేసే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. నిన్నటి వరకు మంచితనం ప్రదర్శించిన జగన్ ఇప్పుడు ఊసరవెల్లిలా మారారని మండిపడ్డారు.

ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ తెలంగాణ నేతలు జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వైయస్సార్ ఎంత చేశాడో అందరికీ తెలుసని చెప్పారు. భావోద్వేగాలను రెచ్చగొట్టాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండాలనేదే తమ ముఖ్యమంత్రి జగన్ విధానమని పేర్ని నాని అన్నారు. కృష్ణా నది నుంచి తాము ఒక్క గ్లాసు నీళ్లను కూడా ఎక్కువగా తీసుకోవడం లేదని.. నాగార్జునసాగర్, శ్రీశైలంలో కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని అన్నారు. కృష్ణా జలాల వినియోగంపై ఏవైనా సందేహాలుంటే చర్చించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నీటి వివాదంపై తెలంగాణ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వారి ధోరణి సరికాదని అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

7 + 1 =