రాజాసింగ్ అరెస్ట్‎పై ఉన్న తొందర.. కౌంటర్ దాఖలు చేయడానికి లేదా..? ఇదంతా పాతబస్తీ మిత్రుడి కోసమేనా..?

0
781

రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజాసింగ్‎పై నమోదు చేసిన పీడీ యాక్టుపై టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు చేసిన నాలుగు వారాలైనా ఇప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడమేంటని ప్రశ్నించింది. అంతేకాదు, కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం మరో రెండు వారాలు సమయం అడగటాన్ని తప్పుబట్టింది. ఈ నెల 20 లోపు కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇకపై గడువు ఏమాత్రం పెంచబోమని కూడా స్పష్టం చేసింది.

కొద్దిరోజుల క్రితం గోషామహల్ రాజాసింగ్ చేసిన ఓ వీడియో తీవ్ర వివాదానికి దారితీసింది. కేటీఆర్ ఒక వివాదాస్పద స్టాండప్ కమేడియన్ మునావర్ ఫరూఖీని రెడ్ కార్పెట్ పరిచి మీరీ హైదరాబాద్ ఆహ్వానించడంతో వివాదానికి బీజం పడింది. గతంలో హిందూ దేవీదేవతలను విమర్శించిన మునావర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అతడు ఎక్కడ షో నిర్వహించినా.. ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండటంతో.. గతంలో ఎన్నో రాష్ట్రాలు అతడి షోలను నిషేధించాయి. కానీ, అలాంటి వివాదాస్పద
స్టాండప్ కమేడియన్ కోసం కేటీఆర్ భారీ భద్రత ఇచ్చి మరీ హైదరాబాద్ లో షో ఏర్పాటుచేయించారు. ఈ నేపథ్యంలో హిందువులకు అన్యాయం జరిగితే తక్షణమే స్పందించే రాజాసింగ్.. మునావర్ ఫరూఖీ షో పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీంతో రాజాసింగ్ ను కేసీఆర్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే వీడియోను విడుదల చేసిన కేసులో రాజాసింగ్ కు బెయిల్ వచ్చింది. అయినప్పటికీ, మళ్ళీ పీడీయాక్టు వేసి రాజాసింగ్ ను మళ్లీ అరెస్టు చేయించారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఒవైసీ సూచనల మేరకే కేసీఆర్.. రాజాసింగ్ ను అరెస్ట్ చేశాడనే ఆరోపణలున్నాయి. ఎంతకాదన్నా.. కేసీఆర్, ఒవైసీ మంచి మిత్రులు. బాహాటంగా అడపా దడపా విమర్శలు చేసుకున్నా.. వారి స్నేహం శంకించలేనిది. ఎంఐఎం పార్టీకి ఎక్కువగా పట్టున్నది మాత్రం పాతబస్తీలోనే. పాతబస్తీలో దాదాపు అన్ని సీట్లను గెలుచుకున్నా,.. మధ్యలోని గోషామహల్ ను మాత్రం ఎంఐఎం పార్టీ గెలుచుకోలేకపోతోంది. దీంతో ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో ఎంఐఎం పార్టీ ఉంది. దీనికి కేసీఆర్ కూడా సహకరించి రాజాసింగ్ ను తొక్కివేయాలనే ప్రయత్నంలో భాగంగానే పీడీయాక్టు వేసి వేధిస్తున్నట్లు పలువురు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

అయితే ఇక్కడే కేసీఆర్ కాస్తంత తొందరపడినట్లు కనిపిస్తోంది. కేవలం ఒక్క నియోజకవర్గం కోసం కేసీఆర్ ఇదంతా చేస్తుండటం తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అదికూడా నిజమైన వీడియో తీసిన కేసులో బెయిల్ లభించినా.. ప్రత్యేకంగా పీడీయాక్టు నమోదు చేసి మరీ జైలుకు పంపడం పట్ల కాస్తంత వ్యతిరేకత కనబడుతోంది. దీంతో పాటు పీడీయాక్టులో కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేయడంతొ ఇదంతా తన అప్రకటిత మిత్రుడికోసమేననే అనుమానాలు తెలంగాణ ప్రజల్లో బలపడుతున్నాయి. దేశంలోని పలు సోకాల్డ్ సెక్యులర్ పార్టీలన్నీ ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు, చిన్న చిన్న తప్పిదాలు చేసే ఘోరంగా దెబ్బతిన్నాయి. బీజేపీ బలమైన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో హిందుత్వం విషయంలో ఆయా రాజకీయ పార్టీలు కాస్తంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దారుణంగా దెబ్బతినే అవకాశాలే ఎక్కువ. ఈ సత్య వాక్కును కేసీఆర్ గ్రహించి ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారో లేక సీఎం కుర్చీని బీజేపీకి బంగారు పళ్ళెంలో అందిస్తారో అనేది వేచిచూడాల్సిందే..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

eleven + two =