నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్

0
724

హైద‌రాబాదీ యువ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. గురువారం రాత్రి ముగిసిన ఫైన‌ల్ మ్యాచ్‌లో థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేసిన నిఖ‌త్ వుమెన్స్ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచింది. మ‌హిళ‌ల ప్రపంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా 52 కిలోల విభాగంలో ఫైన‌ల్‌లో జిట్ పాంగ్‌పై ఆది నుండి ఆధిక్యం కనబరిచింది నిఖ‌త్ జరీన్. జిట్ పాంగ్ ను 5-0 తేడాతో చిత్తు చేసింది. ఫైన‌ల్ మ్మాచ్‌లో విజ‌యం సాధించిన నిఖ‌త్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించి 52 కిలోల విభాగంలో వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 52 కిలోల విభాగంలో జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది. 73 దేశాల నుంచి దాదాపు 310 మంది మహిళా బాక్సర్లు పాల్గొన్నారు. ఈ టోర్నీలో భారత్‌ నుంచి మొత్తం 12 మంది బాక్సర్లు బరిలోకి దిగగా.. నిఖత్‌ పసిడి సహా మనీషా మౌన్‌ 57కేజీ విభాగంలో, పర్వీన్‌ హుడా 63కేజీ విభాగంలో కాంస్యాలు సాధించారు.

స్వర్ణం సాధించిన ఆమెకు భారత రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్‌ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సాధించిన నిఖత్ జరీన్ కు పలువురు శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ యువతి నిఖత్ జరీన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు చెప్పారు.