More

  భగవద్గీతను చించేశారు.. వద్దన్నందుకు గెంటేశారు.. తెలంగాణలో ఓ సాధువు దుస్థితి..!

  కంచే చేను మేస్తే కాదను వారెవరు..? రాజే ఇది శాసనమని పలికిన ప్రతిఘటించు వారు ఎవరు అన్నారు ఓ సినీ కవి. అలాగే వుంది తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ తంతు. ధార్మిక రక్షణకు, దైవిక కార్యక్రమాల నిర్వహణకు, ఆధ్యాత్మిక సొబగులు సర్వ వ్యాప్తం చేయడానికి ఉద్దేశించింది దేవాదాయ, ధర్మాదాయశాఖ. సత్యశోధకులు, సాధుపుంగవులను సమాదరించి వారి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలు సైతం ఈ శాఖపై ఉంటాయి.. అలాంట ఎన్నో గొప్ప బాధ్యతలు కల్గివున్న దేవాదాయ, ధర్మాదయ శాఖ, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించి, అనుచిత కార్యానికి తలపడిదంటే.. ఎంత దారుణం. అదీ, ఓ సాధుపుంగవుని మీద ఈ దాష్టీకానికి తెగబడిందంటే ఎంత హేయం.

  సనాతన ధర్మంలో సాధువు అంటే అసాధారణమైన పవిత్రత కలిగిన వ్యక్తిగా, దైవసాన్నిధ్యానికి సామీప్యంలో వుండే వ్యక్తి అని అర్థం. మంచి, మానవత్వంతో మెలిగుతూ, సర్వప్రాణి శ్రేయస్సు కోసం పాటుపడే పరోపకారిగా, పవిత్ర హృదయులుగా గుర్తింపబడతారు. సంసార మోహాన్ని వదలి ధార్మిక జీవితాన్ని ఆశించేవాడు సాధువు. పూజా సామగ్రి, ధర్మసూక్ష్మ గ్రంథాలు అంటే సాధువులకు పంచప్రాణాలు. ఓ సాధువుకు ఆది పరంపరగా వస్తున్న గురు ఆత్మలింగాన్ని, పూజా సామగ్రి, ధార్మిక గ్రంథాలను దేవాదాయ సిబ్బంది ధ్వంసం చేసేశారు. ఆ సన్యాసి కాషాయ వస్త్రాలు చింపేశారు. పవిత్ర విష్ణుపురాణం, మహిమాన్విత భగవద్గీత నడిరోడ్డుపై పారవేశారు. దీంత, ఆ సర్వసంగ పరిత్యాగి.. ఆవేదనకు గురయ్యారు. అన్నపానీయాలు మాని నిరసన దీక్షకు దిగారు. ప్రాణత్యాగం చేసేయాలనే స్థితికి సైతం వచ్చేశారు. దైవ భక్తులను నిలువు దోపిడీ చేయడాన్ని సహించలేక.. ఇదేం తీరని దేవాదాయ సిబ్బందిని సాధువు ప్రశ్నించడమే.. ఈ అనుచితకార్యానికి కారణమైంది. తెలంగాణ ఎండోమెంట్ శాఖ తీరుపై హైందవ భక్త సమాజం నిరసన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో హిందూ ఆక్రోశం తారాస్థాయికి చేరింది.

  బాంబే ఐఐటీలో చదివి, ఉన్నత కొలువులో లక్షల రూపాయల జీతం పొందుతూ.. అత్యున్నత జీవితాన్ని గడుపుతున్న సమయంలో.. సాధుజీవనంపై మమకారం కలిగిన 25 ఏళ్ల ఓ యువకుడు.. ఆ లక్షల జీతాన్ని తృణప్రాయంగా ఎంచి, సర్వం త్యంజించి సన్యాసాశ్రమంలో ప్రవేశించారు. ఆయనే సిద్ధాశ్రమానికి చెందిన శ్రీ చైతన్య నంద స్వామి మహారాజ్. ఈ సాధువుకే ఈ అవమానం జరిగింది.

  సిద్ధాశ్రమానికి చెందిన సాధువులు ఎప్పుడూ పుణ్య నదుల్లో స్నానాలు ఆచరిస్తూ.. పవిత్ర దైవ క్షేత్రాలను దర్శించుకుంటూ, శిష్యపరంపరకు ఉత్తమ బోధనలు చేస్తూ.. కాలాన్ని సద్వినియోగం చేస్తూంటారు. ఇదే పరంపరకి చెందిన శ్రీ చైతన్య నంద స్వామి మహారాజ్, ఎన్నో సందర్భాల్లో వరంగల్ ను సందర్శించారు. తాజాగా, వరంగల్ లోని దివ్య పుణ్య క్షేత్రాలు దర్శించుకుని, కాజీపేట సమీపంలోని మెట్టుగుట్ట దేవాలయానికి చేరారు. పుణ్య కార్తీకమాసంలో ఇక్కడ పూజాదికాలు చేయాలని నిర్ణయించుకుని ఆయన ఇక్కడకు వచ్చారు. అప్పటి నుంచి అక్కడే వుంటూ.. మెట్టుగుట్ట కొండల్లో నివాసం వుంటూ.. ధ్యానముద్రలో జీవనం సాగిస్తున్నారు. విష పురుగులు, భయంకర సర్పాలు, క్రిమి, కీటకాలు తిరిగే కొండ ప్రాంతంలో.. ఈ సాధుపుంగవుడు కటిక నేలపై పరుండడం చూసి.. ఓ శివభక్తుడు చలించిపోయాడు. దైవకార్యాల నిమిత్తం భక్తబృందం ఆధ్వర్యంలో అక్కడ నిర్మాణమవుతున్న ఓ భవనంలో తలదాచుకోమని ఆ శివభక్తుడు కోరారు.

