More

    రాజసింగ్‎కు బెయిల్ మంజూరు..! షరతులేంటో తెలుసా..?

    గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‎కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. దాదాపు 75 రోజులుగా పీడీ యాక్టు కింద జైల్లో వున్న రాజాసింగ్‎కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇకపై ప్రెస్ మీట్లు, సభలు, సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొనకూడదనీ ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని హైకోర్టు షరతులు విధించింది.

    ఓ వివాదస్పద వీడియో కారణంగా.. రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో హిందూ దేవతలను కించపరిచిన వివాదాస్పద స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ ఫారూఖీ షో కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. గతంలో రాముడు, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఇతను ఎక్కడ షో లు నిర్వహించినా మతఘర్షణలు జరిగే అవకాశం ఉంటుందంటూ కొన్ని రాష్ట్రాలు అతని షోలకు అనుమతులను నిరాకరించాయి. అయితే, ఇంతటి వివాదాస్పద వ్యక్తికి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా కల్పించుకుని మరీ షో కు అనుమతిచ్చారు. అయితే ఈ షోను నిర్వహిస్తే తాను తప్పకుండా అడ్డుకుంటానంటూ ఈ ఏడాది ఆగస్ట్‌లో రాజాసింగ్‌ హెచ్చరించారు. అయినా తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత కల్పించి మునావర్‌ ఫారూఖీ షోకు అనుమతిచ్చింది. దీంతో ఆగ్రహించిన రాజాసింగ్ మునావర్ షో కు కౌంటర్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే అందులోని వ్యాఖ్యలు ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని ముస్లింలందరూ రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. దీంతో రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇతడిపై పీడీ యాక్టు నమోదు చేసి రిమాండ్ చేశారు.

    ఇక హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రాజాసింగ్ పై పీడీయాక్టును సమర్థించింది. రాజాసింగ్ జైలు నుంచి బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ బిస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. రాజాసింగ్ ఎన్నో సార్లు ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని కోర్టుకు తెలిపారు. అతనిపై ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయన్నారు. అతనిపై ఇప్పటికే 101 కేసులు ఉన్నాయని, అందులో18 కేసులు మత విద్వేషాలు రెచ్చ గొట్టేలా చేసిన కేసులు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో రాజసింగ్ బయటికి వస్తే లా ఆర్డర్ సమస్య తలెత్తుతుందని హైకోర్టుకు తెలిపారు. రాజాసింగ్ చేసిన వీడియో వల్ల హైదరాబాద్ లో అల్లర్లు జరిగాయని అందుకే ఇతడిపై పీడీ యాక్టు నమోదు చేయడం సబబేనని అడ్వకేట్ జనరల్ అన్నారు.

    ఇక రాజాసింగ్ తరపున న్యాయవాది రవి చందర్ మాట్లాడుతూ ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. రాజాసింగ్ ఏ మతాన్నీ కించపరిచలేదనీ, ఎవరినీ టార్గెట్ చేయలేదని వివరించారు. ఆయన సమాజంలోని బాల్యవివాహాలను రూపుమాపడానికి బాల్య వివాహం అనే ఒక నాటకాన్ని మాత్రమే ప్రజెంట్ చేసాడన్నారు. ఆ వీడియోలో మహమ్మద్ ప్రవక్త పేరును కూడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే రాజాసింగ్ పై కేసులు బనాయించిందని పీడీయాక్టు నమోదు చేసి ఆయనను జైలుపాలు చేయడానికి ప్రయత్నించిందని న్యాయవాది రవి చందర్ వాదించారు. ఈ వీడియోపై నాంపల్లి కోర్టు కూడా రిమాండ్ ను తిరస్కరించిందనీ అందుకే పోలీసులు అక్రమంగా పీడీయాక్టు నమోదు చేశారని హైకోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు రాజాసింగ్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

    Trending Stories

    Related Stories