More

    మరిన్ని ఆంక్షలు సడలించే దిశగా తెలంగాణ ప్రభుత్వం

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. దీంతో మరిన్ని సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు అమల్లో ఉంది. త్వరలో మరిన్ని గంటలు సడలింపులు ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు తెలంగాణ అధికారులు. జూన్ 19వ తేదీ వరకు ప్రస్తుతం ఉన్న సడలింపులు అమలులో ఉన్నాయి. ఆ తర్వాతి నుంచి ఉదయం పూట నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

    జూన్ 20వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 20 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఆర్టీసీ, మెట్రో రైలు సర్వీసు వేళలను పొడిగించనున్నారు. పార్కులు తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ-పాస్ నిబంధనలను కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. జులై 1 నుంచి పబ్‌లు, జిమ్‌లతోపాటు 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

    14-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,10,681 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,511 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 173 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 139 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 5 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 96.03 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో 12 మరణాలు సంభవించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,496కి పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,04,880కి చేరింది. ఇప్పటిదాకా 5,80,923 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,461 మందికి చికిత్స జరుగుతోంది.

    Trending Stories

    Related Stories