  ఆ భక్తుని కోరిక మేరకు.. తన ఆధ్యాత్మిక సంపదైన.. విష్ణు పురాణం, భగవద్గీత, గురువు ఆత్మలింగం తదితర సామగ్రిని అక్కడ వుంచి, కొండ మీద గుహలో ధ్యానం చేసుకుంటున్నాడు. సాధువు కొండమీద ధ్యాన ముద్రలో వుండగా, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత తమ సిబ్బందితో.. అక్కడి వచ్చి, అక్రమంగా లోనికి ప్రవేశించి.. కొంచమైనా పాపభీతి లేకుండా భగవద్గీత, విష్ణు పురాణ గ్రంథాలను చింపి పారేశారు. పూజా సామగ్రిని చెల్లాచెదురుగా పారవైచి, ఆత్మలింగాన్ని ఆరుబయట పడేశారు. అనంతరం ఆ సాధువు, ఈ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మ శక్తి సభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని, ఎండోమెంట్ అధికారులను నిలదీశారు. మీడియాను అప్రమత్తం చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం బహిర్గతమైది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.

  మెట్టుగుట్ట దేవస్థానానికి ఇటీవల కొత్త టెంపుల్ కమిటీ ఏర్పాటైంది. టెంపుల్ కమిటీ చైర్మన్ గా నవీన్ అనే వ్యక్తిని స్థానిక ఎమ్మెల్యే నియమించారు. అయితే, ఇక్కడి భక్తులు ఎన్నో బాధలు ఎదుర్కొంటూ, దోపిడీలకు గురవుతుంటే సాధువు చైతన్య నంద స్వామి కలత చెంది.. ఇది తగదని, మంచిగా మెలగమని టెంపుల్ కమిటీకి హితవు పలికారు. దీనిపై ఆగ్రహం చెందిన టెంపుల్ కమిటీ చైర్మన్ నవీన్, తన బాస్ ఆర్మూర్ రమేష్ సహకారంతో.. ఈ సాధువును ఇక్కడి నుంచి తరిమేయాలని నిర్ణయించుకున్నారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీతను రంగంలోకి దింపి.. సాధువును తరిమివేసే ప్రణాళిక రూపొందించారు. సాధువు సామగ్రి ధ్వంసం చేయడమే చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుయాయులు, టెంపుల్ కమిటీ చైర్మన్, దేవాదాయ సిబ్బంది కలిసి..సాధువుపై వివిధ రకాల ఒత్తిళ్లు తెచ్చి, నానా హింసలకు గురిచేస్తున్నారు. దీంతో, తనకు ప్రాణ హాని వుందని సాధు చైతన్య ఆనంద మహరాజ్ వెల్లడించారు.

  వాల్మీకి జాతికి చెందిన వృద్ధ దంపతులు భక్తిభావంతో ఇక్కడి దేవాలయంలో సేవలు అందిస్తున్నారు. దీనిపై టెంపుల్ అసిస్టెంట్ భాస్కర్ ఆగ్రహం చెంది.. ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదని, నీరు సైతం ముట్టుకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేశాడు. భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, కుల వివక్షత కూడదని అన్నందుకే తనని గెంటివేశారని, తనపై పగబట్టి హతమార్చడానికి సిద్ధం అవుతున్నారని ఆయన తెలిపారు. దీంతో, సాధువు చైతన్య ఆనంద మహారాజ్ జోక్యం చేసుకుని కుల వివక్షత కూడదని, భక్తిభావంతో ఎవరు దైవసేవ చేయడానికి ముందుకు వచ్చిన కాదనకూడదని తెలిపారు. కుల వివక్ష.. దైవదూషణ తో సమానమని, మహాపాపానికి అది హేతువు అవుతుందని చైతన్యానంద మహారాజ్ చెప్పారు. దీంతో..ఆయన కొండ మీద ధ్యానంలో వున్నప్పుడు దేవాదాయ సిబ్బంది ఈ అకార్యానికి దిగారు. ఈ విషయం మహరాష్ట్ర ముఖ్యమంత్రికి చేరడంతో, ఈ ఘటన గురించి, స్వామీజీ ఆరోగ్యం గురించి వాకబు చేసినట్టు తెలిసింది. తెలంగాణ ఎండోమెంట్స్ అధికారులు, సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

  Trending Stories

  Related Stories