Telugu States

భారీ వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 15వరకు రాష్ట్రమంతా వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈనెల 14,15 తేదీలలో జరిగాల్సిన ఎంసెట్ (TS EAMCET)పై భారీ వర్షాల ప్రభావం పడింది. అంతకు ముందు షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించిన అధికారులు.. ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జులై 18, 19, 20 న జరిగే ఎంసెట్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి 1,71,945 మంది దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150 మంది పోటీ పడుతున్నారు.

తెలంగాణలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది. ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్ ఏర్పాట్లు ఇంకా మొదలు కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎంసెట్ కేంద్రాలు నీట మునిగాయి. అదే సమయంలో పలు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరవడం కష్టమవుతుందని, ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. భారీ వర్షాలతో ఇప్పటికే మూడు రోజులుగా విద్యా సంస్థలను మూసి వేయగా.. ఈసెట్ వంటి పరీక్షలు కూడా వాయిదా వేశారు.

Related Articles

Back to top button