వివక్షపై మరోసారి తన గళం వినిపించిన తమిళిసై

0
611

తెలంగాణ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను హాజరవుతున్న అధికారిక కార్యక్రమాలకు కూడా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడం లేదని.. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. మహిళా గవర్నర్ అని తనపై వివక్ష చూపిస్తున్నారని, రాజ్ భవన్ ను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ భవన్ కు, గవర్నర్ హోదాకు మర్యాద ఇవ్వడం లేదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే నాపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఇక ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని.. జిల్లాలకు వెళ్తే కలెక్టర్, ఎస్పీ రావడం లేదని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ అవసరం లేదంటూ తీర్మానం చేశారు. ఇదేం వివక్ష? ఇదేం మర్యాద? దీనికి రాష్ర్ట ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మా అమ్మ చనిపోతే రాష్ట్రపతి, ప్రధాని ఫోన్ చేసి పరామర్శించారు.. కానీ సీఎం మాత్రం పరామర్శించలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15న రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం వస్తారని సమాచారం ఇచ్చారు. సీఎం కోసం నేను, హైకోర్టు చీఫ్ జస్టిస్ వెయిట్ చేశాం. కానీ సీఎం రాలేదు. రావడం లేదని కూడా సమాచారం ఇవ్వలేదని అన్నారు.