హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయిన కాసేపటికే అక్కడ కలకలం రేగింది. ఈ సమావేశాల్లోకి ప్రవేశించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు సమావేశాలను వీడియో తీస్తూ కనిపించారు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నేతలు సదరు అధికారిని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారినని చెప్పగా.. ఆయన తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయనను సమావేశాల నుంచి బయటకు పంపేసినట్లు తెలుస్తోంది.
ఆ అధికారిని.. ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రావుగా గుర్తించారు. సదరు అధికారి పోలీసు పాస్‌తో సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. అయితే మీటింగ్ హాల్ లోకి వెళ్లేందుకు పోలీసు అధికారులకు ఎలాంటి అనుమతి లేదని బీజేపీ నేతలు తెలిపారు. “మేము అతన్ని పోలీసు కమిషనర్‌కు అప్పగించాము. అతను తన మొబైల్ ఫోన్‌లో తీసిన ఫోటోలను తొలగించాము” అని అతను చెప్పారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
తొలి రోజు సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ మోదీ తెలంగాణ నేతలను అభినందించారు.