పైలట్ రోహిత్ రెడ్డికి సెక్యూరిటీ.. నిందితులకు రిమాండ్

0
746

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహార ఘటనకు సంబంధించి తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోహిత్ రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా.. ఆ సంఖ్యను 4+4కి పెంచింది. దీంతోపాటు ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో రోహిత్‌ రెడ్డి కీలకంగా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురుని రిమాండ్ కు తరలించేందుకు తాజాగా హైకోర్టు అనుమతించింది. ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ ను కొట్టివేసింది. పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్ ను అనుమతించింది. ప్రస్తుతం బయట ఉన్న నిందితులు వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు… నిందితులు హైదరాబాద్ ను విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. పిటిషన్ పై విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈ విచారణ సందర్భంగా నిందితులను రిమాండ్ కు అనుమతించింది.