More

    ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాస్

    తెలంగాణలో ఇటీవల వెల్లడించిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలలో 51 శాతం మంది ఫెయిల్ అయ్యారు. ఫలితాలతో బాధపడిన విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాగా చదివే విద్యార్థుల ఫలితాల్లో కూడా ఫెయిల్ అయినట్లు వచ్చాయని.. కరెక్షన్ లోనే లోపాలు ఉన్నాయని విమర్శించారు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి.

    దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇక మీదట ఇలా పాస్‌ చేయడం కుదరదు. ఇప్పట్నుంచే విద్యార్థులు అందరూ కష్టపడి చదవండి. మంచి మార్కులు తెచ్చుకోవాలని సబితా ఇంద్రా రెడ్డి చెప్పుకొచ్చారు.

    పరీక్షలు ఫెయిలైన విద్యార్థులు ధైర్యంగా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలే కానీ పాస్‌ చేయాలని ఒత్తిడి తేవడం, ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదని అన్నారు. కరోనా కాలంలోనూ ఆన్‌లైన్‌ విద్యను అందుబాటులోకి తెచ్చామని.. దూరదర్శన్, టీశాట్‌ ద్వారా పాఠాలు చెప్పామన్నారు. ఇంటర్‌ విద్య బలోపేతం ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే 620 గురుకులాలు, 172 కస్తూర్బా కళాశాలలతోపాటు సంక్షేమ పాఠశాలలను ఇంటర్‌ స్థాయికి పెంచామన్నారు. విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు పెట్టామని తెలిపారు. ఆన్‌లైన్‌ విద్యపై నిందలేయడం కరెక్ట్ కాదని తెలిపారు. పరీక్షలు తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్‌ చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.

    గ్రేస్‌ మార్కులపై సమీక్షించామని.. ఫెయిల్‌ అయింది 2.35 లక్షల మంది కావడంతో 10 మార్కులు కలిపినా 8,076 మందే పాసయ్యేలా కనిపించారని తెలిపారు. 15 కలిపితే 24 వేలు, 20 కలిపితే 58 వేలు, 25 కలిపితే 72 వేలు, 30 మార్కులు కలిపితే 83 వేల మంది పాసవుతారని అన్నారు. ఉత్తీర్ణతకు కనీస మార్కులైన 35ను ఫెయిలైన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇక రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన సొమ్మును తిరిగిస్తామని మంత్రి సబిత ఇంద్రా రెడ్డి చెప్పారు. కావాలనుకున్న వాళ్లు ఎవరైనా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌ చేయించుకోవచ్చని, అప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వబోమన్నారు.

    Trending Stories

    Related Stories