More

    కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ స్పందన ఇదే

    ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా.. ఇలా పలువురు కశ్మీర్ ఫైల్స్ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ ఫైల్స్’ ఏంటండి.. ఇదొక దిక్కుమాలిన వ్యవహారమన్నారు. ప్రగతిశీల ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎనకమిక్ ఫైల్స్, ఇరిగేషన్ ఫైల్స్ వంటి వాటిపై దృష్టి సారిస్తాయని, ఇలా కశ్మీర్ ఫైల్స్‌ను తెర పైకి తీసుకురావడమేంటని ప్రశ్నించారు. కశ్మీర్ ఫైల్స్ ఎవరికి కావాలని దానితోని వచ్చేదేంటని మండిపడ్డారు. ఇది కేవలం ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే వ్యవహారమని కశ్మీరీ పండిట్లే ఢిల్లీలో చెప్పారని అన్నారు. దేశాన్ని విభజించి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమాత్రం సరికాదన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పంజాబ్‌లో ఎలాగైతే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందో.. తెలంగాణలో పండించే యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. చిన్నజీయర్ స్వామితో తనకు విభేదాలున్నాయని ఎవరూ ఊహించుకోవద్దని అన్నారు. అసలు తమ మధ్య విభేదాలున్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. చిన్నజీయర్ స్వామికి, తనకు మధ్య అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దని హితవు పలికారు.

    కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క కొత్త ప్రాజెక్టును చేపట్టలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. దేశం అభివృద్ది పథంలో నడవాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండొద్దనే నిర్ణయానికి దేశం వచ్చిందని.. ఇటీవలి యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సీట్లు తగ్గడం దీనికి సంకేతమని అన్నారు.

    త‌మ పార్టీ కోసం ప‌నిచేస్తున్న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ డ‌బ్బులు తీసుకుని ప‌నిచేసే ర‌కం కాద‌ని అన్నారు. గ‌డ‌చిన 8 ఏళ్లుగా త‌న‌కు పీకేతో స్నేహం ఉంద‌ని, త‌న కోరిక మేర‌కే టీఆర్ఎస్ కోసం పీకే ప‌నిచేస్తున్నార‌ని కేసీఆర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నికల్లో బ‌లం త‌గ్గుతుంద‌ని తాను ముందే చెప్పాన‌ని గుర్తు చేశారు. గ‌తంలో 312 సీట్లు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 255 సీట్ల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. సీట్ల త‌గ్గుద‌ల దేనికి సంకేత‌మో బీజేపీనే ఆలోచించుకోవాల‌ని కేసీఆర్ అన్నారు.

    Trending Stories

    Related Stories